ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమన్నారంటే..?
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్లో చేరేందుకు అర్హత విషయం ప్రస్తావిస్తూ.. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు వారసులుగా భావించే వారికి తప్ప, ఆర్ఎస్ఎస్లోకి అందరికి తలుపులు తెరిచి ఉన్నాయని భగవత్ స్పష్టం చేశారు. మతం, కులం, వర్గం వంటి వాటిని బట్టి ఆరాధన పద్ధతులు మారుతుంటాయి కానీ.. సంస్కృతి ఒక్కటే అని అన్నారు. భారతీయులందరికి సంఘ్లోకి స్వాగతం అని స్పష్టం చేశారు. అయితే, భారత మాతను, భగ్వా జెండా(కాషాయ జెండా)ను గౌరవించే వాళ్లందరూ ఆర్ఎస్ఎస్లో చేరవచ్చునన్నారు.
మూడు రోజుల వారణాసి పర్యటనలో ఉన్న ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్.. స్థానికంగా కొనసాగుతున్న ఓ శాఖలో ఓ కార్యకర్త అడిగిన ప్రశ్నకు వివరమైన సమాధానం ఇచ్చారు. తన కాలనీలో ఉండే ముస్లిం ఫ్రెండ్ను తాను శాఖకు తీసుకు రావచ్చా? అని అడిగిన ప్రశ్నకు.. మోహన్ భగవత్ ఈ సమాధానం ఇచ్చారు. భారత్ మాతాకీ జై అని చెప్పే, కాషాయ జెండాను గౌరవంగా చూసే వారందరూ.. ఆర్ఎస్ఎస్లోకి రావొచ్చన్నారు. ఆరాధించే పద్ధతి ఆధారంగా సంఘ్ భావజాలం ఎలాంటి వివక్ష చూపించదన్నారు. మత ప్రాతిపదికన వివక్షను ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అంగీకరించదని భాగవత్ తెలిపారు.
అయితే, ఔరంగజేబు వారసులకు మాత్రం ఆర్ఎస్ఎస్లోకి ప్రవేశం లేదని స్పష్టం చేశారాయన. భారతీయులు వేర్వేరు మతాలను, భిన్న జీవన శైలిని అనుసరించినప్పటికీ వారంతా ఒకే సంస్కృతిని కలిగి ఉంటారని చెప్పారు. వివిధ విశ్వాసాలు, వర్గాలు, కులాల వారు అందరూ శాఖల్లో చేరవచ్చని అన్నారు. కుల వివక్ష, పర్యావరణ సమస్యలు, ఆర్థిక సవాళ్ల వంటి సమస్యలను పరిష్కరించేందుకు బలవంతమైన సమాజాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకత ఉన్నదని ఆయన చెప్పారు.