- వివాదం అవుతున్న మీనాక్షి నటరాజన్ వ్యవహారం
- సచివాలయానికి మీనాక్షి రావడం పట్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత
- మంత్రివర్గ విస్తరణ జాప్యానికీ మీనాక్షే కారణమంటున్న నేతలు
- కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో మీనాక్షి ఓవరాక్షన్ చేశారని విమర్శలు
- మీనాక్షి వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువన్న ప్రచారం
కాంగ్రెస్ పార్టీలో వివాదాలు కొత్తకాదు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీలో ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ విపక్షాల కన్నా సొంత పార్టీ నేతల తీరు వలనే పలు ఇబ్బందులను ఎదుర్కొంటోందని ఆ పార్టీ సీనియర్ నేతలు వాపోతున్నారు. పార్టీలో ఉంటూ పార్టీ గురించి, ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడే ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యే అనురుధ్ రెడ్డి, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి తదితరులు తమ వ్యాఖ్యలు, చర్యలతో రేవంత్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన సందర్భాలు అనేకం. ఇప్పటి వరకూ వీరితో ఇబ్బందులు పడ్డ సర్కార్ ఇప్పుడు ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ తీరుతో కక్కలేక మింగలేక అన్నట్లు విచిత్ర పరిస్ధితిని ఎదుర్కొంటోంది. మీనాక్షి వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న నిర్ణయాలు అటు తెలంగాణ కాంగ్రెస్ కి ఇటు ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారాయన్న ప్రచారం కాంగ్రెస్ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది.
మీనాక్షి రాక వల్ల పార్టీ బాగుపడుతుందన్న వాదన ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం ఆమె చేస్తున్న కొన్ని చర్యల వల్ల ఇటు పార్టీకి అటు ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తున్నాయని సీనియర్ నేతలు సైతం అంగీకరిస్తున్నారు. వచ్చిన వెంటనే పార్టీలో అన్నిస్థాయి నాయకులకు ప్రాధాన్యత ఉంటుందని ఎవరు ఇబ్బంది పడవద్దు అని ఇలాంటి చాలా విషయాల్లో ఆమె క్లారిటీ ఇచ్చారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆమె వ్యవహరించిన తీరు కూడా పార్టీ నాయకులకు మింగుడు పడడం లేదు. ఎవరూ ఊహించని విధంగా విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి రావడంలో మీనాక్షి కీలక పాత్ర పోషించిందని.. దీనివల్ల పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలకు అవకాశం రాలేదని విమర్శలు వచ్చాయి. ఇక మంత్రివర్గ విస్తరణ విషయంలో కూడా ఆమె జోక్యం పార్టీ నేతల్లో తీవ్ర అసహనానికి కారణం అవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిని ఈ పదిహేను మాసాలుగా ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. పలు కీలక శాఖలకు డెడికేటెడ్ గా మంత్రులు లేదు. పాలన సజావుగా సాగాలంటే మంత్రివర్గ విస్తరణ త్వరగా చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నప్పటికీ… ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి కొన్ని వర్గాలకు సంబంధించిన నేతలను రెచ్చగొట్టి విస్తరణ జాప్యం జరిగేలా చేస్తున్నారన్న ప్రచారం అధికార వర్గాల్లో జరుగుతోంది.
ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది తాజాగా కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమి విషయంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధుల నిరసన వ్యవహారంలో ఆమె నేరుగా సచివాలయానికి రావడం… మంత్రులు అధికారులతో భేటీ కావడం మరింత వివాదాస్పదమవుతోంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏఐసీసీ ఇన్‌ఛార్జులుగా పని చేసిన వీరప్పమొయిలీ, వయలార్ రవి, గులాం నబీ ఆజద్, దిగ్విజయ్ సింగ్ వంటి దిగ్గజ నేతలు కూడా తమ పార్టీనే అధికారంలో ఉంది కదా అని సచివాలయంలోకి అడుగుపెట్టే సాహసం చెయ్యలేదు. రాష్ట్ర విభజన తరువాత పది సంవత్సరాల విరామం తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మీనాక్షికి ముందు ఏఐసీసీ ఇన్‌ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షి కూడా సచివాలయంలోకి అడుగుపెట్టలేదు. కానీ మీనాక్షీ నటరాజన్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టి నెల కూడా తిరక్కుండానే సచివాలయానికి వచ్చి మంత్రుల చేత బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసిందనే ఆగ్రహం కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది.
మీనాక్షి నటరాజన్ ఏ హోదాలో సచివాలయానికి వచ్చిందని కొందరు ప్రశ్నిస్తున్నారు. పైగా వాస్తవాలు తెలుసుకోకుండా కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టే విధంగా మీనాక్షి వ్యవహరించిందని పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహారంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించి వివాదం చేస్తే ఆ ప్రచారమే సరైందన్న రీతిలో మీనాక్షి మంత్రులపై ఒత్తిడి తెచ్చి హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేయించి… ఇంత కాలం ప్రభుత్వం వ్యవహరించిన తీరు తప్పని మనికి మనమే చెప్పుకున్నట్లు అయ్యిందని ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.
గతంలో కూడా ఏఐసీసీకి సంబంధించిన ఇన్చార్జిలు హైదరాబాద్ కు వచ్చినప్పటికీ సెక్రటేరియట్ కి వెళ్ళిన సందర్భాలు లేవు… ఒకటి రెండు సందర్భంలో వెళ్లిన అవి ప్రత్యేక సందర్భాలుగా నేతలు గుర్తు చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదంలో ప్రభుత్వమే తప్పు చేసిందనే అభిప్రాయం కలిగించే విధంగా మీనాక్షి వ్యవహరించారని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తాజాగా జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలిసింది. చాలా విషయాల్లో ప్రభుత్వం క్లారిటీతో ఉన్న సొంత పార్టీకి సంబంధించిన కొందరు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ నుంచి మొదలుకొని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహారం దాకా అధిష్టానం పెద్దలుగా చెప్పుకుంటున్న కొందరు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. అంతిమంగా ఇలాంటి చర్యల వల్ల కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని సీనియర్లు అంటున్నారు. మొత్తానికి మీనాక్షి నటరాజన్ రాక పార్టీకి లాభం కన్నా నష్టం జరిగేలా ఉందన్నది తాజాగా వినిపిస్తున్న వాదన.