23.8 C
Hyderabad
Wednesday, July 29, 2026

Live Video

spot_img

ఫిర్‌ లాయేంగే కేజ్రీవాల్… నినాదం పని చేస్తుందా

  • ఈసారి ఆప్‌కు అధికారం సాధ్యమేనా…?
  • బీజేపీ 27 ఏళ్ళ నిరీక్షణ ఫలిస్తుందా…?
  • కాంగ్రెస్ ది శల్య సారధ్యమేనా…?
  • విడుదలైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌..
  • ఫిబ్రవరి5న ఎన్నికలు..8న ఫలితాలు..

ఫిర్‌ లాయేంగే కేజ్రీవాల్‌… ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నినాదమిది. కేజ్రీవాల్‌ను తిరిగి గెలిపించుకుందాం.. అన్న నినాదంతో ఆప్‌ శ్రేణులు ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ఓపక్క మెడకు చుట్టుకున్న లిక్కర్‌ కేసు, మరోవైపు మంత్రులపై అవినీతి ఆరోపణలు, ఆప్ పార్టీలో అసంతృప్తులు, అలకలు, తగ్గుతున్న కేజ్రీవాల్‌ క్రేజ్‌.. ఒక పక్క.. ఇండీ కూటమిలో కీలక భాగస్వామి అయిన కాంగ్రెస్‌ శల్య సారధ్యం మరోవైపు బీజేపి పవర్‌ గేమ్‌ మధ్య కేజ్రీవాల్‌ ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.

గతంలో కేజ్రీవాల్ అంటే ఒక ప్రభంజనం.. ఆయన ఆలోచనా ధోరణి, అమలు చేసిన హామీలు, ప్రజల్లో సాధించుకున్న నమ్మకం..ఇవన్నీ ఒకప్పుడు ఆప్‌ ట్రాక్ రికార్డు. కానీ ఇప్పుడు మెడకు చుట్టుకున్న మనీలాండరింగ్‌ కేసు, పార్టీలో అంతర్గత సమస్యలు.. ముఖ్యంగా ఇండీ కూటమిలో టాప్‌ లీడర్‌ అయిన కాంగ్రెస్ సహాయ నిరాకరణ ఒక పక్క.. ఇక అవినీతి ఆరోపణలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై సాక్షాత్తు మోడీ లాంటి టాప్‌ లీడర్‌ కేజ్రీవాల్‌ పై విమర్శనాస్త్రాలు సంధించడంతో ఆప్‌ పార్టీ ఫిల్‌ లాయేంగే కేజ్రీవాల్‌ నినాదం ఉత్కంఠ రేపుతోంది. ఢిల్లీ ఎన్నికలు పనిచేసే రాజకీయ నాయకులకు, దూషించే రాజకీయ నాయకులకు మధ్య జరుగుతున్న ఎన్నికలని, తమ నిజమైన బలం ప్రజలేనని అంటున్నారు కేజ్రీవాల్‌.

బరిలో హేమా హేమీలు…

కేజ్రీవాల్ పోటీచేస్తున్న ఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఈసారి ఉద్దండ పిండాలు బరిలోకి దిగుతున్నారు. కేజ్రీ కి దీటుగా కాంగ్రెస్‌, బీజేపీలు మాజీ సీఎంల కుమారులను రంగంలోకి దింపుతున్నాయి. ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడైన సందీప్‌ దీక్షిత్‌ కాంగ్రెస్ తరపున, మరో మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పరేష్ వర్మను బీజేపి బరిలోకి దింపింది. అగ్రనేతల వారసత్వం వీరికి ప్లస్ పాయింట్‌ కాగా, స్వశక్తితో ఎదిగిన కేజ్రీవాల్‌కి ఇది నాల్గవ ఎన్నిక. ఇప్పటికే హాట్రిక్‌ సీఎంగా అతనికి రికార్డు ఉంది. 2013లో కాంగ్రెస్ సీనియర్ నేత అయిన షీలా దీక్షిత్‌ ను మట్టి కరిపించిన ఘనత కేజ్రీవాల్‌ దే. అయితే సందీప్‌ దీక్షిత్‌ పొలిటికల్ గా క్రియాశీలకంగా మారడానికి ఈ ఎన్నికలో విజయం అత్యవసరం. రెండు సార్లు ఎంపీగా గెలిచిన సందీప్‌ దీక్షిత్‌కి షీలా రాజకీయ వారసత్వం ఒక అసెట్‌. అయితే నిధుల దుర్వినియోగం ఆరోపణలు అప్పట్లో ఆమె ఓటమికి కారణమైంది. కానీ ఇప్పుడు కేజ్రీవాల్‌ పై కూడా అలాంటి ఆరోపణలున్నాయి. బీజేపి, కాంగ్రెస్‌ ముప్పేట దాడి ఇప్పటికే మొదలెట్టేశాయి.

తొలి ఎన్నికతోనే  భారీ విజయం…

2013లొ కేజ్రీవాల్‌ ఎన్నిక ఢిల్లీ రాజకీయాల్లో చాలా పెద్ద మార్పు..షీలా దీక్షిత్‌ పై ఏకంగా 25 వేల మెజారిటీ ఓట్లతో ఆయన అద్భుత విజయం పొందారు. ఆ తర్వాత 2015,2020 ఎన్నికల్లో కూడా ఆ హోల్డ్ కనపడింది.ఇప్పుడూ అదే ధీమాతో అడుగులేస్తున్నా.. ఈసారి కాంగ్రెస్, బీజేపి కూడా వారసులను బరిలోకి దింపడం కేజ్రీకి గెలుపు అంత ఈజీ కాదని చెబుతోంది.

స్థానికాంశాలే కీలకం…

ఢిల్లీ ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట.. కానీ కేజ్రీవాల్ రాకతో సీన్‌ మారిపోయింది. ఆకర్షణీయమైన హామీలు, వాటి అమలు, తొలిసారి వినూత్నంగా అమలు చేసిన కొన్ని స్కీమ్స్ కేజ్రీవాల్‌ క్రేజ్‌ ను పెంచేశాయి. అవే వరుసగా మూడు సార్లు విజయాలను సాధించి పెట్టాయి. కానీ గత ఎన్నికల్లో గెలుపు తర్వాత పొలిటికల్‌ సీన్‌ మారిపోయింది. ఆప్ ట్రాక్‌ రికార్డు కి ఎదురు దెబ్బలు తగులుతూ వచ్చాయి. కీలక భాగస్వామి కాంగ్రెస్‌తో కలసి పంజాబ్‌ లో అధికారం పంచుకున్నా.. అక్కడి హామీలను అమలు చేయలేదన్న విమర్శలను ఆప్‌ పార్టీ ఎదుర్కొంటోంది. ఆ నేపధ్యంలో ఢిల్లీలో గతంలో చేసిన వాగ్దానాల పరిస్థితిపై బీజేపి, కాంగ్రెస్ విమర్శలతో ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. ఢిల్లీ ఎన్నికలలో స్థానికంగా అపరిష్కృతంగా ఉన్న ఎన్నో అంశాలు ఎన్నికల అజెండాగా మారుతున్నాయి. తాగు నీటి సమస్య, ట్రాఫిక్ జామ్‌ సమస్యలు, నిరుద్యోగం, కాలుష్యం అతిపెద్ద సమస్యలుగా నిలుస్తున్నాయి. ఢిల్లీ శివార్ల గ్రామాలకు తాగునీటి కటకట ఇప్పటికీ ఉంది. అలాగే అనేక బస్తీల్లో నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. పబ్లిక్‌ సెక్టర్‌ సిబ్బందికిచ్చిన హామీలు పూర్తిగా నెరవేరలేదు. కొన్ని ఏరియాలకు రక్షిత మంచినీరు ఇప్పటికీ కరువే.

సక్సెస్‌ ఫార్ములా…

ఆప్‌ సక్సెస్‌ ఫార్ములా ఎప్పుడూ సంక్షేమ పథకాలే. ఢిల్లీ మహిళల కోసం ప్రత్యేకంగా కొన్ని ఫ్రీ బీ స్కీమ్స్ ప్రకటించింది. మహిళలందరికీ బీమా, ఉపాధి హామీ, హెల్త్ కార్డులు, ఆర్థిక భరోసా కల్పించే అనేక హామీలను గుప్పించింది. మహిళలకి అందించే ఆర్దిక నగదు మొత్తాన్ని పెంచి రెండు వేలు చేశారు. గతంలో ఆప్‌ విజయంలో ఆటో డ్రైవర్లది కీలక పాత్ర. ఈసారి ఎన్నికల్లో గెలిస్తే ఆటో డ్రైవర్ల ఆడపిల్లల పెళ్లిళ్లకు లక్ష రూపాయల నగదు ఇస్తామని,పది లక్షల విలువైన బీమా సౌకర్యం కల్పిస్తామనీ కేజ్రీవాల్ అనౌన్స్ చేశారు.

అయితే విద్య, ఆరోగ్య రంగాల్లో కేజ్రీవాల్‌ అమలు చేసిన కొన్ని సంస్కరణలు ఆ పార్టీకి మంచిపేరు తెచ్చాయి. అలాగే విద్యుత్‌ బిల్లుల తగ్గింపు, తక్కువ ధరకే నాణ్యమైన తాగు నీరు అందించిన ఘనత కేజ్రీవాల్ ప్రభుత్వం సొంతం. అలాగే పార్టీపై ఎన్ని విమర్శలెదురైనా, క్లిష్టమైన పరిస్థితులు తలెత్తినా కింది స్థాయి కేడర్ చెక్కు చెదరకుండా అడుగులేయడం ఆప్ పార్టీకి కలిసొచ్చే అంశం. ఇక నిన్న మొన్నటి వరకూ మిత్రపక్షమైన కాంగ్రెస్సే ఎదురు తిరిగి తీవ్రమైన విమర్శలకు పాల్పడింది. కేజ్రీపై ఘాటైన, తీవ్రమైన విమర్శలతో ఇబ్బంది పెట్టింది. ఓ దశలో ఇండీ కూటమి నుంచి బయటకు వెళ్లిపోతామని, లేదా కాంగ్రెస్ ను బయటకు పంపాలని కూడా కేజ్రీవాల్‌ బెదిరించారు. అయినా ఇప్పటికీ కాంగ్రెస్ వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడుతోందన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. అయితే తాజాగా కుదిరిన సయోధ్య ప్రకారం ఢిల్లీలో ఇతర సీట్లలో పోటీ మాటెలా ఉన్నా ఢిల్లీ నియోజక వర్గం వరకూ కేజ్రీవాల్‌ కు ఎలాంటి ఇబ్బందులు కలిగించబోమన్న కాంగ్రెస్ హామీ కొంత ఊరటనిచ్చే అంశం.

ఏఐ సాయంతో ప్రచారం…

ఈ సారి ఢిల్లీ ఎన్నికలకోసం అందరికన్నా ముందు ప్రచారం మొదలు పెట్టేసింది ఆప్‌ పార్టీయే. ఒక పద్ధతి ప్రకారం క్యాండిడేట్స్ అనౌన్స్ మెంట్‌ కూడా చేసేసింది. సీట్ల కేటాయింపులో ఏ మాత్రం ఇబ్బందులు పడలేదు. అలకలు, అసంతృప్తులూ తక్కువే. సంక్షేమ పథకాలపై జోరుగా ప్రచారం చేసేసుకుంది. ఢిల్లీలో వాడ వాడలా కేజ్రీవాల్‌ తన టీమ్‌తో పర్యటించారు. ఎన్నికల బరిలో అందరికంటే ముందుగా ఒక ప్లాన్డ్ కాంపెయినింగ్‌ కి ఆప్‌ పూనుకుంది. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లను వాడుకోడం, ఫేస్ బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌ స్టా లాంటి ఇతర మోడ్రన్ టెక్నిక్స్ తో ప్రచారానికి పదును పెట్టింది. అంతేకాదు ఆర్టి ఫీషియల్‌ ఇంటెలిజెన్స్ ను బాగా వాడుకుంటున్న పార్టీ కూడా ఆప్‌ మాత్రమే.

లిక్కర్‌సిండికేట్‌ ఆరోపణలు…

లిక్కర్‌ పాలసీ డిజైనింగ్‌ లో కుంభకోణానికి పాల్పడినట్లు కేజ్రీవాల్‌ పై ఆరోపణలు నైతిక ఇమేజ్ ని దెబ్బతీశాయి.తీహార్ జైలు పక్షి అని బీజేపి, కాంగ్రెస్  గేలి చేస్తున్నాయి. ఈ ఆరోపణలు ఆయన ఇమేజ్ పై ప్రభావం చూపినా అదే లిక్కర్ పాలసీ ఆయన్ను గెలిపించినా ఆశ్చర్యం లేదు. కారణం లిక్కర్‌ కాంట్రాక్టుల్లో ఆయన ఎంత లాభపడ్డారో తెలీదు కానీ ఢిల్లీ ప్రజలకి మాత్రం చాలా సరసమైన రేట్లకే మద్యం సప్లయ్‌ చేసిన నేత. ఢిల్లీ లో దిగువ మధ్యతరగతి ఓటర్లంతా మొన్న మొన్నటి వరకూ చవకగా మద్యం కొని తాగిన వారే. ఆ సింపతీ కలిసొస్తే.. ఎన్నికల్లో నెగటివ్‌ ఇమేజ్‌ పాజిటివ్ గా మారొచ్చు. ఇక ఆప్‌ అని పార్టీ పేరుపెట్టుకుని అందుకు భిన్నంగా విలాసవంతమైన ఇంద్రభవనం కట్టుకున్నారన్న ఆరోపణలు ఆయనకు పెద్ద మైనస్.. టాయిలెట్లు సైతం బంగారంతో నిర్మించుకున్నారని, ఆధునిక, సాంకేతిక టెక్నాలజీతో ఫైవ్ స్టార్‌ హోటల్‌ రేంజ్లో ఇల్లు కట్టుకున్నారని ఆప్ అధినేతపై రేగుతున్నమరో ఆరోపణ.మోడీ కూడా ఈ ఆరోపణలను ఒక రేంజ్ లో గుప్పిస్తున్నారు.

 బోగస్‌ ఓట్ల తొలగింపు రగడ…

కేజ్రీవాల్‌ ఓటు బ్యాంకును టార్గెట్ చేసిన బీజేపి ఇప్పటికే అష్టదిగ్బంధనం చేసేసింది. ఢిల్లీకి పరిమిత అధికారాలు కట్టబెట్టడంతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అక్రమ ఓట్ల తొలగింపు పేరుతో పెద్ద డ్రైవ్ నే చేపడుతోంది కేంద్రం.. ఢిల్లీ మురికి వాడల్లో ఉన్న రోహింగ్యాలు, బంగ్లాదేశీ నిర్వాసితులను ఏరిపారేస్తోంది. ఆధార్‌ కార్డులు,ఓటర్ల గుర్తింపు కార్డుల చెకింగ్‌ జరుగుతోంది. బోగస్‌ ఓట్ల తొలగింపు కూడా ఊపందుకుంది. అనేక నియోజక వర్గాల్లో లక్షల్లో ఓట్లను తొలగిస్తున్నారు. దీనిపై ఆప్‌ పార్టీ ఒంటరి పోరాటం చేస్తోంది.

కేజ్రీకి చావో రేవో…

ఢిల్లీ ఎన్నికల్లొ కాంగ్రెస్ ప్రభావం ఈ సారి అంతంత మాత్రం.. ఆ పార్టీ పోటీ నామ్ కేవాస్తేగానే లెక్కించొచ్చు. ఒకప్పుడు చక్రం తిప్పినా, ఇప్పుడా సీన్‌ ఆ పార్టీకి లేదు. అందుకే కేజ్రీవాల్‌ ఓటమికి పరోక్షంగా సహకరిస్తోందని విమర్శలనెదుర్కొంటోంది. ఆప్‌ నేతలను ఇబ్బంది పెట్ట స్టేట్ మెంట్లు, కామెంట్లు, వ్యూహాలతో అడుగులేస్తొంది కాంగ్రెస్. కానీ బీజేపి మాత్రం దేశ రాజధాని నడిబొడ్డును తమ అధీనంలోకి తీసుకోవాలని తెగ ఆరాటపడుతోంది. మోడీ లాంటి స్థాయి వ్యక్తి ప్రచారం, చేస్తున్న ఆరోపణలు,అనుసరిస్తున్న వ్యూహాలు చూస్తే ఢిల్లీ ఆ పార్టీకి ఎంత కీలకమో తెలియ చేస్తున్నాయి. ఇక కేజ్రీవాల్‌ కి ఈ ఎన్నికలు చావో రేవో లాంటివి.. ఇప్పుడు గెలిస్తేనే ఆయన రాజకీయ భవితవ్యానికి ఒక భరోసా ఉంటుంది. ఓడితే మాత్రం ఆప్ పతనం ఇక ఖాయమైపోయినట్లే..

గెలుపుపై బీజేపీ ధీమా…

భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీ ఢిల్లీ రాష్ట్రంలో అధికారం కోల్పోయి 27 సంవత్సరాలు అయ్యింది. ఓపక్క అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండా పాతుతుంటే దేశ రాజధాని ప్రాంతంలో మాత్రం పట్టు కోల్పోయామనే బాధ బీజేపీ శ్రేణుల్లో ఎప్పటి నుంచో ఉంది. అందుకే ఈ సారి ఎప్పటి నుంచో ఒక క్రమ పద్దతిలో కేజ్రీవాల్‌ని ఆయన మంత్రివర్గ సహచరులను అవినీతి పరులుగా చూపిస్తూ జైళ్ళకు కూడా పంపింది. కేజ్రీ ప్రతి చర్యను పోస్టుమార్టం చేసి ప్రజల ముందు ఉంచింది. లిక్కర్ స్కామ్‌ అయితే ఏంటి 35 కోట్ల వ్యవయంతో సీయం నివాసం ఆధునీకరణ వ్యవహారాన్ని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. ఇవన్నీ ఈ సారి బీజేపీ గెలుపునకు దోహదపడతాయని ఆ పార్టీ భావిస్తోంది.

వచ్చేనెల 5న పోలింగ్‌..8న లెక్కింపు…

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమరానికి గంట మోగింది. ఎన్నికల కమిషన్‌ కాసేపటి క్రితం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చేనెల 5న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు8న జరుగుతుంది. మొత్తం 70 నియోజకవర్గాలున్నాయి. వీటిలో 12 రిజర్వుడు నియోజకవర్గాలున్నాయి. దాదాపు 13,033 పోలింగ్‌ స్టేషన్లు అందుబాటులో ఉంటాయి. ఒకే విడతలో ఢిల్లీ ఎన్నికలు పూర్తి చేయనున్నారు. ఈనెల 17 నామినేషన్లకు చివరి రోజు. ఉపసంహరణకు గడువు జనవరి 20. ఎన్నికల తేదీ వెలువడటంతో కోడ్ అమల్లొకి వచ్చినట్లయ్యింది. 2 లక్షల మంది యువత తొలిసారి ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. 85 ఏళ్లు పై బడిన వారు ఇంటి దగ్గరే ఓటు హక్కును వినియోగించుకునే సౌకర్యం ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com