ఒంటిమిట్టను టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇక్కడికి విచ్చేసే భక్తులు రెండు, మూడు రోజులు గడిపేందుకు కావాల్సిన అన్ని సదుపాయాలను అందిస్తామని ఆయన అన్నారు. కడప జిల్లా ఒంటిమిట్టలో జరిగిన శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో చంద్రబాబు దంపతులు పాల్గొని స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు.
కల్యాణోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ సంయుక్త ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించారు. జనాకీ వల్లభుల కల్యాణాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ఆలయానికి సమీపంలోని కల్యాణ వేదిక వద్ద 23 భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. భద్రత చర్యలగా 3వేల మంది పోలీసులతో పాటు సీసీ కెమెరాలు, డ్రోన్లను వినియోగించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులతో ఒంటిమిట్ట ప్రాంగణం కిటకిటలాడింది.
ఈ పావన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు కుటుంబంతో కలిసి హాజరై, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు మరియు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శ్రీ సీతారాముల కళ్యాణాన్ని దర్శించుకున్నారు. బ్రహ్మాండమైన వైభవంతో జరిగిన ఈ ఉత్సవాన్ని చూస్తుంటే, సీతారాములు భూలోకానికి వచ్చి స్వయంగా కళ్యాణం చేసుకుంటున్నారనే అనుభూతి కలుగుతోందని సీఎం పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ఇక్కడికి వచ్చిన భక్తులంతా ఓ సంకల్పం చేసుకుని వెళ్తున్నారు. సీతారాములు ఆదర్శ దంపతులు. పరిపాలన అంటే రాముడి పాలన జరగాలి. రామరాజ్యం రాబోవాలని ఆకాంక్షిస్తున్నాను. సీతారాముల కళ్యాణాన్ని మన ఒంటిమిట్టలో జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను,’’ అని చంద్రబాబు అన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన గుర్తు చేశారు. ఆలయంలో 11వ శతాబ్దానికి చెందిన ఏకశిలా విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని, ఈ ప్రాంతమంతా దేవుని నామస్మరణతో ప్రతిధ్వనించాలి అన్నారు. ఇక్కడి చెరువు ఆధునీకరణ పనులు ప్రారంభించామని వెల్లడించారు.
‘‘రాముడి పాలన ఇవ్వాలని, రామరాజ్యం తేవాలనేదే నా ఆకాంక్ష. ఇది శ్రీరాముడి సాక్షిగా చేస్తున్న ప్రతిజ్ఞ. ప్రతి ఒక్కరికీ మేలు చేయడమే నా ధ్యేయం. రామరాజ్యంలో పేదరికం ఉండకూడదు. స్వర్ణాంధ్రప్రదేశ్‌గా అభివృద్ధి చెందాలి. పేదరికం తొలగి, ఆర్థిక అసమానతలు లేకుండా ఉండాలని ఆశిస్తున్నాను. సంపాదనలో కొంత భాగాన్ని దేవుడికి కేటాయించి ఆలయాల అభివృద్ధికి సాయపడుతున్నారు, ఇది అనందించదగ్గ విషయం. మానవ సేవే మాధవ సేవ. దేవుడికి సేవ చేయడమంటే మన చుట్టూ ఉన్నవారిని సమానంగా అభివృద్ధి చేయడమే. శ్రీరాముడి స్ఫూర్తితో పేదలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి,’’ అని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.