-
భారత్, పాక్‌లకు వార్నింగ్ ఇచ్చానంటున్న ట్రంప్
-
ఇరు దేశాలే కాదు.. అమెరికా వాణిజ్యంపైనా ప్రభావం
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కాల్పుల విరమణకు తానే కారణమని, అణు యుద్ధాన్ని కూడా తానే అడ్డుకున్నానని క్లెయిమ్ చేసుకుంటున్నారు. యుద్ధం ఆపకపోతే వాణిజ్యాన్ని నిలిపేస్తామన్న తన హెచ్చరికలతోనే పరిస్థితి నియంత్రణలోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. దీంతో, ఇప్పుడు భారత్, పాకిస్థాన్‌లతో అమెరికా వాణిజ్యాన్ని పూర్తిగా నిలిపేస్తే నిజంగా నష్టపోయేది ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది.
భారత్‌పై ప్రభావం:
2021–22లో భారత్–అమెరికా మధ్య వాణిజ్యం 119.42 బిలియన్ డాలర్లు కాగా, ఇందులో $76.11 బిలియన్ డాలర్లు ఎగుమతులు, 43.31 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు ఉన్నాయి. అమెరికా భారత్‌కు అతి పెద్ద ఎగుమతి మార్కెట్‌గా ఉండి, మొత్తం ఎగుమతుల్లో 18శాతం వాటాను కలిగి ఉంది. అలాంటప్పుడు వాణిజ్యం ఆగిపోతే ఫార్మా, ఐటీ సేవలు, ఆభరణాలు, టెక్స్‌టైల్స్ వంటి రంగాలు తీవ్రంగా నష్టపోతాయి. ముఖ్యంగా టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీల ఆదాయంపై దీని ప్రభావం గణనీయంగా ఉంటుంది. అంతేకాక, అమెరికాతో ఉన్న రక్షణ, సాంకేతిక ఒప్పందాలు నిలిచిపోతే వ్యూహాత్మకంగా కూడా భారత్ నష్టపోతుంది. అయితే, భారత్‌కు యూరోప్, ఆసియా, మధ్యప్రాచ్యం వంటి ప్రత్యామ్నాయ ఎగుమతి మార్కెట్లు ఉన్నందున, ఈ ప్రభావాన్ని కొంతవరకు తగ్గించగలగడం విశేషం. దేశీయ వృద్ధిశక్తి, సరఫరా శృంఖలాల పునఃనిర్మాణం ద్వారా కూడా తేలికపాటుగా తేరుకునే అవకాశముంది.
పాకిస్థాన్‌పై ప్రభావం:
ఇక, పాకిస్థాన్ విషయానికి వస్తే.. అది చిన్నదైన ఆర్థిక వ్యవస్థ. అమెరికాపై అధికంగా ఆధారపడుతుంది. టెక్స్‌టైల్, కాటన్, లెదర్ రంగాలే ప్రధాన ఎగుమతులు. టెక్స్‌టైల్ రంగం దాదాపు 60శాతం ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండగా, అమెరికా ఆర్ధిక, సైనిక సహాయం నిలిచిపోతే తీవ్ర మాంద్యం నెలకొంటుంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌కి ఇది మరింత దెబ్బ. చైనా ఆధారంగా కొంత వరకు తట్టుకోగలిగినా, దీర్ఘకాలంలో ఈ సహాయం అప్పుల భారం పెంచుతుంది. అమెరికా మద్దతు లేకపోతే పాకిస్థాన్ అంతర్జాతీయంగా ఒంటరిగా మిగిలే ప్రమాదం ఉంది.
అమెరికాకు జరిగే నష్టం:
అమెరికా కూడా పూర్తిగా నష్టమేమీ కాదు. భారత్ నుంచి ఫార్మా ఉత్పత్తులు, ఐటీ సేవలు, పాకిస్థాన్ నుంచి టెక్స్‌టైల్స్ లాంటి దిగుమతులు ఆగిపోతే సప్తై చైన్స్ దెబ్బతింటాయి. భారత్‌ను ఇండో–పసిఫిక్ వ్యూహంలో భాగస్వామిగా కోల్పోవడం ద్వారా ఆసియాలో తన ప్రాబల్యం కొంత తగ్గిపోతుంది. పాకిస్థాన్‌తో సంబంధాలు పడిపోయినా, ఆఫ్ఘనిస్థాన్, మధ్య ఆసియాలో గూఢచర్యం వంటి అంశాల్లో మరింత అసౌకర్యం ఏర్పడుతుంది. అదే సమయంలో చైనా, రష్యా వంటి దేశాలు ఈ ఖాళీని నింపే అవకాశముంది, దీని వల్ల అమెరికా గ్లోబల్ ప్రభావం కొంత తగ్గే ప్రమాదం ఉంది.
మొత్తంగా చూస్తే, వాణిజ్యం పూర్తిగా నిలిచిపోతే పాకిస్థాన్ అత్యధికంగా నష్టపోయే దేశంగా నిలుస్తుంది. చిన్నదైన ఆర్థిక వ్యవస్థ, అమెరికాపై ఎక్కువ ఆధారం, అప్పుల భారం, సైనిక బలహీనతలు దీనికి కారణాలు. భారత్ కూడా నష్టపోతుంది, కానీ దాని వైవిధ్యమైన మార్కెట్లు, దేశీయ మద్దతు వల్ల ప్రభావం తక్కువగా ఉంటుంది. అమెరికా కూడా కొంతవరకు ప్రభావితమవుతుంది, అయితే దాని ప్రపంచ స్థాయి సంబంధాలు ఈ నష్టాన్ని సమర్థవంతంగా ఎదర్కోగలుగుతాయి.