దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల వేడి శీతాకాలపు చల్లదనాన్ని తరిమేస్తోంది. బరిలో ఉన్న పార్టీలు పోటాపోటీ ప్రకటనలు, విమర్శలు, వ్యూహాలు-ప్రతివ్యూహాలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. మొత్తం దేశాన్ని ఏలుతున్నా…గుండెకాయ లాంటి ఢిల్లీ మాత్రం బీజేపీకి అందని ద్రాక్షగా ఊరిస్తూనే ఉంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఏడుకు ఏడు లోక్ సభ స్థానాల్లో పాగా వేసిన కమలదళాధిపతులు ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీలో గెలుపు టార్గెట్ గా పావులు కదుపుతున్నారు. మరోవైపు అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొంటూ గత పదేళ్లుగా ఢిల్లీని పెట్టని కోటగా మార్చుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ మరోదఫా ఢిల్లీయెట్ ల మనసు చూరగొనటానికి వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మరో రెండు నెలల్లో ఢిల్లీ ఎన్నికలు జరుగనున్నాయి. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీ గడువు ఫిబ్రవరి 15, 2025తో ముగియనుంది. ఢిల్లీ అసెంబ్లీకి త్రిముఖ పోరు జరుగనుంది. బరిలో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ ఉన్నా ప్రధాన పోటి ఆప్, బీజేపీ మధ్యే ఉండనుంది. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు బరిలో నిలబెట్టేందుకు గెలుపు గుర్రాలను ఎంపిక శరవేగంగా చేస్తున్నాయి.
ఓటు బదిలీ ఢిల్లీ ట్రెండ్-
ఈసారి గెలుపు అటు ఆప్ కు, ఇటు బీజేపీకి ఇజ్జత్ కా సవాల్ గా మారాయి. ఈసారి ఎవరు గెలిచినా అది రికార్డే అవుతుంది. ఆప్ అధికార పీఠాన్ని నిలబెట్టుకోగలిగితే సామాన్యుడిగా రాజకీయ రంగంలోకి వచ్చి నాలుగో సారి గెలుపు బావుటా ఎగుర వేసిన రికార్డు అరవింద్ కేజ్రీవాల్ ఖాతాలో పడుతుంది. ఒకవేళ కమలం వికసిస్తే 25 ఏళ్ళ నిరీక్షణ ఫలించినట్లు అవుతుంది. కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా తక్కువ. 2014 కంటే ముందు కాంగ్రెస్ పదిహేనేళ్ల పాటు ఢిల్లీ గడ్డను ఏకఛత్రాధిపత్యంగా పాలించినా…షీలా దీక్షిత్ తర్వాత హస్తం పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఆ తర్వాత నుంచి బరిలో గిత్తల్లా బీజేపీ, ఆప్ కోట్లాడుకుంటున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో కమలం అన్ని స్థానాలు ఊడ్చేస్తుంటే…అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తన దరిదాపుల్లోకి ఎవరూ రాకుండా చూసుకోగలుగుతోంది. ఢిల్లీ ఓటర్ చాలా వ్యూహాత్మకంగా, స్పష్టంగా లోక్ సభ ఎన్నికల్లో కమలానికి, అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కు పట్టం కడుతున్నాడు. పదేళ్ల కిందట 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం 7 లోక్ సభ స్థానాల్లో కమలం వికసించాయి. కాంగ్రెస్, ఆప్ కు ఢిల్లీ ఓటర్లు మొండి చేయి చూపించారు. ఆ తర్వాత ఏడాదే 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ 70కి గాను 67 స్థానాలతో చరిత్ర సృష్టించగా బీజేపీ మూడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఇద్దరి పోటీ మధ్య హస్తానికి చోటు లేకుండా పోయింది. ఓటింగ్ శాతం చూస్తే లోక్ సభ ఎన్నికల్లో కమలానికి 46 శాతం, ఆప్ కు 33 శాతం, కాంగ్రెస్ కు 15 శాతం ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది. ఆప్ 54 శాతం, బీజేపీ 32 శాతం ఓట్లు తెచ్చుకున్నాయి. ఐదేళ్ల తర్వాత కూడా ఢిల్లీ ఓటర్ దృక్పథంలో మార్పు రాలేదు. ఇదే ట్రెండ్ నమోదు అయ్యింది. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ మరోసారి ఏడు కు ఏడు స్థానాలు గెలిచి తనకు తిరుగులేదని నిరూపించింది. కాని 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కేజ్రీవాల్ 62 స్థానాలు సాధించి ఢిల్లీ గడ్డ పై తనదే ఆధిక్యం అని చాటిచెప్పారు. ఈదఫా కూడా కాంగ్రెస్ ఖాతా తెరువలేకపోయింది. ఓటర్ స్విఫ్ట్ అయిన తీరు చూస్తే లోక్ సభ ఎన్నికల్లో కాషాయం ఎకాఎకిన 57శాతం ఓట్లతో అందనంత ఎత్తుకు ఎదిగితే ఆప్ 18 శాతానికి పడిపోయింది. ఒక్క సీటు కూడా రాకపోయినా కాంగ్రెస్ అనూహ్యంగా 23 శాతం ఓట్లను కొల్లగొట్టగలిగింది. అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి కేజ్రీవాల్ 54 శాతం ఓట్లను తన ఖాతాలో వేసుకుంటే బీజేపీ 39 శాతంతో సరిపెట్టుకుంది. ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లోనూ పాత పంధానే రిపీట్ అయ్యింది. మొత్తం 7 లోక్ సభ స్థానాలు కాషాయదళం ఖాతాలోనే పడ్డాయి. అసెంబ్లీలోనూ ఇదే ట్రెండ్ రిపీట్ అయితే ఆప్ గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఢిల్లీ ఓటర్ మనసు మార్చుకుంటే ఫలితాలు మరోరకంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే గత పదేళ్ల ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు విశ్లేషిస్తే ఆప్ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూనే ఉన్నా…బీజేపీ నెమ్మదిగా బలపడటం కనిపిస్తోంది. ఒకటి అయితే స్పష్టం అవుతుంది. బీజేపీకి, ఆప్ కు మధ్య అటూ ఇటూగా బదిలీ అవుతున్న 15 నుంచి 20 శాతం ఓటర్లే ఫలితాలను నిర్ణయిస్తున్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేజ్రీ అన్నది వీరి ఛాయిస్ గా అర్థం అవుతోంది. అందుకే ఈ స్విఫ్ట్ ఓటర్ల పైనే పార్టీలు ఆశలు పెట్టుకుంటున్నాయి.