33.2 C
Hyderabad
Wednesday, September 16, 2026

Live Video

spot_img

వైసీపీలో నెక్ట్స్‌ ఎవరు?

మొన్న గుంటూరు.. నిన్న కృష్ణా.. ఇప్పుడు చిత్తూరు… ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడీ అంశం హాట్‌ టాపిక్‌ అవుతోంది. ఏపీలో వరుస అరెస్టులు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలను భయపెడుతున్నాయి. ఇప్పటికే పలువురు అరెస్టు అటయ్యారు. కొందరు జైలుకు వెళ్లి.. బెయిల్‌పై బయటకు వచ్చారు. మరికొందరు ఇంకా జైలులోనే రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో మరికొంత మంది పేర్లు వినిపిస్తుండటం కలకలం రేపుతోంది.

ఇప్పటికే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌లు జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చారు. తర్వాత కొన్ని రోజుల క్రితం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్‌ చేశారు. ఆయన ఇప్పటికీ విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. పోసానికి రైల్వే కోడూరు కోర్టు పధ్నాలుగు రోజులు రిమాండ్ విధించింది. దీంతో పోసాని తర్వాత ఎవరు అరెస్ట్ అవుతారన్న దానిపై వైసీపీలోనూ, ఏపీ రాజకీయాల్లోనూ జోరుగా చర్చ జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ తెలుగు దేశం, జనసేన క్యాడర్ నుంచి ఒకటే డిమాండ్ వినపడుతోంది. తమ అధినేతలను, వారి కుటుంబాలను కించపరిచే విధంగా మాట్లాడిన వారిని ఇంకా ఎందుకు లోపలెయ్యడం లేదంటూ తెలుగు తమ్ముళ్లు ఆవేశంగా ప్రశ్నిస్తున్నారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని చంద్రబాబు తరచూ చెబుతూ వస్తున్నారు. కానీ, తొమ్మిది నెలలవుతున్నా తమ అధినేతలను, కుటుంబ సభ్యలను కించపర్చిన వారిని అరెస్ట్ చేయకపోవడం ఏంటని టీడీపీ సోషల్ మీడియా టీమ్‌లు ప్రశ్నిస్తున్నాయి. అరెస్ట్ చేయాలంటూ నిలదీస్తున్నాయి.

ఇక, ఇప్పుడు పోసాని కృష్ణ మురళి తర్వాత నెక్ట్స్‌ జాబితాలో ఎవరు అరెస్ట్ అవుతారన్న దానిపై పెద్దయెత్తున ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మాజీ మంత్రి కొడాలి నాని ఇందులో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారని చెబుతున్నప్పటికీ, ఈసారి మాత్రం చిత్తూరు జిల్లాకు చెందిన ఒక నేతను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయన్న పోస్ట్‌ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అటు.. అనంతపురం జిల్లాకు చెందిన హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మార్చి 5వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, గోరంట్ల మాధవ్ కంటే ముందుగా రెడ్డి సామాజికవర్గం నేత ఒకరిని అరెస్ట్ చేసే అవకాశముందని టీడీపీ క్యాడర్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే సదరు నాయకుడిపై అనేక కేసులు నమోదయి ఉండటంతో పాటు అనేక అక్రమాలు గత ప్రభుత్వ హయాంలో జరిగాయన్న అభియోగాలతో త్వరలోనే అరెస్ట్‌కు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వైఎస్‌ఆర్‌ సీపీ నేత పూనూరు గౌతమ్‌ రెడ్డిని పోలీసులు శుక్రవారం విచారణకు పిలిచారు. గండూరు ఉమా మహేశ్వర శాస్త్రిపై హత్యాయత్నం కేసులో విచారణకు విజయవాడ సత్యనారాయణ పురం పోలీసులు గౌతమ్‌ రెడ్డిని విచారణకు పిలిచారు. దీంతో, ఆయన పోలీసుల ముందు హాజరయ్యారు. ఒకవేళ.. ప్రచారం జరుగుతున్నట్లు ఆ రెడ్డి నాయకుడు అరెస్ట్‌ అయితే వైసీపీని ఒక కుదుపు కుదిపినట్లే అవుతుందన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. బడా నేతను అరెస్ట్ చేయడంతో టీడీపీ నేతలతో సుదీర్ఘకాలం వైరం ఉన్న ఆ నాయకుడి పనిపట్టాలని చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు కూడా పట్టుబడుతున్నారట. దీంతో.. త్వరలోనే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆ నాయకుడిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోందంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పటి వరకు కృష్ణా, గుంటూరు జిల్లాలకే పరిమితమయిన అరెస్టుల పర్వం.. ఇక చిత్తూరు జిల్లాకు పాకే అవకాశముందని తేలడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీలో కొంత అలజడి చెలరేగుతోందనే చెప్పాలి. మొత్తం మీద ఏపీలో వరుస అరెస్టులతో వైసీపీ నేతల్లో ఒక రకమైన అలజడి నెలకొంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com