36.2 C
Hyderabad
Wednesday, April 22, 2026

Live Video

spot_img

నాగబాబు ప్రమాణస్వీకారం ఎప్పుడు…?

చడీచప్పుడూ లేకపోవడంతో అభిమానుల్లో ఆందోళన

పవన్ కళ్యాణ్ ఈ విషయంపై మాట్లాడకపోవడంపై శ్రేణుల్లో విస్మయం

కొణిదెల నాగేంద్ర బాబు ఉరఫ్ నాగబాబు… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఎప్పుడు ప్రమాణస్వీకారం చేస్తారు…? ఈ అంశంపై మెగా అభిమానుల్లోనే కాదు… తెలుగు రాష్ట్రాల ప్రజలు, రాజకీయ వర్గాల్లో సైతం ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. నాగబాబును మంత్రిమండలిలోకి తీసుకుంటానని స్వయంగా చంద్రబాబు పేరుతో ప్రెస్ నోట్ విడదలై రెండు వారాలు కావస్తోంది. రాజ్యసభ అభ్యర్ధుల ప్రకటన సందర్భంగా వారి పేర్లతో పాటు అదే ప్రెస్ నోట్ లో నాగబాబు విషయం కూడా ప్రస్తావించిన చంద్రబాబు ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించడం జరిగిందని వెల్లడించారు. ఆ రోజు నుంచి నేటి వరకూ మళ్ళీ ఈ విషయంపై ఎవరూ కిక్కురు మనలేదు. కూటమి నేతలు ఎవరకూ కూడా ఈ ప్రస్తావన తేవడం లేదు. జనసేన నేతలు చివరికి పవన్ కళ్యాణ్ కూడా తన అన్న మంత్రి పదవి విషయంలో ఎక్కడా నోరు తెరవలేదు. అసలింతకీ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేక రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక నేపధ్యంలో ఉత్పన్నమైన పరిస్ధితులను చక్కబెట్టడానికో… వేరెవరికో తాత్కాలిక ఉపశమనం కల్పించడానికో ఆ ప్రకటన విడుదల చేశారా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవతున్నాయి.

తన అన్న నాగబాబుకి రాజకీయ భవిష్యత్తు కల్పించాలని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆది నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. జనసేన పార్టీ పెట్టిన తరువాత తొలిసారిగా పోటీ చేసిన 2019లో నాగబాబును నరసాపురం లోక్ సభ స్ధానం నుంచి పోటీ చేయించి పార్లమెంట్ కు పంపాలనుకున్నా… నాగబాబు ఓటమి పాలవడంతో అప్పట్లో ఆ కల నెరవేరలేదు. 2024లో మంచి ఊపు మీద ఉన్నాం… పొత్తులు అన్నీ బాగా కుదిరాయి ఈ సారైనా అన్నను పార్లమెంటుకు పంపాలనుకుంటే పొత్తు ధర్మం అడ్డొచ్చింది. వాస్తవానికి అనకాపల్లి లోక్ సభ స్ధానం నుంచి పోటీ చెయ్యడానికి నాగబాబు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పట్టణంలో ఇల్లు కూడా తీసుకుని పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే అనకాపల్లి స్ధానం బీజేపీ సీయం రమేష్ కోసం పట్టుబట్టడంతో జనసేన ఆ స్ధానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. తమ్ముడి ఆదేశాలతో తట్టాబుట్టా సర్దుకుని హైదరాబాద్ ఫ్లైటెక్కేసారు నాగబాబు. అయితే ఆ సందర్భంలో నాగబాబు చేసిన త్యాగానికి భవిష్యత్తులో మాంఛి పదవి ఇస్తానని చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి ప్రామిస్ చేశారని ప్రచారం జరిగింది.

వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు ముగ్గురు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చెయ్యడంతో నాగబాబు చట్టసభలకు వెళ్ళే ఘడియలు ఆసన్నమయ్యాయనుకున్నారు జనసేన కార్యకర్తలు. అయితే ముందగా జరిగిన ఒప్పందంలో భాగంగా మూడు రాజ్యసభ పదవులు ఎప్పుడో రిజర్వ్ అయిపోవడంతో నాగబాబుకు మళ్ళీ అన్యాయం జరిగినట్లు అయ్యింది. అయితే ఈ హాఠాత్పరిణామం కూటమిలో ఎక్కడ బీటలు తెస్తుందో అన్న ముందస్తు ఆలోచనతో చంద్రబాబు అప్పటికప్పుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నామని ప్రకటించేశారు. ప్రకటన అయితే చేశారు కానీ అందుకు తగ్గ విధివిధానాలపై మాత్రం చంద్రబాబు క్లారిటీ ఇవ్వలేదు. నాగబాబుని ఎప్పుడు మంత్రివర్గంలోకి తీసుకుంటారు…? ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉంటుంది…? ఏ శాఖను ఇవ్వనున్నారు వంటి అంశాలపై స్పష్టత లేకపోవడంతో జనసైనికుల్లో గుబులు పట్టుకుంది. పై పెచ్చు నాగబాబుకు మంత్రి పదవి అనౌన్స్ చేసిన వెంటనే టీడీపీ యువ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి రాజుకుంది. సోషల్ మీడియాలో చంద్రబాబు నిర్ణయాన్ని ఏకిపారేయడం ప్రారంభించారు. కూటమిలో ఒక భాగస్వామ్య పార్టీకి నాలుగు మంత్రి పదవులు ఇస్తే అందులో మూడు ఒకే సామాజికవర్గానికి ఎలా ఇస్తారని… ఈ సాంప్రదాయం మంచిది కాదని తెలుగు తమ్ముళ్ళు సామాజిక మాధ్యమాల్లో గళమెత్తారు. ఈ వంకతో చంద్రబాబు ఎక్కడ తమ నాయకుడి అన్నకు మంత్రిపదవి ఎగ్గొడతారేమో అనే ఆందోళన జనసైనికుల్లో మొదలయ్యింది. అందుకే చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయినప్పుడల్లా నాగబాబు విషయం ప్రస్తావనకు వచ్చిందేమో అని ఆసక్తిగా ఆరా తీస్తున్నారు.

నాగబాబుకి పవన్ కళ్యాణ్ అన్నగా పదవి ఇస్తున్నారు తప్పితే ఆయనకు స్వతహగా ఉన్న కాలిబర్ ఏంటని తెలుగుదేశం నేతలు చేస్తున్న దుష్ప్రచారంపై జనసైనికులు మండిపడుతున్నారు. నాగబాబు రేయింబవళ్లు పార్టీ కోసం కష్టపడ్డారని ఎన్నికల్లో ఆయన చేసిన సమన్వయం కారణంగానే జనసేన ఓట్లు నూటికి నూరు శాతం టీడీపీకి బదిలీ అయ్యాయని జనసేన శ్రేణులు అంటున్నాయి. నాగబాబుకు ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చినా చట్ట సభలకు ఎన్నికవ్వడానికి ఆరు నెలల సమయం ఉంటుంది కాబట్టి ఈ లోపు ఎమ్మల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయని జనసైనికులు ధీమాతో ఉన్నారు. అయితే ఎన్నికల హామీల తరహాలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని ఇచ్చిన హామీ విషయంలో కూడా చంద్రబాబు ఎక్కడ మీనమేషాలు లెక్కపెడతారో అని ఆందోళణ చెందుతున్నారు జనసైనికులు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com