28.7 C
Hyderabad
Thursday, April 23, 2026

Live Video

spot_img

విస్తరణకు ముహూర్తం ఎప్పుడు…?

  • తెలంగాణ క్యాబినెట్ విస్తరణ పై మళ్లీ చర్చ
  • స్థానిక సంస్థల ఎన్నికల లోపు భర్తీ జరిగే అవకాశం
  • వీటితో పాటు పలు కీలక పదవుల భర్తీ
  • మంత్రివర్గంలో స్థానం కోసం కీలక నేతల ప్రయత్నాలు
  • కీలక శాఖలకు మంత్రులు లేకపోవడం వల్ల సమస్యలు అంటున్న సీనియర్లు

దసరా పోతే దీపావళి ఉందిగా… దిపావళి కూడా పోతే మళ్లీ దసరా వస్తుందిగా అన్నట్లు ఉంది తెలంగాణలో పూర్తి స్ధాయి మంత్రివర్గ పునర్‌వ్యవస్ధీకరణ వ్యవహారం. తెలంగాణ క్యాబినెట్ విస్తరణ పై ఏడాదికాలంగా చర్చ జరుగుతున్నా అధిష్టానం నుంచి మాత్రం ఇప్పటి వరకు గ్రీన్ సిగ్నల్ లభించలేదు. నిజానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరు నెలల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ విస్తరణ కోసం చాలా ప్రయత్నించారు. దాదాపుగా ఖరారు అయిందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే చివరి నిమిషంలో అధిష్టానం కొత్త పిసిసి అధ్యక్షుని నియమించింది తప్ప క్యాబినెట్ విస్తరణకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావడం, అదేవిధంగా సంక్రాంతి ఉత్సవాలు కూడా ముగుస్తున్న నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది.. రానున్న రోజుల్లో మంచి రోజులు మంచి ముహూర్తాలు ఉన్న నేపథ్యంలో క్యాబనేట్‌ విస్తరణకి ఈసారైనా అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని రేవంత్ రెడ్డితో పాటు ఆశావాహులు కూడా ఆశ భవంతో ఉన్నారు.

ఇటీవల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా కూడా క్యాబినెట్‌తో పాటు పలు కార్పొరేషన్ల పదవుల భర్తీ.. పార్టీ పదవుల భర్తీపై చర్చ జరిగింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న వేళ వీటన్నిటిని వెంటనే భర్తీ చేయాలని పలువురు నాయకులు వేణుగోపాలకు సూచించారు. ఆయన కూడా త్వరలో భర్తీ చేస్తామని ప్రకటించారు. క్యాబినెట్ విషయానికొస్తే తెలంగాణ కేబినెట్ లో ప్రస్తుతం సీఎంతోపాటు 11 మంది మంత్రులుగా ఉన్నారు. మరో ఆరుగురిని కొత్తగా మంత్రి వర్గంలోకి తీసుకొనే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాల ఆధారంగా కొత్త వారికి అవకాశం కల్పిస్తారని తెలిస్తోంది. ప్రస్తుత మంత్రివర్గంలో ప్రాతినిధ్యంలేని ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యం దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్న వారిలో నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ పేర్లు దాదాపు కొలిక్కి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సైతం మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉంది. అదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్ ను కేబినెట్ లోకి తీసుకుంటారని టాక్ నడుస్తోంది. ఒక మంత్రి పదవి హైదరాబాద్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతకు, మరో పదవి బీసీ లేదా ఎస్టీ వర్గాలకు రిజర్వ్‌ చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది.. కీలకమైన హోంశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విద్యాశాఖలకు ప్రస్తుతం మంత్రులు లేరు ఇవి ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి.. అత్యంత కీలకమైన శాఖలు కావడం చేత వీటికి మంత్రులు ప్రత్యేకంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఈ మూడు శాఖలు కూడా నేరుగా ప్రజలతో సంబంధాలు ఉన్న శాఖలు కావడం చేత విస్తరణ త్వరితగతిన జగరుగుతుందని అధికారవర్గాల నుంచి వినిపిస్తోంది.

మరోవైపు డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ చీఫ్ విప్ పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. మండలి ప్రభుత్వ చీఫ్‌విప్‌ నియామకం జరిగినప్పటికీ అసెంబ్లీకి సంబంధించి ప్రభుత్వ చిప్ విప్ నియామకం జరగలేదు. వీటిపై కూడా పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నారు. అదేవిధంగా వివిధ దేవాలయాలకు సంబంధించిన పాలక మండళ్ళ పదవి కాలం పూర్తి కావడంతో పాటు ప్రభుత్వం మారినప్పుడు కొత్త వాటిని నియమించే ఆనవాయితీ ఉంది. అయితే గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పాలక మండలి చాలా చోట్ల ఇప్పటికి కొనసాగుతున్నాయి. వీటిని కూడా త్వరగా భర్తీ చేయాలని స్థానిక నేతలు కోరుతున్నారు. ఆంధ్రప్రదశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎటువంటి సమయం తీసుకోకుండా అప్పటి వరకూ కొనసాగుతున్న నామినేట్‌ పదవులన్నింటినీ భర్తీ చేశారు. చివరికి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నియమించిన రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్న వారిని సైతం రాజీనామాలు చేయించాలని ప్రయత్నించారు. పలువురు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులతో కూడా రాజీమానాలు చేయించారు.  అదే పద్దతిలో తెలంగాణలో కూడా నామినేటెడ్‌ పదవుల్లో కొనసాగుతున్న బీఆర్ఎస్‌ నాయకులను, మద్దతుదారులను ఒక్క జీఓతో తొలగించవచ్చని ఎందుకు మీనమేషాలు లెక్కపెడుతున్నారో అర్ధం కావడం లేదని సగటు కాంగ్రెస్ కార్యకర్త ఆవేదనతో ఉన్నాడు. అయితే స్ధానిక సంస్ధల ఎన్నికలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో ఆలోగా మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్‌ పదవుల భర్తీ కూడా పూర్తి చేస్తే లోకల్‌ బాడీస్‌ ఏకపక్షంగా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉంటాయని ఆ పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com