రేవంత్ రెడ్డి ఏం సాధించారని ఏడాది సంబరాలు చేస్తున్నాడనే ప్రశ్న రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి వస్తోందని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి దుర్మార్గాలపై సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో శనివారం జరగనున్న సభా ఏర్పాట్లను ఈటెల గురువారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తన స్ధాయి హోదా మరచి డీఎన్ఏ టెస్ట్, గుజరాత్ గులాం అంటూ కిషన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సభకు జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా హాజరుకానున్నారని తెలిపారు. ప్రజలు స్ధిరమైన ప్రభుత్వం కోరుకునే హర్యానా, మహారాష్ట్రల్లో బీజేపీకి పట్టం కట్టారన్నారు. ప్రతిపక్షాలు చేతకాక ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేస్తోందని ఈటెల విమర్శించారు. ఆ రెండు పార్టీలదీ డ్రామా అని తేలిపోయిందన్నారు. మోడీకి తెలంగాణకు ఏమి ఇవ్వాలో తెలుసని అన్నారు. కేంద్రం తెలంగాణకి 2 లక్షల 50 వేల ఇళ్ళు ఇచ్చిందని వాటినే నిర్మించారు తప్పితే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని ఈటెల తెలిపారు. అవి ప్రధాని ఆవాస్ యోజన ఇళ్ళు అని వాటికి ఇందిరమ్మ ఇళ్ళు అని పేరు ఎలా పెడతారని ఈటెల రాజేందర్ నిలదీశారు.