పాలన చేతగాకపోతే.. ముక్కు నేలకురాసి దిగిపోండి… డీకేఅరుణ
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్క గ్యారెంటీ అమలు చేయకుండా మోసం చేసిందని బీజేపీ ఎంపీ డీకేఆరుణ మండిపడ్డారు. ఆదివారం హైదరబాద్ లో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. రైతులను మోసం చేస్తాం, హామీలు మమ అనిపిస్తాం, అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటాం అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఎన్నికల ముందు రైతు భరోసా 15వేలు ఇస్తామని ఇప్పుడు రాష్ట్రం అప్పుల పాలయ్యింది 12 వేలే ఇస్తామంటే కుదరదన్నారు. రాష్ట్రం అప్పుల పాలయ్యిందని హామీలు ఇచ్చేముందు ఈ దద్దమ్మలకు తెలియదా అని నిలదీశారు. మాట తప్పినందుకు రేవంత్ రెడ్డి రైతులకు బేషరతు క్షమాపణలు చెప్పాలని డీకేఅరుణ డిమాండ్ చేశారు. 15వేల రైతు భరోసా హామీ ఇచ్చారు.. దానిని నెరవేర్చాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి పైనే ఉంది నెరవేర్చకపోతే ముక్కు నేలకు రాసి రైతులకు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు క్షమాపణ చెప్పాలని డీకేఅరుణ అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రాజెక్టుల కోసం కొట్లాడింది మా నాన్న చిట్టెం నర్సిరెడ్డి అని అలాంటిది ఏ అర్హత ఉందని పాలమూరు రంగరెడ్డికి జైపాల్ రెడ్డి పేరు ఎలా పెడతారని బీజేపీ ఎంపీ ప్రశ్నించారు. ఆనాడు టీడీపీలో ఉండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును రేవంత్ రెడ్డి వ్యతిరేకించారని ఆమో గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన నిధులతో ఇళ్ళు కడుతూ వాటికి ఇందిరమ్మ ఇళ్ళు అని పేరు ఎలా పెడతారని డీకేఅరుణ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఏంజరుగుతోందో అర్ధం కావడం లేదని విద్యార్థినులకు భద్రత లేకుండా పోయిందని హాష్టళ్ళలో సీక్రెట్ కెమెరాలు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో బూతులు తిట్టిస్తారా… చెప్పేవి నీతులు… సోషల మీడియాలో బూతులా అని డీకే ఆరుణ ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో విమర్శలు స్వీకరిస్తూ పనితీరును సరిచేసుకోవాలని అరుణ హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే వారకూ వదిలేదే లేదని బీజేపీ ఎంపీ డీకేఅరుణ హెచ్చరించారు.