- వక్ఫ్ బోర్డు పరిధిలో వేల కోట్ల భూములు
- రక్షణ శాఖ తర్వాత అంత ఎక్కువ భూములు వక్ఫ్ కే
- యూపీలో దేశంలోకే అత్యధిక వక్ఫ్ ఆస్తులు
- ఏళ్ల తరబడి వక్ఫ్ ఆస్తులపై నో సర్వే
- నిరర్ధకంగా పడి ఉన్న వేల కోట్ల ఆస్తులు
- మరికొన్ని అక్రమంగా బోర్డు పరిధిలోకి
- అన్ క్లెయిమ్డ్ ఆస్తులూ వక్ఫ్ ఖాతాలోనే
- వక్ఫ్ నిర్ణయాలను ఎదిరించే వీలు లేకపోవడం
- సచార్ కమిటీ సూచనలు అమలు సరిగా లేకపోవడం
- అక్కౌంట్ల నిర్వహణలో లోపాలు
- జవాబు దారీ తనం, పారదర్శకత లేని విధానాలు
ఎన్డీఏ ప్రభుత్వం ఎట్టకేలకు లోక్ సభలో వక్ఫ్ బిల్లును ఆమోదింప చేసుకుంది. హోరా హోరీ 12 గంటల చర్చ అనంతరం లోక్సభ ఈ బిల్లును288 ఓట్లతో గట్టెక్కించింది. కాగా 232 మంది ఈ బిల్లును వ్యతిరేకించారు.వక్ఫ్ ఆస్తుల నియంత్రణ విషయంలో మరిన్ని మార్పులు, చేర్పులు, అధికారాలు ప్రభుత్వ పరిధిలోకి తెచ్చే ఈ బిల్లును విపక్షాలు తీవ్రాతి తీవ్రంగా వ్యతిరేకించాయి.
వక్ఫ్ బోర్డు కార్యకలాపాల క్రమబద్ధీకరణ, వక్ఫ్ ఆస్తుల సమర్ధ నిర్వహణ లక్ష్యంగా గతేడాది ఆగస్టు 8న రెండు బిల్లులను ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది.అనేక సవరణలు వక్ఫ్ చట్టానికి చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అవి చట్టం పేరు మార్చడం, కొన్ని లోపాలను సవరించడం ద్వారా వక్ఫ్ బోర్డు సామర్ధ్యాన్ని మెరుగు పరచడమే లక్ష్యం. అలాగే ఆ చట్టంలో ఉన్న కొన్ని పదాల నిర్వచనాలను మరింత ఆధునీకరించడం, వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మెరుగు పరచడం, వక్ఫ్ రికార్డులన్నంటినీ కంప్యూటర్ యాక్సెస్ లోకి తీసుకురావడం.
కేంద్రం అధీనంలోనే…
మన దేశంలో వక్ఫ్ చట్టం అమలు, నియంత్రణ కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంది.వక్ఫ్ బోర్డు పరిధిలో అనేక యంత్రాంగాలు ఉన్నాయి.
సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్…
ఇది ప్రభుత్వానికి, రాష్ట్ర వక్ఫ్ బోర్డులకు సలహాలు,సూచనలు ఇస్తూ ఉంటుంది. అయితే ఈ బోర్డుకు ఆస్తుల పై నేరుగా కంట్రోల్ లేదు. ఇక రాష్ట్రాల పరిధిలో ఉండే వక్ఫ్ బోర్డులకు మాత్రం వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, సంరక్షణ బాధ్యతలున్నాయి. ఇక వక్ఫ్ ట్రిబ్యునల్స్ ఆ ఆస్తులకు సంబంధించిన వివాదాలను పరిష్కరిస్తూంటాయి. దానికోసం ప్రత్యేక న్యాయసంస్థలు ఉంటాయి. ఇవిఅనేక సమస్యల పరిష్కారానికి, వేగంగా నిర్ణయాలు తీసుకోడానికి ఉపయోగపడతాయి. గతంలో సంక్లిష్టంగా ఉండే పాలనా తీరును సరళతరంగా, పారదర్శకంగా, జవాబు దారీ తనంగా మార్చాయి.
వక్ఫ్ బోర్డు సమస్యలు…
వక్ఫ్ ఆస్తిగా ఒకసారి గనక ప్రకటిస్తే ఇక అదే ఫైనల్. అది ఎల్లప్పటికీ వక్ఫ్ ఆస్తిగానే ఉంటుంది. కోర్టులు కూడా ఈ విషయంలో జోక్యం కలిగించుకోలేవు. వక్ఫ్ భూములను అన్యాయంగా ఆక్రమించడం,నిర్వహణా లోపాలు, ఆస్తుల రిజిస్ట్రేషన్, సర్వేల్లో జాప్యం, సంబంధిత మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు వచ్చినా వాటి విచారణ జరగక పోవడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి.మరో పెద్ద సమస్య ఏమంటే వక్ఫ్ ట్రిబ్యునల్ ఒకసారి తీర్పు ఇస్తే దానిని ఇక పై కోర్టుల్లో కూడా సవాల్ చేసే అవకాశం లేదు. దీనితో అపరిష్కృతంగా ఎన్నో భూ వివాదాలు ఉండిపోయాయి.
అసలు వక్ఫ్ ఆస్తులెన్ని?
మనదేశంలో ఎన్ని వక్ఫ్ ఆస్తులున్నాయన్న అంశంపైనా ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. గుజరాత్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో అసలు సర్వేలే ఇప్పటి వరకూ జరగలేదు. యూపీలో 2014లో ప్రారంభించినా ఆ సర్వే అసంపూర్తిగానే మిగిలిపోయింది. స్వాతంత్రానికి పూర్వం నుంచి ఉన్న ఆస్తులు కొన్ని రివెన్యూ రికార్డులకెక్కలేదు.దాంతో వివాదాస్పద భూముల విషయం తేలలేదు. వక్ఫ్ చట్టాల దుర్వినియోగం ః సరైన రికార్డులు, పాలనా వ్యవస్థ లేకపోవంతో కొన్ని రాష్ట్రాల్లో వక్ప్ బోర్డులు అధికార దుర్వినియోగానికి పాల్పడటం ఉద్రిక్తతలు, ఆందోళనలకు కారణమైంది.మరికొందరు వక్ఫ్ చట్టంలో సెక్షన్ 40ని దుర్వినియోగం చేస్తూ ప్రైవేట్ ఆస్తులను వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించడం వివాదాలకు దారి తీసింది.మొత్తం 30 రాష్ట్రాల్లో కేవలం 8 రాష్ట్రాల్లోనే 515 ఆస్తులను వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించినట్లు రికార్డులున్నాయి.మిగతా రాష్ట్రాల్లో ఇప్పటికీ వక్ఫ్ ఆస్తులపై క్లారిటీ లేదు.
అసలు వక్ప్ ఆస్తులెన్ని?ఎక్కడెక్కడ ఉన్నాయి?
మనదేశంలో రక్షణ శాఖ తర్వాత అంత పెద్ద మొత్తంలో భములున్నది ఒక్క వక్ఫ్ బోర్డుకే. మొత్తం 8,72,324 లక్షల ఎకరాల్లో వక్ఫ్ ఆస్తులుంటే వాటిలో యూపీ, పంజాబ్, తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువ గా వక్ఫ్ ఆస్తులున్నాయి. వీటన్నింటి విలువు ఇప్పుడు చాలా చాలా ఎక్కువ. యూపీలో అత్యధికంగా 2,32,547ఎకరాల మేర (27%) వక్ఫ్ ఆస్తులున్నాయి. తర్వాత పశ్చిమ బెంగాల్ లో 80,480 (9%), పంజాబ్ లో 75,965 (9%),తమిళనాడులో 66,092 (8%)కర్ణాటకలో 2,830 (7%), కేరళలో 53,282 (6%),తెలంగాణలో 45,682(5%) వక్ఫ్ ఆస్తులున్నాయి.
వక్ఫ్ భూముల సమస్యలు…
అపరిష్కృతంగా ఏళ్ల తరబడి వివాదాలలో ఉన్నభూములు నిరర్ధకంగా పడి ఉన్నాయి. పైగా మైనారిటీ మత సంస్థలకు అంత పెద్ద మొత్తంలో ఆస్తులు కలిగి ఉండటం, కొన్ని ప్రభుత్వ భూములు సైతం వక్ఫ్ ఆస్తులుగా క్లెయిమ్ చేసి వాటిపై ఎలాంటి చర్యలూ తీసుకోకుండా అడ్డు పడటం లాంటి సంఘటనలతో వక్ఫ్ బోర్డు తీరుపై విమర్శలు రేగాయి.పెండింగ్ లో ఉన్న భూ వివాదాలు అలాగే కొనసాగడం, మరికొన్నిటికి సరైన రికార్డులు లేకపోయినా వక్ఫ్ ఆస్తులుగా చెలామణీ అవడం, మరికొన్ని చోట్ల వక్ఫ్ ఆస్తులు సైతం ఆక్రమణలకు పాల్పడడం లాంటి సంఘటనలు జరిగాయి.దాంతో 2005లోనే సచార్ కమిటీని ఏర్పాటు చేశారు.
సచార్ కమిటీ ఏం చేప్పింది?
మనదేశంలో ముస్లిం మతస్థుల ఆర్థిక, సామాజిక, విద్యార్హతలను ఈ కమిటీ పరిశీలించింది. అనేకమంది ముస్లింలు సరైన జీవన ప్రమాణాలు లేక దౌర్భాగ్యకర పరిస్థితుల్లో ఉండటంతో వారిని కూడా సమ్మిళిత అభివృద్ధిలో భాగస్వాములను చేయడానికి కొన్ని పాలసీలను సూచించింది. అందులో భాగంగానే 500 కోట్ల నేషనల్ వక్ఫ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయమని సూచించింది.వక్ఫ్ కార్యకలాపాల నిర్వహణకు కొత్త కేడర్ ను నియమించాలంది. ఈ సూచనల మేరకే 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి సవరణలు చేసి చట్ట బద్ధత కల్పించేందుకు ప్రయత్నాలు చేసింది. అప్పుడు తెచ్చినదే వక్ఫ్ సవరణ బిల్లు 2013. అయితే ఈ బిల్లును తెచ్చినా సమస్యల పరిష్కారం పెద్దగా జరగలేదు సరికదా భూ వివాదాలు ఎక్కడవి అక్కడ అలాగే ఉన్నాయి. మనదేశంలో ఏ మతానికీ ఇలాంటి చట్టం లేదు. కేవలం ముస్లిం మతానికి మాత్రమే వక్ఫ్ చట్టం ఉంది. మైనారిటీ మత సంస్థ చట్టం రాజ్యాంగ బద్ధతపై సందేహాలు రేగాయి.దాంతో బీజేపి అధికారంలోకి వచ్చాక కీలక నిర్ణయాలు తీసుకుంటుండటంతో ఇప్పుడు వక్ఫ్ చట్టానికి సవరణలను నెత్తికెత్తుకుంది.
విస్తృత సంప్రదింపులు…
అయితే దీనికి ముందు సంబంధిత సంస్థలతో సంప్రదింపులు జరిపింది. ముస్లిం కమ్యూనిటీ అభ్యంతరాలు, ఆందోళనలు, వక్ఫ్ చట్టం నిర్వహణ లోపం, అధికార దుర్వినియోగం, వక్ఫ్ ఆస్తులను ఆ బోర్డులు ఉపయోగించకుండా నిరర్ధకంగా ఉంచేయడంలాంటి అంశాలపై సంబంధిత అధికారులతో చర్చలు జరిపింది. దాదాపు 11 కీలక అంశాలను చర్చించింది. ఇతర ముస్లిం దేశాల్లో అమలవుతున్న వక్ఫ్ పద్ధతులను పరిశీలించింది.ప్రభుత్వాలకు వక్ఫ్ ఆస్తుల నియంత్రణ బాధ్యతలు ఉన్నాయని గుర్తించింది.
గతేడాది సవరణ బిల్లు…
దాంతో గత ఏడాది ఆగస్టు 9న వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. 21మంది లోక్ సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ ఎంపీలతో కూడిన జేపీసీ దీనిని పరిశీలించింది. ఈ కమిటీ 36 సార్లు సమావేశమైంది. వక్ఫ్ కార్యకలాపాల నిర్వహణతో సంబంధం ఉన్నరైల్వేలు, గృహనిర్మాణం,ఆర్కియలాజికల్ శాఖ, వివిధ రాష్ట్ర మంత్రిత్వ శాఖలు,ప్రభుత్వాలు అందరి అభిప్రాయాలను సేకరించారు. అనేక ముస్లిం సంస్థలతో విస్తృతంగా చర్చించారు.పది నగరాల్లో విస్తృత అధ్యయనాలు జరిపారు.
వక్ఫ్ఆస్తుల సర్వే జరగాలని, పెండింగ్ లో ఉన్న కేసుల విచారణ పూర్తి చేయాలని, ముతావల్లీల అక్కౌంట్ల నిర్వహణ,ఆడిటింగ్ సరిగా లేదని, వక్ఫ్ఆస్తుల మ్యుటేషన్ కూడా సరిగా జరగలేదని గుర్తించారు.వక్ఫ్ రికార్డులన్నింటినీ కంప్యూటరీకరించాలని, డిజిటల్, పోర్టల్ డేటా బేస్ ఏర్పాటు చేయాలని రాష్ట్రాల వక్ఫ్ బోర్డుల పనితీరు మెరుగు పరచాలని ఆదాయ వ్యయాల పట్టిక గురించి నివేదికలు ఇవ్వాలనీ, నిరర్దకంగా పడి ఉన్న భూములను విద్యాసంస్థలు, షాపింగ్ సెంటర్లు, మార్కెట్లు, లేదా బలహీన వర్గాల గృహ నిర్మాణం చేపట్టాలని సూచనలు వచ్చాయి.
దాంతో అనేక సవరణలతో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దీనిని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. 232 మంది విపక్ష సభ్యులు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. అయినప్పటికీ 288 మంది సభ్యుల మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఈ వక్ఫ్ బోర్డు సవరణ చట్టం 2025 బిల్లును ఆమోదింప చేసుకుంది.