దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలనే కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర హోంశాఖ. బుధవారం 259 ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. యుద్ధ సమయంలో శత్రు దేశాలు దాడులు చేస్తే ప్రజలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించడం వీటి ఉద్దేశం.
మాక్ డ్రిల్స్ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు ఎయిర్ రెయిడ్ సైరన్స్ మోగిస్తారు. ఆ సమయంలో ప్రజలు ఎయిర్‌స్ట్రైక్స్ నుంచి తప్పించుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక శత్రుదేశాల యుద్ధ విమానాలు నగరాలను గుర్తించకుండా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు.
విద్యుత్ సరఫరా, మొబైల్ సిగ్నల్స్‌ను నిలిపివేయడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పబ్లిక్‌గా ఎలాంటి అనౌన్స్‌మెంట్లు వస్తాయి. అత్యవసరమైన కమ్యూనికేషన్ వ్యవస్థ, పవర్ ప్లాంట్స్, మిలటరీ ఏరియాలను గుర్తించకుండా చర్యలు తీసుకుంటారు. ఇక హైరిస్క్ ఏరియాలో ఉన్న ప్రజలను హుటాహుటిన తరలిస్తారు. దీని వల్ల అత్యవసర సమయంలో ఎలాంటి రెస్పాన్స్ అవసరం, ఎలాంటి లాజిస్టిక్ సపోర్ట్ అవసరం అనేది గుర్తిస్తారు.
ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే దేశంలో 54 ఏళ్ల తర్వాత వార్ సైరన్స్ మోగబోతున్నాయి. శత్రుమూక నుంచి దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలతో జాబితా సిద్ధం చేసింది కేంద్రం. వాటిని మూడు కేటగిరీలుగా విభజించింది. మెట్రో, డిఫెన్స్, పోర్ట్స్, ఎనర్జీ హబ్స్ వారీగా డివైడ్ చేసింది.
మాక్ డ్రిల్స్ సందర్భంగా స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలు, కమ్యూనిటీ సెంటర్లలో ఆర్మీ, సివిల్ అధికారులు శిక్షణ ఇస్తారు. ప్రజలంతా మెడికల్ కిట్స్, టార్చ్‌లైట్లు, క్యాండిల్స్, చేతిలో కాస్త క్యాష్‌ను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం మొత్తం లోకేషన్స్‌లో 100 ప్రాంతాలను హై రిస్క్ జోన్‌లుగా గుర్తించారు.
మాక్ డ్రిల్స్‌కు సంబంధించి కేంద్ర హోంశాఖ సెక్రటరీ గోవింద్ మోహన్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల సెక్రటరీలు, డీజీపీలు, ఫైర్ డీజీలు పాల్గొన్నారు. ఏయే రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలో ఆయా రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
మూడు కేటగిరిల్లో కేటగిరి వన్‌లో 13 ప్రాంతాలు ఉన్నాయి. కేటగిరి-2లో 201, కేటగిరి-3లో 45 ప్రాంతాలు ఉన్నాయి. ఇలా మొత్తం కలిపి 259 ప్రాంతాలను ముందే సెలెక్ట్ చేసింది కేంద్రం.