27.7 C
Hyderabad
Monday, May 25, 2026

Live Video

spot_img

గాజా అడగడం వెనుక పెద్దన్న వ్యూహం ఏంటి..?

  • గాజాను తమకప్పగించమని ట్రంప్ ప్రతిపాదన
  • కొన్నాళ్లుగా ఇజ్రాయెల్ పై అమెరికా వత్తిడి
  • అక్కడ ప్రజలకు మంచి జీవితాన్నిస్తానని హామీ
  • మెరుగైన జీవన సౌకర్యాలు కల్పిస్తానంటున్న ట్రంప్
  • గాజా పునర్నిర్మాణానికి సహకరిస్తానంటున్న ట్రంప్
  • గాజా ప్రజలను లిబియాకు వెళ్లాలని ఒత్తిడి
  • ఈ భూమిపై సర్వహక్కులు ఒదులు కోవాలని సూచన
  • ట్రంప్ ప్రతిపాదనల పట్ల ప్రపంచ దేశాల అభ్యంతరం
  • పశ్చిమాసియా వ్యవహారాలపై పట్టు సాధించేందుకేనా?
  • ట్రంప్ ప్రతిపాదనలకు ఇజ్రాయెల్ సుముఖత?

గాజా స్ట్రిప్ స్వాధీనం చేయమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎప్పటినుంచో ఇజ్రాయెల్ పై ఒత్తిడి పెంచుతున్నారు. ఆ స్ట్రిప్ ను అభివృద్ధి చేసి చూపిస్తానని ట్రంప్ అంటున్నారు. గాజా జనాభాకు పునరావాసం కల్పించవ్చని వాళ్లకి మంచి లైఫ్ ఇవ్వోచ్చనీ ట్రంప్ మభ్య పెడుతున్నారు.ఈ వ్యాఖ్యల పట్ల ప్రపంచ దేశాలనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హమాస్, ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం, సంక్షోభం  కొనసాగుతున్న ఈ తరుణంలో గాజాపై ట్రంప్ స్టేట్ మెంట్లను రాజకీయ పరిశీలకులు రకరకాల కోణాల్లో అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నేతన్యాహు, ట్రంప్ మధ్య గాజా అప్పగింత ప్రతిపాదనలు కొంత కాలంగా సాగుతున్నాయి.

గాజా స్ట్రిప్ లో పాగా వేసిన హమాస్ మిలిటెంట్ సంస్థను సమూలంగా నాశనం చేసి గాజాను స్వాధీనం చేసుకోడానికి ఇజ్రాయెల్ తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉంది.గతవారం గాజా స్వాధీనానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ కు ఇజ్రాయెల్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. దీనిపై ఓటింగ్ కూడా నిర్వహించారు. గాజా ఆక్రమణకు ఎలాంటి అడ్డంకులు లేకుండా లైన్ క్లియర్ చేసుకుంది.

పాలస్తీనా భూభాగంలో త్వరలోనే భారీ స్థాయిలో సైనిక ఆపరేషన్ జరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఉగ్రసంస్థ హమాస్ ను సమూలంగా మట్టు పెట్టే దిశగా ఇజ్రాయెల్ అడుగులు వేస్తోంది. అయితే ఈ నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గినందునే ఇజ్రాయెల్ గాజా ఆక్రమణ దిశగా అడుగులు వేస్తోందన్నది అర్ధమవుతోంది.ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక గాజాస్ట్రిప్ స్వాధీనంపై కన్నేశారన్నది సుస్పష్టం.పశ్చిమాసియాపై అమెరికా వైఖరి మారుతోంది..

గాజాస్ట్రిప్ పై ఎందుకు కన్ను?

గాజాను ప్రపంచంలోనే అదిపెద్ద బహిరంగ జైలుగా పరిగణిస్తుంటారు.ప్రస్తుతం పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదుల చెరలో ఉన్న ఈ ప్రాంతంపై ఇజ్రాయెల్ దురాక్రమణకు ప్రయత్నిస్తోంది. 40 కిలోమీటర్ల పొడవు, 20 కిలోమీటర్ల వెడల్పు ఉండే గాజా దశాబ్దాలుగా యుద్ధక్షేత్రంగా మారిపోయింది. అక్కడ పెద్దగా పంటలు పండవు.నిత్యం ఇజ్రాయెల్, పాలస్తీన సరిహద్దు సమస్యతో ఘర్షణలు సర్వసాధారణం.ఇప్పుడు హామాస్ మిలిటెంట్లు ఆ ప్రాంతాన్ని ఆక్రమించి అక్కడి పౌరులను బందీలుగా మార్చేశారు. బందీలను విడిపించే సాకుతో ఇజ్రాయెల్ దానిపై దండెత్తుతోంది. పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా ఘర్షణ జరుగుతూనే ఉంది. నిత్య ఘర్షణలతో యుద్ధక్షేత్రంగా మారిన గాజాలో అక్కడి ప్రజలకు సరైన విద్య, వసతి సౌకర్యాలు లేవు. అనేక మంది పేదరికంలో మగ్గుతున్నారు.గాజా పాలస్తీనా ఏలుబడిలోనే ఉండాలని ప్రపంచ దేశాలు అభిప్రాయపడుతున్నాయి. 15నెలల యుద్ధం తర్వాత ఆ ప్రాంతంలో మూడొంతుల భవనాలు ధ్వంసమయ్యాయని ఐరాస లెక్కలు చెబుతున్నాయి.దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఇజ్రాయెల్, పాలస్తీనా ఘర్షణల సర్దుబాటుకు అమెరికా దౌత్యం ఫలించడంలేదు.తను అధికారంలోకి వచ్చాక అయినా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలన్న ఉద్దేశంతో ట్రంప్ చొరవ చూపించినట్లు పరిశీలకులు అంటున్నారు.

ట్రంప్ ఎందుకు కన్నేశారు?

దేశాల మధ్య  గొడవలు ఎలా ఉన్నా ట్రంప్ మంచి బిజినెస్ మ్యాన్. వ్యాపార రంగంలో ఎన్నో వెంచర్లు, పెట్టుబడులు ఉన్నా.. ఆయన రియల్ ఎస్టేట్ పై శ్రద్ధ ఎక్కువ. ప్రాపర్టీ డెవలపర్స్ గా ట్రంప్ కంపెనీకి మంచి అనుభవం ఉంది. గాజా సంక్షుభిత ప్రాంతంగా మగ్గుతోందని అక్కడ  పునర్నిర్మాణం అంటూ జరిగితే అద్భుతమైన మార్పుకు నాంది పలకొచ్చని ట్రంప్ ఉద్దేశం.. గాజా పునర్నిర్మాణం అంటే ఇప్పుడు అక్కడ ఉంటున్న లక్షల మంది పౌరులను మరో చోటకు తరలించాల్సి వస్తుంది.ఈ తరలింపు పేరుతో వారికి ఆ ప్రాంతంపై ఎలాంటి హక్కు లేకుండా చేయడం ఒక ఆలోచన.ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంతో గాజా శకలాల దిబ్బగా మారింది. దాదాపు 17 టన్నుల యుద్ధ వ్యర్ధాలతో అదినిండిపోయి ఉంది.అక్కడ పేలని ఆయుధాలతో పాటు కొన్ని కొండలు, పర్వత ప్రాంతాలను సైతం తొలగించాల్సి ఉంటుంది. అక్కడి తాగునీరు, విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పూర్తయింది. స్కూళ్ళు, ఆస్పత్రులు, దుకాణాలను తిరిగి నిర్మించుకోవాల్సిఉంటుంది. ఈ సమయంలో పాలస్తీనియన్లు అక్కడ ఉండటం ఎంతమాత్రం క్షేమకరం కాదు అని అమెరికా భావిస్తోంది. గాజాస్ట్రిప్లోని దక్షిణ,మధ్యప్రాంతాల్లో ఉన్నశిబిరాల్లో వాళ్లను ఉంచేందుకు బదులు వారిని అక్కడ నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని,ఆ భాగంపై హక్కులు వదులు కోవాలని పరోక్షంగా సంకేతాలిస్తున్నారు. ఆప్రాంతం నిర్జన ప్రదేశంగా మారితేనే పునర్నిర్మాణం అద్భుతంగా సాగుతుందని, ఫలితంగా ఉద్యోగావకాశాలు వస్తాయని, పెట్టుబడులకు అవకాశాలు వస్తాయని,ప్రపంచ ప్రజలు నివసించడానికి ఓ ప్రదేశం ఏర్పాటు చేయవచ్చని అమెరికా చెబుతోంది.గాజాలో ఆరుభవంతులనిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజలు నివసించేందుకు మంచి సౌకర్యాలతో కూడిన భవనాలు నిర్మిస్తామని, వారికి మెరుగైన విద్య,వసతి,తాగునీరు,ఉపాధి కల్పిస్తామని ట్రంప్ నమ్మబలుకుతున్నారు. మరోవైపు వారిని శాశ్వతంగా ఆ ప్రాంతంపై హక్కులు వదులుకోమని పరోక్ష సంకేతాలిస్తున్నారు. దురాక్రమణలకు పెద్దన్న అయిన అమెరికా ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో దురాక్రమణలు సాగించింది. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా కీలకప్రాంతమైన గాజాను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆప్రాంతంపై పట్టు చిక్కితే పశ్చిమాసియా వ్యవహారాలపై పట్టు సంపాదించవచ్చు.

నోబెల్ శాంతి బహుమతిపై కన్నేశారా?

ఇక ప్రపంచానికి మేలు చేస్తున్న దేశంగా డబ్బా కొట్టుకోడం కూడా అమెరికాకు మాత్రమే తెలిసిన విద్య..అమెరికా అధ్యక్షులు నలుగురికి ఇప్పటి వరకూ నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. కీర్తి కండూతి ఎక్కువగా ఉన్న ట్రంప్ తనకు కూడా శాంతి బహుమతి రావాలన్న పట్టుదలతో ఉన్నారు. అందుకే మొన్నటి భారత, పాక్ ఘర్షణల్లో కూడా యుద్ధం తానే ఆపానంటూ ప్రచారం చేసుకున్నారు.మరోవైపు నాలుగేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని కూడా ఆపేందుకు తానే చొరవ చూపుతున్నట్లు కూడా ట్రంప్ ప్రవర్తించారు. ఆ వంకతో ఉక్రెయిన్ ను దారికి తెచ్చుకుని ఆ దేశానికి ఆయుధాలు అమ్ముతూ యుద్ధం ఆగకుండా ఎగదోస్తున్నారు. పైగా ఆ దేశంలో అపారంగా ఉండే విలువైన వనరులు, ఖనిజాలను తమకు ఇచ్చేయాలని కండిషన్ పెట్టారు. కాబట్టి ట్రంప్ రాజ్య కాంక్షతోనే గాజా స్ట్రిప్ స్వాధీనానికి అడుగులేస్తున్నారని అర్ధమవుతుంది. పశ్చిమాసియాలో శాంతి స్థాపన లక్ష్యంగా పైకి అడుగులేస్తున్నా గాజాని వ్యూహాత్మకంగా తమ స్థావరంగా మార్చుకోవాలన్నది ట్రంప్ లక్ష్యం. అయితే ట్రంప్ ప్రతిపాదనను ప్రపంచ దేశాలు తిరస్కరిస్తున్నాయి. కాబట్టి గాజా స్వాధీనం అంత సులభంకాకపోవచ్చు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com