కాళేశ్వరం పోరాటల కేసును కొట్టి వేసిన ప్రజా ప్రతినిధుల కోర్టు
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్వాశితులకు న్యాయం చేయాలని ఆందోళన చేసిన దుద్దిళ్ల శ్రీధర్ బాబుపై 2017లో పోలీసులు పెట్టిన కేసును శనివారం నాంపల్లి కోర్టు కొట్టి వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు, ఇళ్ళు కోల్పోయిన కుటుంబాలకు న్యాయపరమైన నష్ట పరిహారం అందించాలని నిర్వాశితుల పక్షాన దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో పోరాటం చేశారు. దీంతో 2017లో అప్పటి ప్రభుత్వం శ్రీధర్ బాబుతో పాటు హర్కర వేణుగోపాల్, అన్నయ్యగౌడ్, శశిభూషణ్ కాచెలతో పాటు మరో 9 మందిపై పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీసులతో కేసులు నమోదు చేయించింది. శనివారం ఈ కేసును కొట్టేస్తూ నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్ధానం కేసు కొట్టివేస్తూ తుదితీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఇది ప్రజా వియమమని అన్నారు. పేద రైతుల ఘోషను న్యాయస్ధానం అర్ధం చేసుకుందన్నారు. ఈ తీర్పు న్యాయ వ్యవస్ధపై గౌరవం పెంచిందని చెప్పారు.
మనది ప్రజాస్వామ్య దేశమని, తప్పు చేస్తే తప్పకుండా శిక్ష పడాలి.. అలా కాకుండా అధికారం ఉంది కదా అని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి తెచ్చి మాపై అక్రమ కేసులు బనాయించిందని శ్రీధర్ బాబు అన్నారు. అయితే మేం న్యాయస్థానంపై పూర్తి విశ్వాసం ఉంచి న్యాయపరంగా 8 ఏళ్లు పోరాటం చేశామని అంతిమంగా న్యాయమే గెలిచిందన్నారు. వాస్తవానికి కాళేశ్వరం వల్ల మా ప్రాంతానికి ఒరిగిందేం లేకపోగా ఎంతో అన్యాయం జరిగిందని తెలిపారు. మా ప్రజలు ఉపాధి కోల్పోయారు అసలు వాళ్లు కట్టిన ప్రాజెక్ట్ నిలవలేదు. త్వరలోనే ఈ వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయన్నారు.
చుక్క నీరు ఇవ్వకుండా కాళేశ్వరం పేరిట వేలాది ఎకరాలు రైతుల నుంచి ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వకుండానే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుంది. అన్నదాతల కడుపు కొట్టి ఆ పార్టీ నేతలు అక్రమంగా సంపాదించుకున్నారని శ్రీధర్ బాబు ఆరోపించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ప్రజా విచారణ చేస్తున్న సందర్భంగా రైతుల హక్కులను కాపాడాలని విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చేందుకు అధికారం ఉందని మాపై అన్యాయంగా వివిధ సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారుని ఆయన గుర్తు చేశారు. అన్నదాతల తరఫున వారి గొంతుకగా.. మా మంథని ప్రజల కోసం పోరాటం చేస్తే నాతో పాటు, స్థానిక కాంగ్రెస్ నాయకులపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారన్నారు. అసలు అక్కడ లేని వ్యక్తుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చి కొందరు బీఆర్ఎస్ నేతలు రాక్షసానందం పొందారని శ్రీధర్ బాబు మండిపడ్డారు.
ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం నడి రోడ్డుపై న్యాయవాది దంపతులను చంపితే… అసలు నేరస్థులను బయటకు రాకుండా కాపాడిందని ఆరోపించారు. ఆ కేసులో నేరస్తులకు ఎప్పటికైనా అసలు దోషులకు తప్పకుండా శిక్ష పడుతుందనే నమ్మకం మాకుందన్నారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.