-
అట్టహాసంగా అమరావతి పనులు ప్రారంభోత్సవం
-
ప్రధాని హోదాలో రెండోసారి ప్రారంభించనున్న నరేంద్ర మోదీ
అమరావతికి మరోసారి నరేంద్రమోదీ వస్తున్నారు. రెండోసారి ప్రారంభోత్సవం చేయబోతున్నారు. మే 2వ తేదీన అమరావతి ప్రారంభోత్సవానికి ఏపీ సర్కారు సర్వం సిద్ధం చేస్తోంది. రాజధాని నగరం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి అధికారికంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆహ్వాన పత్రం అందజేశారు. దీంతో, ఇక.. మోదీ ఈసారి అమరావతికి ఏం తెస్తారు? సభలో ఏం హామీలిస్తారు? ఇప్పుడీ అంశం ఆంధ్ర ప్రదేశ్‌లో హాట్ టాపిక్ గా మారింది.
సరిగ్గా పదేళ్ల క్రితం 2015 అక్టోబర్ 22వ తేదీన విభజిత ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా అమరావతికి శంకుస్థాపన జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అప్పుడు దేశానికి ప్రధాన మంత్రిగా నరేంద్రమోదీ ఉన్నారు. ఇప్పుడు కూడా సేమ్. రాష్ట్రంలో, దేశంలో నాయకులు మారలేదు. వాళ్లే ఇప్పుడు కూడా రెండోసారి అమరావతి ప్రారంభోత్సవం నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి నిర్మాణానికి రెండోసారి ప్రారంభోత్సవం చేస్తూ ఏర్పాట్లన్నీ సమీక్షిస్తున్నారు. హస్తిన నుంచి దేశ ప్రతినిధిగా నరేంద్ర మోదీ రెండోసారి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.
అప్పుడు మట్టి తెచ్చి మట్టిలో కలిపారు? :
మొదటిసారి అమరావతి ప్రారంభోత్సవం సమయంలో నరేంద్రమోదీ అట్టహాసంగా ఢిల్లీ నుంచి వచ్చారు. వస్తూ వస్తూ.. సెంటిమెంట్‌ను పండించారు. పుణ్యక్షేత్రాల నుంచి ఓ కలశంలో నీళ్లు, మరో కలశంలో పుణ్యక్షేత్రాలకు చెందిన మట్టిని తీసుకొచ్చి అమరావతి శంకుస్థాపన ప్రదేశంలో వేశారు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ. అంతేకాదు.. మోదీ తన ప్రసంగంలో అమరావతికి జీవం తెస్తారని అందరూ భావించారు. రాజధాని లేకపోవడం, ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్న రాష్ట్రం పట్ల సానుకూలంగా మోదీ స్పందిస్తారని భారీ ప్యాకేజీ ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, పుణ్య స్థలాల నుంచి మట్టి, పవిత్ర నదుల నుంచి జలం తెచ్చి అమరావతి నిర్మాణానికి భూమి పూజలో సమర్పించారు తప్పితే.. కేంద్రం మద్దతు, ప్యాకేజీ గురించి ఏమాత్రం ప్రకటన చేయలేదు. ఆ తర్వాత కేంద్రం నుంచి రాజధానికి అవసరమైన నిధుల విషయంలో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదన్న చర్చ జరిగింది. ఆ తర్వాత పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం సపోర్ట్ చేస్తుందనుకుంటే నీళ్లు, మట్టి తెచ్చి మట్టిలో కలిపేశారన్న విమర్శలు కూడా వచ్చాయి.అప్పుడు కూడా ఎన్డీయేలోనే తెలుగుదేశం పార్టీ భాగస్వామ్య పార్టీగా ఉన్పప్పటికీ నరేంద్రమోదీ పెద్దగా స్పందించలేదు. అధికార టీడీపీ కూడా కేంద్రంపై అవసరమైనంత మేర ఒత్తిడి చేయలేదన్న వాదనలున్నాయి.
అప్పటికీ ఇప్పటికీ మారిన పరిస్థితులు :
అయితే, ఇప్పుడు మాత్రం పరిస్థితి మారిపోయిందంటున్నారు విశ్లేషకులు. అప్పటి పరిస్థితులకు, 2024 ఎన్నికల తర్వాత పరిస్థితులకు చాలా మార్పులున్నాయంటున్నారు. అప్పుడు బీజేపీ సొంతంగానే కేంద్రంలో అదికారం చేజిక్కించుకునే స్థాయి ఫలితాలు వచ్చాయి. కానీ, 2024లో టీడీపీతో పాటు జేడీయూ ప్రధానంగా మద్దతు ఇచ్చి నిలబడితే తప్ప.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఎన్డీఏ ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంది. అందుకే మోదీ ఇప్పుడు కాస్త సానుకూలంగా ఉన్నారన్న చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితులను బేరీజు వేసుకోవడం వల్లే కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఈసారి తెలుగు దేశం పార్టీకి, అలాగే ఆంధ్ర ప్రదేశ్ కు కూడా గతంలో ఏనాడూ ఇవ్వనంత ప్రాధాన్యం ఇస్తున్నారన్న చర్చ జరుగుతోంది. 2024లో ఎన్డీఏ సర్కారు కేంద్రంలో హ్యాట్రిక్ సాధించిన వెంటనే.. అది కూడా టీడీపీ ప్రధాన మద్దతు పార్టీగా ఉండటంతో అమరావతికి కేంద్రం నుంచి ఓ రేంజ్‌లో మద్దతు లభించింది. వరల్డ్ బ్యాంకు రుణంతో పాటుగా హడ్కో రుణాలకు కూడా కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. అమరావతి నిర్మాణాలకు అండగా నిలిచింది.
అన్నింట్లోనూ ప్రాధాన్యత :
ఒక్క రాజధాని విషయంలో మాత్రమే కాదు.. ఏపీకి సంబంధించి ప్రతి అంశంలోనూ ప్రాధాన్యత ఇస్తోంది. సీఎం చంద్రబాబు అడిగిన వెంటనే అమరావతికి రైల్వే లైను, అవుటర్ రింగు రోడ్డు, ప్రధాన జాతీయ రహదారులను కలిపేలా కొత్త రహదారులు… అన్నింటికీ కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. ఇకపై కూడా చంద్రబాబు రాజధాని నగరం అమరావతి కోసం ఏం అడిగినా కూడా మోదీ కాదనరు అనే భావన అందరిలోనూ వచ్చేసింది. అందుకే అమరావతి నగరం గురించి మొదటి సారి రూపొందించిన ప్రతిపాదనలకు ఇప్పుడు మరిన్ని రెక్కలు వస్తున్నాయి. మరింత పెద్ద మొత్తంలో అమరావతి వైశాల్యాన్ని పెంచేస్తున్నారు చంద్రబాబు. ఆర్థికంగా కేంద్రం అండగా నిలుస్తుండటంతో ఇక రాజధాని నగరం విస్తీర్ణం భారీగా పెరిగేలా అంచనాలు సవరిస్తున్నారు. భూ సమీకరణ మరింతగా పెంచుతున్నారు. మరి.. ఈ పరిస్థితుల్లో అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి రెండోసారి ప్రధాన మంత్రి హోదాలో వస్తున్న నరేంద్ర మోదీ… అమరావతి నిర్మాణానికి సంబంధించి ఓ భారీ ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ ప్యాకేజీ తర్వాత అమరావతికి నిధుల కొరత రాదన్న చర్చలు కూడా జరుగుతున్నాయి. మొత్తానికి అమరావతి రూపు రేఖలే మారిపోతాయన్న ఆసక్తి కర వాదనలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబుకు థాంక్స్ చెప్పేలా ప్రసంగ పాఠం? :
అమరావతి మొదటి సారి ప్రారంభోత్సవంలో ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ చేసిన ప్రసంగానికి.. ఇప్పుడు పునర్నిర్మాణం ప్రారంభత్సోవంలో కూడా రెండోసారి ప్రధాన మంత్రి హోదాలో పాల్లొంటున్న నరేంద్ర మోదీ చేయబోయే ప్రసంగానికి పూర్తిగా మార్పు ఉంటుందన్నదైతే స్పష్టంగా అర్థమవుతోందంటున్నారు విశ్లేషకులు. అందులోనూ రెంగు రకాలుగా ప్రసంగం ఉండబోతోందంటున్నారు. ఒకటేమో అభివృద్ధి పనులు, నిధులు, కేంద్ర ప్రభుత్వం సాయం అయితే, రెండోది మాత్రం నరంద్రమోదీ ప్రధాని హోదాలో కేవలం ప్రతి పక్ష వైసీపీపై విమర్శలు చేయబోతున్నారన్న సంకేతాలు వస్తున్నాయంటున్నారు. అమరావతి నగరం ఇప్పటికే ప్రారంభోత్సవం జరుపుకోవాల్సి ఉండేదని, నగరం ప్రారంభోత్సవానికి రావాల్సిన తాను.. పదేళ్ల తర్వాత కూడా నిర్మాణ పనుల ప్రారంభోత్సవం రెండోసారి ప్రారంభించేందుకు రావాల్సి వచ్చిందని నరేంద్రమోదీ నొక్కి చెప్పే అవకాశం ఉందంటున్నారు. అయితే, ఈ పరిస్థితులు నెలకొనడం వెనుక దీనికి పూర్తి బాధ్యులుగా గత అధికార పార్టీ వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్‌పై నెపం మోపే వ్యూహంతో ప్రసంగం ఉండవచ్చంటున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అమరావతి రాజధాని నిర్మాణాన్ని కొనసాగించి ఉంటే ఇప్పటికే నగరం పూర్తయ్యేదని, మళ్లీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే అమరావతి నగరం నిర్మాణానికి మళ్లీ అడుగులు పడుతున్నాయని చంద్రబాబును మోదీ ఆకాశానికి ఎత్తే అవకాశం లేకపోలేదంటున్నారు. కేంద్రంలో తమకు మద్దతు ఇవ్వడం పట్ల తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఈవిధంగా నరేంద్ర మోదీ థాంక్స్ చెప్పబోతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.