25.7 C
Hyderabad
Tuesday, November 3, 2026

Live Video

spot_img

ఐదేళ్ల తర్వాత కైలాస మానస సరోవర్ యాత్ర

ఐదు సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ, ప్రపంచ వ్యాప్తంగా హిందూ భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కైలాస మానసరోవర్ యాత్ర మళ్ళీ ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారి కారణంగా 2020లో నిలిపివేసిన ఈ పవిత్ర యాత్రను, కేంద్ర ప్రభుత్వం 2025 జూన్ నుండి తిరిగి ప్రారంభించబోతుంది.

హిందూ మత విశ్వాసాల ప్రకారం, కైలాస పర్వతాన్ని శివుడి నివాసంగా పరిగణిస్తారు. అలాగే, మానసరోవర్ సరస్సును పవిత్ర జలాశయంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ యాత్ర చేయడానికి ఉత్సాహం చూపిస్తారు.

యాత్ర పునఃప్రారంభానికి అధికారిక నిర్ణయం :

విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన సమావేశంలో, ఈయేడాది కైలాస మానసరోవర్ యాత్రను పునఃప్రారంభించేందుకు అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ యాత్రను కుమావున్ మండల్ అభివృద్ధి సంస్థ (KMVN) నిర్వహించనుంది. మానస సరోవర్‌ యాత్ర ఢిల్లీ నుండి ప్రారంభమై, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పిథోరగఢ్ జిల్లా లిపులేఖ్ పాస్ గుండా కైలాస మానసరోవర్‌కు సాగుతుంది.

నమోదు విధానం :

ఈ యాత్ర చేయదలచుకున్న వాళ్లు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, మూడు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు అవసరం అవుతాయి. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత, రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు స్టేటస్‌ గురించి సమాచారం, దరఖాస్తుదారులకు మెస్సేజ్‌గానీ, ఈ మెయిల్‌ ద్వారా గానీ తెలియజేస్తారు.

యాత్ర తేదీలు:

యాత్ర జూన్ 30, 2025న ప్రారంభమవుతుంది.
మొత్తం ఐదు బృందాలు, ప్రతి బృందంలో 50 మంది యాత్రికులతో రూపొందిస్తారు.
మొదటి బృందం జూలై 10 న లిపులేఖ్ పాస్ ద్వారా చైనాలోకి ప్రవేశిస్తుంది.
చివరి బృందం ఆగస్టు 22, 2025 న చైనా నుండి తిరిగి భారత్‌కు చేరుకుంటుంది.

యాత్రా మార్గం:

  • ప్రతి బృందం ఢిల్లీ నుండి ప్రయాణం ప్రారంభించి, ఈ ప్రాంతాలలో బస చేస్తుంది:
  • తనక్‌పూర్ — ఒక రాత్రి
  • ధార్చులా – రెండు రాత్రులు
  • గుంజి – రెండు రాత్రులు
  • నభిదాంగ్ – రెండు రాత్రులు

ఇక్కడి నుంచి యాత్రికులు కైలాస మానసరోవర్ ప్రాంతంలోకి ప్రవేశించి, దర్శనం పూర్తి చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు బుండి, చౌకోడి, అల్మోరా మీదుగా ఢిల్లీ చేరుకుంటారు. మొత్తం యాత్ర 22 రోజులు ఉంటుంది.

ప్రయాణికుల సంఖ్య :

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, ప్రతి గ్రూపులో 50 మంది చొప్పున మొత్తం 5 గ్రూపులు – అంటే మొత్తం 250 మంది యాత్రికులు ఈ సారి ప్రయాణించనున్నారు. ప్రైవేట్ టూర్ ఆపరేటర్లు కూడా సేవలు అందిస్తున్నప్పటికీ, అధికారిక రిజిస్ట్రేషన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ద్వారానే జరుగుతుంది. ప్రైవేట్ టూర్ ఆపరేటర్ ద్వారా కూడా దరఖాస్తులో సహాయం పొందవచ్చు.

కైలాస మానసరోవర్ యాత్రకు సంబంధించి ముఖ్యమైన విషయాలు:

  • యాత్ర సాగే కాలం : 22 నుంచి 25 రోజులు.
  • ఖర్చు : సుమారు రూ.1.5 లక్షల నుండి రూ.3 లక్షల వరకు వ్యయమవుతుంది.
  • శారీరక స్థితి : మంచి ఆరోగ్యం, ధృఢమైన శారీరక ఆరోగ్యం అవసరం.
  • పాస్‌పోర్ట్ : తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ అవసరం.

కైలాస మానసరోవర్ యాత్రకు ప్రధాన మార్గాలు:

1.లిపులేఖ్ మార్గం : ఉత్తరాఖండ్ రాష్ట్రం పిథోరగఢ్ జిల్లా ద్వారా ట్రెక్కింగ్ చేస్తూ ప్రయాణించాల్సి ఉంటుంది.
2. నాథులా మార్గం : సిక్కింలోని నాథులా పాస్ గుండా వాహన ప్రయాణం కూడా సాధ్యపడుతుంది.
3. నేపాల్ మార్గం : నేపాల్ ద్వారా కైలాస మానసరోవర్ చేరుకోవచ్చు. అయితే ఈ మార్గం ఇతర మార్గాలతో పోల్చితే ఖర్చుతో కూడుకుని ఉంటుంది.
Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com