28.8 C
Hyderabad
Thursday, June 25, 2026

Live Video

spot_img

రజతోత్సవ సభలో కేసీఆర్‌ స్కెచ్‌ ఏంటి?

  • పక్కా ప్లాన్‌ వేసిన బీఆర్‌ఎస్‌?

  • కంగుతిన్న కాంగ్రెస్‌?

బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు కౌంట్ డౌన్ మొదలయ్యింది. మరికొన్ని గంటల్లోనే భారత రాష్ట్ర సమితి తన ప్లీనరీ శంఖారావం పూరించ బోతోంది. 24యేళ్ల ప్రస్థానాన్ని ప్రజల ముందు మరోసారి ప్రదర్శిస్తూ..ప్రతిపక్ష పార్టీగా 25వ యేట సాగించనున్న పోరాటాలను నిర్దేశించుకోనుంది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచీ ఫామ్‌హౌజ్‌కు మాత్రమే పరిమితమైన కేసీఆర్‌.. తొలిసారిగా ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారు. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల సమయంలో బస్సుయాత్ర చేపట్టారు. కానీ, పెద్దగా ప్రజలను ఆకట్టుకోలేక పోయారు. కానీ, ఇప్పుడు మాత్రం రజతోత్సవ నినాదంతో ప్రజల్లోకి బలంగా వెళ్లడమే లక్ష్యంగా కేసీఆర్‌ ప్రిపేర్‌ అవుతున్నారన్న చర్చ సర్వత్రా సాగుతోంది.

ఆదివారం హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ జరగనుంది. ఈసభకు పది లక్షల మంది జనాభాను సమీకరించాలని కేసీఆర్‌ పార్టీ నాయకులకు నిర్దేశించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్‌.. ఇప్పుడు ప్రజలు మాత్రం తమవెంటే ఉన్నారన్న సంకేతాలు వచ్చేలా ఈ సభను సక్సెస్‌ చేయడానికి శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు.

కేసీఆర్‌ బిగ్‌ ప్లాన్‌?

బీఆర్‌ఎస్‌ నాయకులు ఈ దిశగా తమ ప్రయత్నాలు తాము చేస్తుంటే.. మరోవైపు కేసీఆర్‌ మాత్రం అధికార కాంగ్రెస్‌కు ఝలక్‌ ఇచ్చే విధంగా ప్లాన్‌లు రూపొందిస్తున్నట్లు లీకులు వస్తున్నాయి. ఈ రజతోత్సవ సభను కాస్త డిఫరెంట్‌గా ప్లాన్‌ చేశారని చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలపై బీఆర్ఎస్ నేతలు దృష్టి సారించారని అంటున్నారు. రేపు ఎల్కతుర్తిలో జరిగే పార్టీ రజతోత్సవ సభలో పలువురు కాంగ్రెస్ నాయకులను కారు ఎక్కించేయాలని కేసీఆర్‌ తమదైన వ్యూహం రెడీ చేశారంటున్నారు. తమ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారిన పది నియోజకవర్గాల్లో.. అక్కడి పాత కాంగ్రెస్ నాయకులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారనే విషయాన్ని గుర్తించిన బీఆర్ఎస్.. వారితో కొద్ది రోజులుగా రహస్యంగా సంప్రదింపులు జరుపుతున్నారని చెబుతున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి గానీ, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ గానీ కనీసం తమను పిలిచి మాట్లాడలేదని, బీఆర్ఎస్‌ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలతో తమకు ఎదురవుతున్న ఇబ్బందులను పట్టించుకోవడం లేదనే అసహనంతో ఆ పది నియోజక వర్గాల్లోని కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు రగిలిపోతున్నారని తెలుస్తోంది. ఈ పరిస్థితులను ఒడిసిపట్టుకునేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందన్న చర్చ జరుగుతోంది. అలాంటి అసంతృప్త నేతలను కారెక్కిస్తే అధికార పార్టీకి బిగ్ షాకే ఇచ్చినట్టు ఉంటుందన్నది గులాబీ పార్టీ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. గులాబీ పార్టీలోని ఓ కీలక నేత కాంగ్రెస్ అసంతృప్త నాయకులతో రాయబారం సాగించినట్లు తెలుస్తోంది. పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయిని, అప్పుడు మీకే టిక్కెట్లు ఇస్తామని బీఆర్‌ఎస్‌ నేతలు హామీ ఇచ్చారని చెబుతున్నారు. అంతే కాకుండా వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా టికెట్స్ మీకేనని గ్యారంటీ కూడా ఇచ్చి వారిని కారెక్కించేందుకు ఒప్పించే ప్రయత్నం చేశారట.

ఎంతమందికి గులాబీ కండువాలు కప్పుతారు?

ఎల్కతుర్తి రజతోత్సవ సభలో కనీసం ఏడు, ఎనిమిది నియోజవ వర్గాలకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ అసంతృప్త ముఖ్యనేతలకు కేసీఆర్‌ చేత గులాబీ కండువాలు కప్పించే వ్యూహం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. అయితే, ఈ వ్యవహారాన్ని పసిగట్టి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారన్న టాక్ కూడా వినిపిస్తోంది. పార్టీ ఫిరాయింపులు జరిగిన ఆ పది నియోజకవర్గాల్లోని అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టినట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఆ 10 మంది ఎమ్మెల్యేలను గులాబీ పార్టీ లోకి మళ్లీ రానిచ్చేది లేదని అంటున్నారు. మరి.. అసంతృప్తి కాంగ్రెస్‌ నేతలు చెయ్యి వదిలి కారెక్కుతారా? లేదంటే కాంగ్రెస్‌ పార్టీ బుజ్జగింపులకు లొంగుతారా? రేపు తేలిపోనుంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com