25 C
Hyderabad
Monday, August 10, 2026

Live Video

spot_img

భాస్కర న్యూస్‌చెప్పిందే నిజమైంది – టీటీడీలో ఏం జరుగుతోంది?

– తిరుమలలో ఈవో వర్సెస్‌ చైర్మన్‌
– స్వామివారి సన్నిధిలో ఆధిపత్య పోరు
– చైర్మన్‌, ఈవో ఎవరి దారి వారిదే…
– తిరుపతిలో తొక్కిసలాటకూ ఇదే కారణమా?

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతోంది? టీటీడీలో ఆధిపత్యపోరు అంతటా రాజ్యమేలుతోందా? ప్రధానంగా టీటీడీ నిర్వహణలో సమాంతరంగా ఉండాల్సిన టీటీడీ చైర్మన్‌, ఈవో తలోదారిలో వెళ్తున్నారా? ఒకరి మాట మరొకరు వినడం లేదా? ఈ పరిస్థితులే మొన్నటి తొక్కిసలాటకు కారణమయ్యాయా? ఇప్పుడీ చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

అయితే టీటీడీలో ఈ పరిస్థితులున్నాయని భాస్కర న్యూస్‌ ముందే చెప్పింది. ఈవోకు, చైర్మన్‌కు మధ్య అగాథం నెలకొందని, అధికారులెవరూ చైర్మన్‌కు సహకరించడం లేదని చైర్మన్‌ కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నారంటూ ఈనెల 6వ తేదీనే ప్రత్యేక కథనం రాసింది. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణ ఇన్నేళ్లుగా సాగిన తీరును, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెలకొన్న పరిస్థితులను విశ్లేషించింది. టీటీడీ వర్గాల అసంతృప్తి, చైర్మన్‌ కోటరీ, ఈవో కోటరీలో ఆధిపత్య పోరుకు సంబంధించిన ఫుల్‌ డీటెయిల్స్‌ వెల్లడించింది.

భాస్కర న్యూస్‌ ఈనెల 6వ తేదీన అందించిన కథనం ఇక్కడ చూడొచ్చు.
https://bhaskaranews.com/what-is-happening-in-ttd/ 

ఇప్పుడు తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్ల క్యూలైన్లలో జరిగిన తొక్కిసలాట తర్వాత ఇద్దరి మధ్యా నెలకొన్ని విభేదాలు బహిర్గతమయ్యాయి. అయితే, ఏదో ఆషామాషీగా కాదు.. ఏకంగా ముఖ్యమంత్రి ముందే ఇద్దరు ముఖ్యులూ గొడవ పడ్డారు. చేతల్లో దాడి చేసుకోకున్నా.. మాటల దాడులు చేసుకున్నారు. తిరుమల చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో తొక్కిసలాట జరిగిన శ్రీవారి భక్తులు చనిపోయిన సమయంలో గంభీర పరిస్థితులు నెలకొన్న వేళ.. ముఖ్యమంత్రే పరిస్థితులను సమీక్షించేందుకు వస్తే.. ఆయన ముందే వీళ్లిద్దరూ విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఓవైపు మృతుల కుటుంబాల రోదనలు మిన్నంటుతూంటే.. మరోవైపు క్షతగాత్రుల హాహాకారాలు ఆసుపత్రుల్లో ప్రతిధ్వనిస్తూంటే.. తిరుమల ఆలయం బాధ్యులైన ఇద్దరు ముఖ్యులూ ఇలా వాదులాడుకోవడం తీవ్ర విమర్శలకు కారణమయ్యింది. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తిరుమలలో పరిస్థితులు గాడిలో పడాలంటే.. సమన్వయంతో ఉండాల్సిన అనివార్యతను అక్కడికక్కడే తేల్చేయాల్సిన ఆవశ్యకత ఉంది.

ఇక, తిరుమలలో సీఎం పర్యటన సమయంలో నెలకొన్న పరిణామాలు చూద్దాం… తిరుమలలో భక్తులు మరణించడంపై స్పందించిన సీఎం చంద్రబాబు గురువారం తిరుమల వెళ్లారు. అయితే సీఎం ముందే టీటీడీ ఈవో, చైర్మన్‌ తీవ్రస్థాయిలో వాదులాడుకున్నారు. ఈవో తనను లెక్క చేయడం లేదని, తనకేమీ చెప్పడం లేదని సీఎంకు టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు కాంప్లెయింట్ చేశారు. ఆ వెంటనే రెస్పాండ్‌ అయిన ఈవో, నీకేం చెప్పలేదంటూ ఎదురు దాడికి దిగారు. ఒకరి మీద ఒకరు రచ్చకు దిగారు. దీంతో, అక్కడున్న వాళ్లందరూ షాకయ్యారు. ముందుగా మంత్రి అనగాని వాళ్లిద్దరికీ సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత సీఎం కూడా ఇద్దరి మీదా అసహనం వ్యక్తం చేశారు.సమన్వయంతో పనిచేయలేరా? అంటూ ఇద్దరినీ హెచ్చరించారు. కానీ ఆ డోస్‌ ఇద్దరికీ సరిపోలేదన్న చర్చ టీటీడీ వర్గాల్లో నడుస్తోంది.

సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే టీటీడీ, చైర్మన్‌, ఈవో ఇద్దరూ సంయమనం కోల్పోయారు. విచక్షణ కూడా మరిచారు. ‘‘ఈవో నన్ను అసలు పట్టించుకోవడం లేదు. చైర్మన్‌ అనే గౌరవం కూడా చూపడం లేదు. ఏ చిన్న విషయాన్నీ నాతో చర్చించడం లేదు. మీరైనా కాస్త చెప్పండి’’ అని సీఎం చంద్రబాబుకు చైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఈవో ఒక్కసారిగా సంయమనం కోల్పోయారు. ‘నీకేం చెప్పడంలేదు. అన్నీ చెబుతూనే ఉన్నాం కదా’ అంటూ చైర్మన్‌పై తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. తర్వాత ఇద్దరూ ‘నువ్వు’ అంటే ‘నువ్వు’ అనుకుంటూ ఏకవచనంతోనే వాదులాటకు దిగారు. ఇంతలో మంత్రి అనగాని సత్యప్రసాద్‌ జోక్యం చేసుకుని… ఈవోను మందలించారు. ‘‘ఏం మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రి ముందు ఎలా మాట్లాడాలో తెలియదా? శ్రీవాణి ట్రస్టులో అంశాలు ఏమైనా ఉంటే నోట్‌ రూపంలో ఇవ్వండి. ఇక్కడెందుకు ప్రస్తావిస్తున్నారు!’’ అని అభ్యంతరం తెలిపారు.

చంద్రబాబు జోక్యం చేసుకుని ‘సత్యప్రసాద్‌ నువ్వు ఆగు’ అంటూ… ఈవో, చైర్మన్‌పై విరుచుకుపడ్డారు. ‘‘ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇదేనా పద్ధతి? మీ పరిధి దాటి మాట్లాడుకుంటున్నారు. మీ ఫ్రస్టేషన్‌ ఎవరిపైన చూపిస్తున్నారు? అసలిక్కడ జరిగిందేమిటి? మీరు మాట్లాడుతున్నదేమిటి? ఒకచోట పనిచేస్తున్నప్పుడు ఓపిక, సమన్వయం ఉండాలి. అది మీకు ఎందుకు సాధ్యపడటం లేదు? నేనూ, చీఫ్‌ సెక్రటరీ సమన్వయంతో పనిచేసుకోవడం లేదా? మేం కోఆర్డినేషన్‌లో లేమా? ఒకరితో మరొకరం మాట్లాడుకోవడం లేదా? ఇద్దరం కలిసి పనిచేస్తేనే కదా రాష్ట్రం అభివృద్ధి చెందేది. ఇలా కొట్టుకుంటే ఎలా? ఇదేం భాష? ఇదేం వ్యవహారం. ఇది పద్ధతిగా లేదు. వెంటనే ఆపండి’’ అని తీవ్రస్వరంతో హెచ్చరించారు.

ఇదే సమావేశంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి వ్యవహారశైలి కూడా ప్రస్తావనకు వచ్చింది. అయితే, ‘‘వాటన్నింటిపై తర్వాత మాట్లాడదాం. ఇది సందర్భం కాదు. సమయం వచ్చినప్పుడు అన్నీ పరిశీలిస్తాం. కానీ మీ పద్ధతి మార్చుకోవాలి. సమన్వయంతో పని చేయాల్సిందే’’ అని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com