- చైర్మన్ బిఆర్‌నాయుడుది తొందరపాటా…
- చైర్మన్ పర్యటనకు ఉన్నతాధికారులు ఎందుకు దూరంగా ఉన్నారు …..
- ప్రతి అంశం లోను చైర్మన్ దూకుడుగా వ్యవహరిస్తున్నారా…
- అధికారులకు చైర్మన్‌కు మధ్య దూరం రోజురోజుకు పెరుగుతుందా ….
టీటీడీ చైర్మన్ గా బిఆర్‌నాయుడు నియమితులు అయినప్పటి నుంచి టీటీడీలో ప్రతిదీ వివాదాస్పదం అవుతోందంటున్నారు ఆలయవర్గాలు. సాధ్యపడని అంశాలను సాధ్యం చేస్తానంటూ బిఆర్ నాయుడు ప్రకటనలు చేయడమే దీనికి కారణం అవుతుందని టీటీడీ సిబ్బంది సూత్రీకరిస్తున్నారు. టీటీడీ చైర్మన్‌గా బిఆర్ నాయుడు పేరు ప్రకటించిన సమయంలోనే హైదరాబాదు నుంచే హడావుడిగా టీటీడీలో అన్యమత ఉద్యోగులు ఉన్నారని… వారిని సాగనంపుతాం అంటూ అవగాహన లేకుండా ప్రకటించేశారని వారు గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి టీటీడీలో అన్యమత ఉద్యోగులను సాగనంపేందుకు 2017 నుంచి కార్యాచరణ మొదలైంది. అప్పటి ఈవో సింఘాల్ అధికారికంగా 53 మంది వరకు అన్యమత ఉద్యోగులు టీటీడీలో ఉన్నట్లు గుర్తించారు. అటు తర్వాత వారిని ప్రభుత్వానికి బదిలీ చేయించాలన్న ప్రయత్నాలు చేశారు.
కానీ ఈ అంశంపై అన్యమత ఉద్యోగులు కోర్టుకెక్కడంతో ఈ ప్రయత్నానికి బ్రేకులు పడ్డాయి. కానీ టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టక ముందే బిఆర్‌నాయుడు ఇవేవీ అవగాహనలోకి తెచ్చుకోకుండా వ్యాఖ్యలు చేయడంతో పాటు 300 మంది వరకు ఉన్నారంటూ వారికి ఆప్షన్లు కూడా ఇస్తున్నామంటూ ప్రకటనలు చేయడం గందరగోళం సృష్టించిందని టీటీడీ వర్గాలు అంటున్నాయి. చివరికి ఇవేవీ సాధ్యపడవు అని తేలడంతో ఇప్పుడు టీటీడీ చైర్మన్ అన్యమత ఉద్యోగులపై బెదిరింపు ధోరణికి దిగుతూ మరో కొత్త వివాదానికి తెరలేపుతున్నారని అధికారులు వాపోతున్నారు. అన్యమత ఉద్యోగులను టీటీడీ పరిధిలో ఉన్న జమ్మూకాశ్మీర్, కన్యాకుమారి వంటి ప్రాంతాలకు బదిలీ చేస్తామంటూ వారిని బలవంతంగా నైనా ప్రభుత్వ శాఖలోకి పంపేలా ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇక తిరుమలలో శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తామని… అటు తర్వాత శ్రీవాణి ట్రస్ట్ పేరునే మార్చేస్తామంటూ వ్యాఖ్యలు చేశారు బి.ఆర్‌నాయుడు. వాస్తవానికి శ్రీవాణి ట్రస్ట్ ను ఏర్పాటు చేసింది 2018 అక్టోబర్లో. ఇది ఒక రకంగా చెప్పాలంటే సీఎం చంద్రబాబు నాయుడి మానస పుత్రిక లాంటిది. రాష్ట్ర రాజధాని అమరావతిలో 150 కోట్ల రూపాయల వ్యయంతో శ్రీవారి ఆలయాన్ని నిర్మించ తలచి అందుకు భక్తుల నుంచి విరాళాలు సేకరించడానికి శ్రీవాణి ట్రస్టును ఏర్పాటు చేశారు. శ్రీవాణి అంటే శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్ అని అర్థం. మరి ఈ ట్రస్ట్ పేరును ఎలా మారుస్తారు… ఈ ట్రస్టును ఎలా రద్దు చేస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.
శ్రీవారి భక్తులకు సులభతరంగా దర్శనం కల్పించేస్తాను అంటూ మరోసారి ప్రకటన చేశారు బిఆర్‌నాయుడు. సిఫార్సు లేఖలపై విఐపి బ్రేక్ దర్శన టికెట్లు పొందిన భక్తులకి కూడా రెండు నుంచి మూడు గంటల సమయం పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సర్వదర్శనం భక్తులకు గంటలో దర్శన భాగ్యం అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఎలా సాధ్యమో అన్నది ఎవరికీ అంతుపట్టని అంశంగా మారిపోయింది. ప్రస్తుతం అమలు చేస్తున్న టికెట్ విధానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భక్తులే స్వయంగా పొందే విధానంపై కసరత్తు అయితే చేస్తున్నారు. మరి ఈ విధానంతో గంటలో భక్తులకు దర్శనం ఎలా సాధ్యపడుతుందో అన్నది మాత్రం తెలియడం లేదు. ఇక టిటిడి ఉద్యోగులకు నేమ్ ప్లేట్ ఉంచాలన్న ప్రతిపాదన చేశారు చైర్మన్ బిఆర్‌నాయుడు. పరిపాలనపరంగా ఇది సాధ్యపడే అంశం కాదని నిత్యం 70 నుంచి 80 వేల మంది భక్తులు దర్శించుకునే శ్రీవారి ఆలయంలో ఉద్యోగులు నేమ్ ప్లేట్ ధరించి సేవలు అందించే పరిస్థితి ఉండదని… గతంలో కూడా ఐవైఆర్ కృష్ణారావు ఇఓగా ఉన్న సమయంలో ఇలాంటి ప్రయత్నమే చేసి విఫలమయ్యారని అధికారులు చైర్మన్ దృష్టికి తీసుకువచ్చినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఇదే అంశంపై ముఖ్యమంత్రి కి కూడా చైర్మన్ బిఆర్ నాయుడు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం సీఎం ను చైర్మన్ బిఆర్ నాయుడు కలిసిన సమయంలో వారి టీం విడుదల చేసిన ప్రెస్ నోట్ లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు.
ఇవన్నీ పక్కన పెడితే తాజాగా తిరుమల పర్యటనకు విచ్చేసిన బిఆర్ నాయుడు మాడవీధుల్లో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు… కవరేజ్ ఇవ్వడంటు మీడియాకి సందేశం పంపారు. వాస్తవానికి ప్రస్తుతం భక్తుల సౌకర్యార్థం మాడవీధులలో వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించిన ఏర్పాట్లు ఏవి జరగడం లేదు. గ్యాలరీలో ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న షెడ్లన్నీ కూడా రథసప్తమి పర్వదినం రోజుకి సంబంధించినవి. ఫిబ్రవరి 4వ తేదీన శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఉండడంతో అదేరోజు స్వామివారు సప్త వాహనాలపై మాడవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు. ఒకరోజు బ్రహ్మోత్సవంగా పేర్కొనే రథసప్తమి పర్వదినం సందర్భంగా లక్షన్నర నుంచి 2 లక్షల మంది తరలివచ్చే అవకాశాలు ఉండడంతో వారి సౌకర్యార్థం టీటీడీ మాడవీధులలో గ్యాలరీలో షెడ్లను ఏర్పాటు చేస్తుంది. టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు ముందు చూపు పేరుతో నెలన్నర ముందుగానే వీటిని ఏర్పాటు చేస్తున్నారు. టిటిడి చైర్మన్ మాత్రం అవి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లుగా భావించి పరిశీలనకు నేరుగా వెళ్లిపోయారు. పోని చైర్మన్ వచ్చాడు కదా ప్రోటోకాల్ మేరకు అదనపు ఈవో, సిపియస్ఓ, సిఇ స్థాయి అధికారులు వస్తారు అనుకుంటే… కింది స్థాయి అధికారి అయిన వీజీవో ఒక్కరే కనిపించారు. కనీసం ఇంజనీరింగ్ అధికారులు కూడా ఆయన పర్యటన సందర్భంగా ఆ ప్రాంతంలో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారిపోయింది. సాక్షాత్తు టిటిడి చైర్మన్ పర్యటనకు విచ్చేస్తే కనీసం చైర్మన్ కు వాటి గురించి వివరించే ప్రయత్నం కూడా చేసేందుకు టీటీడీ అధికారులు రాకపోవడం పై ఇప్పుడు చర్చ నడుస్తోంది. చైర్మన్ తొందరపాటు నిర్ణయాల వల్ల తమకెక్కడ ఇబ్బంది తలెత్తుతుందో అని టిటిడి అధికారులు ఆయనకు దూరంగా ఉండిపోతున్నారని తిరుమల కొండపై ప్రచారం జరుగుతోంది.