డీప్‌సీక్… రెండు రోజుల నుంచి ఈ పేరు చాలా గట్టిగా వినిపిస్తోంది. అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ నుంచి మొదలుపెడితే ట్రిలియన్, బిలియన్ డాలర్ల కంపెనీల అధిపతులు కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. ఇక ఈ డీప్‌సీక్ దెబ్బకు అమెరికా టెక్ దిగ్గజం ఎన్విడియాకు ఏకంగా 593 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలా రూ.51 లక్షల కోట్లు. అమెరికన్ షేర్ మార్కెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద నష్టం. అంతేకాదు మెటా, మైక్రోసాఫ్ట్ షేర్లు కూడా నష్టపోయేలా చేసింది ఈ డీప్‌సీక్.
డీప్‌సీక్ అంటే ఏంటి?
చైనాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ డీప్‌సీక్. దీన్ని లియాంగ్ వెన్‌ఫెంగ్ 2023లో ప్రారంభించారు. chat.deepseek.comలోకి వెళ్లి లాగిన్ అయితే ఏఐ చాట్‌బాట్ వస్తుంది. చాట్ జీపీటీ తెలుసు కదా. సేమ్ అలాంటిదే. దీని ఇంటర్‌ఫేస్ కూడా చాట్ జీపీటీలాగానే ఉంటుంది. అయితే ఇదంతా కూడా ఉచితంగానే వాడుకునే అవకాశం ఉండటంతో ప్రపంపవ్యాప్తంగా దీని డౌన్‌లోడ్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి.
ఎందుకింత ఆదరణ?
దీనిని డెవలప్ చేసేందుకు చాలా తక్కువగా ఖర్చు చేశారు. అంతేకాదు ఇప్పటికే ఈ రంగంలో మేటిగా ఉన్న ఓపెన్ ఏఐ, స్టెబిలిటీ ఏఐ కన్నా మెరుగ్గా ఇది పనిచేయడం మరో విశేషం. దీనిని డెవలప్ చేసేందుకు చైనాలోని ప్రముఖ యూనివర్సిటీల నుంచి గ్రాడ్యుయేట్స్‌ను ఓ టీమ్‌గా ఏర్పాటు చేశారు. వీరంతా కలిసి లెటెస్ట్‌గా R1 పేరుతో ఏఐ మోడల్‌ను ఆవిష్కరించారు. ఇలా డెవలప్ చేసిన దానిని ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండా అందరికి అందుబాటులో ఉంచారు. అంతేకాదు కోడింగ్, రీజనింగ్, మేథమేటిక్స్‌లో ఇతర ఏఐ ప్లాట్‌ఫామ్స్‌కు సమానంగా పనిచేసింది డీప్‌సీక్. సింపుల్‌గా చెప్పాలంటే దిగ్గజ కంపెనీలు ఇలాంటి మోడల్‌ను తయారు చేసేందుకు 30 రెట్లు ఎక్కువగా ఖర్చు చేశాయి. ప్రస్తుతం అమెరికా, చైనా, యూకేల్లో టాప్ ఫ్రీ అప్లికేషన్ లిస్ట్‌లో ఓపెన్ ఏఐను బీట్ చేసింది డీప్‌సీక్.
ఎన్విడియా షేర్లు ఎందుకు దెబ్బతిన్నాయి?
ఏఐ చాట్‌బోట్స్‌ను డెవలప్ చేసేందుకు ఈ కంపెనీ చిప్స్‌ను వాడతారు. అయితే డీప్‌సీక్ ఓ స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. తాము ఎన్విడియా చిప్స్‌తో కంపేర్ చేస్తే.. తక్కువ అడ్వాన్స్ చిప్స్‌తోనే తాము ఈ ఏఐ మోడల్స్‌ను రూపొందించామనేది దాని సారాంశం. ఈ ఒక్క స్టేట్‌మెంట్‌తో ఆ కంపెనీ షేర్లు ఏకంగా 17 శాతం షేర్లు కుప్పకూలాయి. ఒక్క ఎన్విడియా మాత్రమే కాదు.. అమెరికా మరో చిప్ మేకింగ్ కంపెనీ బ్రాడ్‌కామ్ ఇంక్ షేర్లు కూడా 17 శాతం పతనమయ్యాయి.
టెక్ కంపెనీలకు ట్రంప్ వార్నింగ్
డీప్‌సీక్ టెక్నాలజీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఈ టెక్నాలజీ అమెరికా కంపెనీలకు మేల్కోలుపు లాంటిదన్నారు.కాంపిటిషన్‌పై ఫోకస్ చేసి ఇందులో విజయం సాధించాలన్నారు.
డీప్‌సీక్‌పై ఓపెన్ ఏఐ ప్రశంసలు
డీప్‌సీక్ రిలీజ్ చేసిన ఆర్1 మోడల్ ఆకట్టుకుంటుందన్నారు ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్. పోటీ ఉండటం మంచిదే అని.. త్వరలోనే తాము మరింత మెరుగైన మోడల్‌ను తీసుకొస్తామన్నారు ఆయన.
డీప్‌సీక్‌పై సైబర్ అటాక్…
సంచలనం సృష్టించిన డీప్‌సీక్‌పై సైబర్ అటాక్స్ మొదలయ్యాయి. కొత్త యూజర్లు రిజిస్టర్ కాకుండా అడ్డుకుంటున్నారని ఆ సంస్థ ప్రకటించింది. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించింది.