టెస్టుల్లో టీమిండియా రారాజు. కానీ ఇదంతా గతం . పాయింట్స్ పట్టికల్లో ఎప్పుడూ టాప్‌గా ఉంటూ.. ఎలాంటి కష్టం లేకుండా సునాయాసంగా WTC ఫైనల్స్‌కు చేరడం మొదటి నుంచి ఉన్నదే. కానీ ఫర్ ది ఫస్ట్ టైమ్ హిస్టరీ.. WTC ఫైనల్స్‌కు క్వాలిఫై కాలేకపోయింది టీమిండియా. కారణం టీమిండియా చెత్త ప్రదర్శన. సొంత గడ్డపై న్యూజిలాండ్‌పై వైట్ వాష్.. ఇప్పుడు ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫి చేజారడం… ఇలా అనేక భంగపాట్లతో WTC ఫైనల్ బెర్త్ ఆశతో పాటు పరువు కూడా పోయింది. ఇంతకీ ఈ డౌన్‌ఫాల్‌కు కారణమేంటి? దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరు? టీమ్‌కు కావాల్సిన ప్రణాళికలను రచించలేని కోచ్ గౌతమ్ గంభీర్‌దా? లేక టీమ్‌ను ముందుండి నడిపించలేక పోయిన కెప్టెన్ రోహిత్ శర్మదా? సత్తా ఆడలేక వికెట్లు సమర్పించుకున్న సీనియర్ బాట్స్‌మెన్‌దా? ఎవరు టీమిండియా కొంప ముంచింది? ఈ అవమానానికి కారణమైంది.
ఫస్ట్ లెటెస్ట్ విషయానికి వద్దాం..
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్‌కు అర్హత సాధించాలంటే ఆఖరి టెస్ట్‌లో టీమిండియా కచ్చితంగా గెలవాలి. సిరీస్ గెలుపు విషయం అటుంచితే.. చివరివరకు క్యాలిక్యులేషన్ చేసుకోవడానికైనా ఈ మ్యాచ్‌తో గెలవాల్సి ఉంటుంది. అలాంటి మ్యాచ్‌లో కూడా భారత ప్లేయర్లు చేతులెత్తేశారు. నిర్లక్ష్యంగా ఆడి పరువు పోగొట్టారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో ఫెయిల్ అయి.. సిరీస్ ఆస్ట్రేలియాకు ఇచ్చేశారు. భారత ఆటగాళ్ల తప్పిదాల ముందు ఆసీస్ గెలుపు తేలికయింది. ఫలితంగా వరుసగా రెండుసార్లు వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్‌కు వెళ్లిన భారత్.. ఈసారి మూడో స్థానానికి పరిమితం అయింది. ఆసీస్ పదేళ్ల తర్వాత బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ గెలవగా.. భారత్ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఆశలు గల్లంతయ్యాయి.
పాతుకుపోయిన బ్యాట్స్‌మెన్ ఒక్కరూ లేరు..
పెర్త్ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో గెలిచిన జోష్‌ను సిరీస్ మొత్తం కొనసాగించలేకపోయింది టీమిండియా. ఏ ఒక్కరు కూడా క్రీజులో ఓర్పుగా ఆడినట్లు కనిపించలేదు. ప్రత్యర్థి టెయిలెండర్లకు ఉన్నంత సహనం భారత స్టార్లకు లేకుండాపోయింది. టార్గెట్ చేధించలేక బ్యాటర్లు, ఇచ్చిన టార్గెట్‌ను కాపాడుకుకోలేక బౌలర్లు చేతులెత్తేశారు. టెస్ట్ మ్యాచ్ అంటే బ్యాటర్లు రోజంతా క్రీజులో నిలబడాలి. కానీ మనవాళ్లు ఒక్కరు కూడా కనీసం ఒక సెషన్ పూర్తిగా బ్యాటింగ్ చేయలేకపోయారు. ఇటు సీనియర్లు తమ పూర్ ఫామ్‌ను కొనసాగిస్తుంటే.. అటు జూనియర్లు తామేం తక్కువ కాదన్నట్లు ఒక్కో మ్యాచ్‌లో ఒక్కొక్కరు ఫెయిల్ అయి.. టీమిండియా కొంపముంచారు. మరీ దారుణమైన విషయం ఏంటంటే ఈ సిరీస్‌లో బ్యాటింగ్‌కు సహకరించిన పిచ్‌లపై కూడా భారత బ్యాటర్లు విఫలం అయ్యారు. ఆసీస్ బ్యాటర్లు విజృంభించిన అదే పిచ్‌పై మనవాళ్లు తడబడటం దారుణమనే చెప్పాలి. బాధ్యతగా ఆడాల్సిన సీనియర్లు… ఫెయిల్ అవడమే పనిగా పెట్టుకున్నట్లు ఔట్ అయ్యారు. సిరీస్ మొత్తం కోహ్లీ ఒకే బలహీనతతో పెవిలియన్ బాట పట్టాడు. అటు రోహిత్ ఆటతీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. కెప్టెన్‌గా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాల్సిన రోహిత్.. పరుగులు చేయకపోవడం జట్టుకు మైనస్ అయింది. ఆఖరి టెస్టు నుంచి తానే తప్పుకోవడం మంచిదైంది. లేదంటే ఎదురైయ్యే విమర్శలకు రోహిత్ సమాధానం చెప్పుకోలేక కెరీర్ ఎండ్ అయ్యేది.
తేలిపోయిన టీమిండియా బౌలింగ్
టీమిండియా బౌలింగ్ యునిట్ కూడా తమ పాత్రను పోషించలేకపోయింది. ముఖ్యంగా సిరాజ్ తన బాధ్యతను నిర్వర్తించలేకపోయాడు. ఓ వైపు బుమ్రా ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తుంటే.. సిరాజ్ మాత్రం వికెట్ల తీయడం కాదు కదా.. కనీసం పరుగులు కట్టడి చేసేందుకు కూడా ఇబ్బంది పడ్డాడు. మూడో పేస్ బౌలర్ కోసం భారత సెలెక్టర్లు చేయని ప్రయత్నం లేదు. ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా లాంటి యంగ్‌స్టర్స్‌కు చాన్స్ ఇచ్చినా.. పెద్ద ఫలితం చూపలేకపోయారు. ఈ సిరీస్ ద్వారా భారత్‌కు కలిసొచ్చిన విషయం ఏదైనా ఉందంటే.. అది ప్రసిద్ధ్ కృష్ణ పర్ఫామెన్సే. చివరి మ్యాచ్‌లో వచ్చిన ఎంట్రీ ఇచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ.. ఔట్ ఆఫ్ ది సెలబస్‌గా 6 వికెట్లు పడగొట్టాడు.
మారాల్సిన టైమ్ వచ్చిందా?
ఏ ప్లేయర్ ఫ్యూచర్‌పై కామెంట్స్ చేయను. అది వారిపై ఆధారపడి ఉంటుంది. వారిలో తపన, నిబద్ధత.. భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ఉంటే అవసరమైంది చేస్తారు. అరంగేట్రం చేసిన ఆటగాడైనా.. 100 టెస్టులు ఆడిన ప్లేయరైనా ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తా.. అని గంభీర్ మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియా కాన్ఫరెన్స్ లో చెప్పిన మాటలు. ఇప్పుడు గంభీర్ చేసిన వ్యాఖ్యలతో టీంలో మార్పులు రాబోతున్నాయా? సీనియర్లను తప్పిస్తారా? లేదా చివరి అవకాశంగా మరోసారి ఎంపిక చేస్తారా చూడాలి. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం తన రిటైర్మెంట్‌పై ఇప్పుడే ఆలోచన లేదని చెప్పేశాడు. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతుండటంతో జట్టు నుంచి తప్పుకున్నట్లు తెలిపాడు. ఇక కోహ్లీ ఫామ్ విషయం అటుంచితే.. ఫిట్‌నెస్ వల్ల మరో నాలుగేళ్లు ఆడే సత్తా ఉందని ఇప్పటికే మాజీలు చెబుతున్నారు. అయితే టీమిండియాలో యంగ్ ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వాలనేది కన్నేళ్లుగా ఉన్న డిమాండ్. ఫెయిల్ అవుతున్న సీనియర్లను తప్పించి.. కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలని చాలామంది మాజీలు బహిరంగ ప్రకటన చేశారు.
కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం..
ఆస్ట్రేలియా గడ్డపై కుర్రాళ్లు చూపిన ప్రతిభ అద్భుతం. ఓపెనర్ జైస్వాల్, నితీశ్ రెడ్డి పెద్దగా అనుభవం లేకపోయినా ఆసీస్‌ను కంగారు పెట్టించారు. బౌలింగ్‌లో తొలి మ్యాచ్‌లోనే ప్రసిద్ధ్ కృష్ణ ఆరు వికెట్లు పడగొట్టి భారత్‌కు ఆశాజనకం అయ్యాడు. అవకాశం ఇచ్చిన ప్రతిసారీ వాషింగ్టన్ సుందర్ తన సత్తా నిరూపించుకున్నాడు. అయితే గిల్, పడిక్కల్, సర్ఫరాజ్‌లు తమకు అందొచ్చిన అవకాశాల్ని మళ్లీ మళ్లీ చేజార్చుకుంటున్నారు. ఇలా కన్సిస్టెన్స్ లేని వారిని తీసుకుని భారత్‌ను మరింత చిక్కుల్లో పడేయడం కత్తిమీద సాములాంటిదే.
బుమ్రా లేకపోతే అంతేనా?
భారత బౌలింగ్ దళానికి బుమ్రానే పెద్దన్న అని చెప్పాలి. ఈ ఒక్క సిరీస్ అనే కాదు తాను ఆడుతున్న ప్రతి మ్యాచ్‌లో 100 శాతం ఎఫర్ట్స్ పెట్టి టీంకు అండగా నిలుస్తున్నాడు. ఈ సిరీస్‌లో బుమ్రా మాత్రమే ఆసీస్‌ను నిలువరించగలిగాడు. అతను ఉన్నంత వరకు కంగారూ బ్యాటర్లు ఆచితూచి ఆడారు. అతని స్పెల్ అయిపోగానే మిగతా బౌలర్లపై విరుచుకుపడ్డారు. గతంలో పేస్ బౌలింగ్‌లో టీమిండియా పరిస్థితి ఎలా ఉండేదో.. ఇప్పుడు అలానే తయారైంది. చాలామంది పేస్ బౌలర్లు అందుబాటులో ఉన్నా రాణించేవారు కరువయ్యారు. షమీ గాయం కారణంగా టీంకు దూరం కాగా సిరాజ్ ఎప్పుడు ఆడతాడో ఎప్పుడు ఆడడో తెలియని పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం టీమిండియా బౌలింగ్ యునిట్ మొత్తం బుమ్రా మీదే ఆధారపడి ఉంది. ఈ సిరీస్‌లో భారత యంగ్ బౌలర్లు తీవ్ర నిరాశ పరిచారు. హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్‌లు లైన్ అండ్ లెంథ్ కోల్పోయి పేస్‌కే పరిమితం అయ్యారు.
ఐపీఎల్ కొంపముంచుతుందా?
భారత క్రికెట్ సుదీర్ఘ ఫార్మట్ మర్చిపోతోంది అనేది ఈ సిరీస్‌తో మరోసారి రుజువైంది. ఐపీఎల్ కారణంగా ఇటు ప్లేయర్లు, అటు అభిమానులు ఎక్కువగా టీ20లకు అలవాటు పడ్డారు. టెస్ట్ క్రికట్ అంటేనే ఓపిగ్గా ఆడాల్సిన గేమ్. గంటల తరబడి క్రీజులో పాతుకుపోవాలి. అలాంటిని పొట్టి క్రికెట్ వల్ల ధనాధన్ ఇన్నింగ్స్‌కే బ్యాటర్లు మొగ్గుచూపిస్తున్నారు. అక్కడ రాణించినవారు టెస్ట్ క్రికట్‌లో విఫలం అవుతున్నారు. దేశవాళిలో ఆడినవారిని టీమ్‌లోకి సెలెక్ట్ చేయరనే భావన చాలామంది యంగ్ ప్లేయర్స్‌లో పాతుకుపోయింది. దాంతో చాలామంది ఐపీఎల్ ఆడేందుకే మొగ్గు చూపిస్తున్నారు. ఇది గమనించిన బీసీసీఐ ప్రతి ప్లేయర్ దేశవాళిలో ఆడాలని నిబంధన తీసుకొచ్చింది. ఈ ఓటముల నుంచైనా బీసీసీఐ సెలక్టర్లు జట్టుకు అవసరమైన ప్లేయర్లను ఎంపిక చేస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.