-
ఏ నిర్ణయం తీసుకున్నా ఏపీ ప్రభుత్వం, ప్రజలు మీ వెంటే..
-
ప్రధాని నరేంద్రమోదీని కలిసి సంఘీభావం తెలిపిన సీఎం చంద్రబాబు
-
రాజధాని నిర్మాణం పనుల పున:ప్రారంభానికి ప్రధానికి ఆహ్వానం
కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదంపై చేస్తున్న పోరాటంలో ఏపీకి చెందిన ప్రజలు, ప్రభుత్వం కూడా అండగా ఉంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీతో స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పేలా కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని ఆయన మోదీకి వెల్లడించారు. పహల్గామ్‌లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి తనను తీవ్రంగా ఆవేదనకు గురిచేసిందని చంద్రబాబు చెప్పారు. న్యూఢిల్లీలో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈమేరకు ప్రధానికి తన సంఘీభావాన్ని తెలిపారు. ఉగ్రవాదులది పిరికిపంద చర్య అని, ఈ హింసను ఖండిస్తున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పహల్గామ్ బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. దేశ భద్రతను కాపాడే విషయంలో మోదీ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
అమరావతి అభివృద్ధి పనులు మోదీకి వివరించిన ముఖ్యమంత్రి :
వచ్చే మే 2వ తేదీన చేపట్టే రాజధాని పనుల పున:ప్రారంభానికి ముఖ్య అతిధిగా రావాలని ప్రధాని నరేంద్రమోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. అమరావతిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన ప్రధాని, రాజధాని నిర్మాణానికి సంబంధించి పలు సూచనలు చేశారు. అమరావతిలో పచ్చదనం పెంచేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని…, ఇందుకోసం మియావాకి విధానాన్ని అమలు చేయాలని సూచించారు. పనులు పున:ప్రారంభించే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధానమంత్రి అంగీకారం తెలిపారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని, ఆర్ఐఎన్ఎల్ గురించి ప్రధానికి సీఎం వివరించారు. ఎస్సీ వర్గీకరణకు కేంద్రం ఆమోదం తెలిపినందుకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్‌టీపీసి, ఆర్సెలర్ మిటల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్‌కు మద్దతు, అలాగే బీపీసీఎల్ రిఫైనరీ మంజూరు విషయంలోనూ ప్రధానికి ధన్యవాదాలు చెప్పారు. ఆరామ్‌కో భాగస్వామ్యాన్ని ఖరారు చేయడంతో అదనపు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈసారి రాష్ట్ర పర్యటనలో శ్రీశైలం కూడా సందర్శించాలని నరేంద్రమోదీని చంద్రబాబు కోరారు.