28 C
Hyderabad
Friday, July 31, 2026

Live Video

spot_img

సెంట్రల్‌ వర్శిటీ భూములు కాపాడతాం – బీజేపీ ఎంపీలు

కంచి గచ్చిబౌలి భూముల వివాదం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ భూముల వ్యవహారంలో ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్‌ మంత్రుల కమిటీతో భేటీ అయ్యారు. మరోవైపు బీజేపీ ఎంపీలు హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సిలర్‌ తో సమావేశమై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఇదే వివాదంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ చిట్ చాట్ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కాకరేపుతున్నాయి. హెచ్‌సీయూ భూ వివాదం వెనుక ఒక బీజేపీ ఎంపీ ఉన్నారని కేటీఆర్‌ చేసిన ఆరోపణల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి చెందిన పార్లమెంట్‌ సభ్యులు అందరూ సమావేశమవడానికి కారణమయ్యింది.

తెలంగాణ రాజకీయాలు కంచి గచ్చిబౌలి భూముల చుట్టే తిరుగుతున్నాయి. ప్రధాన పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఈ భూ వివాదం లో కాంగ్రెస్ పాలకులతో పాటు… బీజేపీకి చెందిన ఒక ఎంపీ ఉన్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా చిట్ చాట్ లో ఆరోపించారు. దీంతో ఈ భూ వివాదంలో కేటీఆర్ ఆరోపణలు ఎవరిని ఉద్దేశించి అన్నారనే దానిపై బీజేపీలో చర్చ సాగుతోంది. తమ ఎంపీల్లో నిజంగా బ్లాక్‌షీప్‌ ఉందా…? ఉంటే ఎవరు అన్న అంశంపై బీజేపీ తర్జనభర్జనలు పడుతోంది.

బీజేపీ నుంచి తెలంగాణలో 8 మంది ఎంపీలు ఉన్నారు. మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. కంచి గచ్చిబౌలి భూ వివాదంలో బీజేపీ ఎంపీ ఉన్నారని కేటీఆర్‌ బాంబు పేల్చడంతో పలువురు పార్టీ ఎంపీలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హెచ్‌సీయూ వీసీ తో మాట్లాడి భూ వివాదంలో జరుగుతున్న ప్రచారాలను, వాస్తవాలను తెలుసుకునేందుకు  పూర్తి వివరాలు తెప్పించుకున్నారు. భూ వివాదానికి కారణాలు ఏంటనే దానిపై సమాచారం తెలుసుకున్నారు. సెంట్రల్‌ వర్శిటీ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఉండటంతో స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి లీడ్ తీసుకొని బీజేపీ ఎంపీలతో మీటింగ్ పెట్టారు. ఈ సమావేశానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు.

భూముల వేలానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం, బీఆర్‌ఎస్‌ అరోపణల నేపథ్యంలో వాస్తవాలను పార్టీ తరఫున ప్రజల ముందు ఉంచాలని ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు. వాస్తవాలు నిగ్గు తేల్చేందుకే హెచ్‌సీయూ వీసీ, రిజిస్ట్రార్ తో సమావేశమైనట్లు ఎంపీలు చెపుతున్నారు. కంచి గచ్చిబౌలి భూముల వేలాన్ని బీజేపీ అడ్డుకోలేదన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ బట్ట కాల్చి మీద వేసే ధోరణితో వ్యవహరిస్తోందని బీజేపీ ఎంపీలు ఆరోపిస్తున్నారు. భూ వివాదంలో బీజేపీ ఎంపీ ఉన్నారని కేటీఆర్ చిట్ చాట్ ఆరోపణలను బీజేపీ ఎంపీలు ఖండించారు. కెసిఅర్ హయంలోనే 134 ఎకరాల హెచ్‌సీయూ భూమి టీఎన్జీవో లకు ఎలా కేటాయించారని ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. మొత్తంగా హెచ్‌సీయూ భూములను కాపాడటమే లక్ష్యంగా బీజేపీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ ఎంపీలు సమావేశం అనంతరం ప్రకటించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com