- మూడు లక్షల మంది విద్యార్ధులపై ప్రభావం..
- తట్టా, బుట్టా సర్దుకుని వెనక్కు రావాల్సిందే
- ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రద్దయ్యే ఛాన్స్
- అది లేకపోతే ఉద్యోగాలు ఉండవు..
- దీనివల్ల నష్టపోయేది భారతీయ విద్యార్ధులే
- ఓపీటీ ద్వారానే రుణాలు తీరుస్తున్న విద్యార్ధులు
- అమెరికన్ జాబ్ మార్కెట్ పై భారీ ప్రభావం
- ఏదో ఒక ఉద్యోగం కోసం మనోళ్ల తిప్పలు
- అమెరికా ఆర్థిక స్థితిపైనా దీని ప్రభావం
ట్రంప్ అనాలోచిత నిర్ణయాలు భారతీయుల పాలిట శాపంగా మారుతున్నాయి. తాజాగా అంతర్జాతీయ విద్యార్ధులకు ఉపాధి, ఉద్యోగావకాశాలను కల్పించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను రద్దు చేస్తూ తాజాగా మరో బిల్లును ప్రవేశ పెడతారన్న వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వార్త అక్కడి భారతీయ విద్యార్ధుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్ధులు అక్కడే ఉపాధి మార్గాలను వెతుక్కోడానికి, ఉద్యోగాలు చేయడానికి కొంత ట్రైనింగ్ తో కూడిన ప్రోగ్రామ్ ఉంటుంది. ఇంజనీరింగ్, సైన్స్, మాథమాటిక్స్,టెక్నాలజీ కోర్సులు చేసిన విద్యార్ధులు మూడేళ్ల పాటు ఈ ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే అక్కడ పనిచేయడానికి వీలుగా వారు తయారవుతారు. ఇన్నాళ్లు లక్షల మందికి ఉద్యోగావకాశాలను కల్పించిన ఆ ప్రోగ్రామ్ ను ఇప్పుడు రద్దు చేసే ఉద్దేశంలో ట్రంప్ ఉన్నారు. అదే జరిగితే మూడు లక్షల మంది విద్యార్ధులకు ఉపాధి కరువవుతుంది. వారంతా వెనక్కు తిరిగి రావాల్సిందే.
ఓపెన్ డోర్స్ అనే సర్వే రిపోర్ట్ ప్రకారం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రద్దు వల్ల ఎక్కువగా భారతీయ విద్యార్ధులే నష్టపోతారు. 2023-2024 అకడమిక్ ఇయర్ లో దాదాపు 97,556 మంది విద్యార్ధులు ఈ ప్రోగ్రామ్ తో లబ్ది పొందారు. ఇది గత ఏడాదికంటే 41 శాతం ఎక్కువ. ప్రతిపాదిత బిల్లు అమల్లోకి వస్తే ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్ధులంతా చదువు తర్వాత వెనక్కు తిరిగి రావాల్సిందే. ఆర్ధిక స్థిరత్వాన్ని కల్పించి, ఉద్యోగావకాశాలు కల్పించే ఈ ప్రోగ్రామ్ నిలిపేస్తే భారతీయ విద్యార్ధులు ఉన్నపళంగా వెనక్కు రావాల్సిందే. ఎందుకంటే అక్కడ చదువుకునేందుకు అవసరమైన రుణాలను స్టూడెంట్లు ఈ ఓపీటీ ప్రోగ్రామ్ ద్వారానే తీరుస్తారు. అమెరికా ఈ బిల్లు తీసుకొస్తే అక్కడ విద్యార్ధులు కెనడా, యూరోపియన్ యూనియన్ లాంటి దేశాలకు వలస వెళ్లాల్సిందే.ఇది అమెరికాలో ఉపాధి అవకాశాలను కూడా దెబ్బ తీస్తుంది. నైపుణ్యం కలిగిన విద్యార్ధులకు కొరత ఏర్పడుతుంది.
ప్రస్తుతం ఎఫ్1, ఎం1 స్టూడెంట్ వీసా కలిగిన వారంతా హెచ్1బీ వర్క్ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. వీసాల సంఖ్య కుదించేయడంతో హెచ్1బీ వీసాలు అందరికీ దొరకడం దాదాపు అసాధ్యం. అందుకే హెచ్1బీ వీసాల కోసం విద్యార్ధులు పోటెత్తుతున్నారు.హెచ్ వన్ బీ వీసాల విధానంలో మార్పులు, చేర్పులు జరగకముందే అక్కడ ఏదోలా ఉద్యోగంలో చేరిపోవాలని తపన పడుతున్నారు.
ఓపీటీ ట్రైనింగ్ పూర్తి చేసిన విద్యార్ధులకు ఏడాదిలోగా ఉద్యోగాలు వస్తాయ్. ఆ తర్వాత వాటిని రెండు, మూడేళ్ల వరకు పొడిగించుకోవచ్చు. ఇంజనీరింగ్, టెక్నాలజీ లాంటి వృత్తి విద్యా విద్యార్ధులకు మాత్రమే ఇది సాధ్యం. ప్రస్తుతానికి ఇలా ఉపాధి పొందిన వారిని అమెరికన్ ఎంప్లాయర్ గా పరిగణిస్తారు. అయితే ఒకసారి కొత్త బిల్లు పాస్ అయితే మాత్రం విద్యార్ధులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండవు. తక్షణం వెనక్కు వచ్చేయాల్సిందే.
ప్రస్తుతం ఈ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న విద్యార్ధులు తమ సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ అన్నింటినీ మానుకున్నారు. ఒకవేళ స్వదేశం వస్తే మళ్లీ అమెరికా తిరిగి వెళ్లే అవకాశం ఉండదని భయపడుతున్నారు. ఉన్నత విద్యా సంస్థలు కూడా విద్యార్ధులను లీవ్ లో వెళ్లోద్దని సలహా ఇస్తున్నాయి.
ఎన్నికల వాగ్దానమంటున్న ట్రంప్
ప్రతిపాదిత బిల్లు అమల్లోకి వస్తే భారతీయ విద్యార్ధులు లక్షల సంఖ్యలో ఇంటి ముఖం పట్టాల్సిందే. వీసాల సంఖ్యను కూడా కుదించేస్తుండటంతో భారతీయ విద్యార్ధులు ఇక అమెరికాలో ఉండటం అసంభవం. ఎన్నికల ప్రచారంలో భాగంగానే ట్రంప్ ఈ వాగ్దానాలు చేశారు. వాటిని అమలు చేసే పనిలో ఇప్పుడు పడ్డారు. ఈ బిల్లు ప్రభావం యూనివర్సిటీల మీద పడుతుంది. అంతర్జాతీయ విద్యార్ధులు ఎక్కువ సంఖ్యలో అమెరికాలో ఉద్యోగాలు చేయలేకపోవడం వల్ల భవిష్యత్తులో అమెరికా ఆర్థిక స్థితి మీద కూడా దెబ్బ తీస్తుంది.