రాష్ట్రంలో ఆర్థిక అసమానతలను రూపు మాపేందుకే పీ-4 విధానాన్ని తీసుకొస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. జీరో పావర్టీ సాధించ గలిగినప్పుడే తన జన్మ సార్థకమైనట్లు భావిస్తానన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
ఉగాది వేడుకల్లో చంద్రబాబు మాట్లాడుతూ 20 యేళ్ల క్రితమే తాను ఐటీ ప్రాధాన్యత గురించి చెప్పానని, తన మాట విని అప్పుడే ఆ రంగం వైపు వెళ్లినవారు ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నారని చెప్పారు. అవకాశాలు ఉపయోగించుకుంటే సాధారణ వ్యక్తులూ ఉన్నతంగా ఎదుగుతారన్నారు. అధికంగా డబ్బు సంపాదించే తెలివి ఉన్నవాళ్లు భారతీయులని, సమాజం వల్ల కొందరు ఉన్నతంగా ఎదిగారని చెప్పారు. అలాంటి వారు తిరిగి సమాజానికి ఇవ్వాలని, పేదరిక రహిత రాష్ట్రం కోసం కృషి చేయాలని, చంద్రబాబు అన్నారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి ఉగాది పురస్కారాలను సీఎం చంద్రబాబు ప్రదానం చేశారు.
శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకల్లో భాగంగా ముందు జ్యోతిని వెలిగించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఉత్సవాల్లో మంత్రులు కందుల దుర్గేష్, ఆనం రామనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉగాది పచ్చడిని నేతలు స్వీకరించారు. వేడుకల సందర్భంగా పలువురు కళాకారులు ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పండితులు మాడుగుల నాగఫణిశర్మ పంచాంగ శ్రవణం చేశారు.