అసత్య వార్తలు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటాం – టీటీడీ చైర్మన్
శ్రీవారి భక్తులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు తిరుమల తిరుపతి దేవస్ధానం చైర్మన్ బీఆర్‌నాయడు. సోమవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమలలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో టీటీడీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకమండలికి టీటీడీ అధికారులకు మధ్య విభేధాలు ఉన్నట్లు వస్తున్న వార్తలను ఆయన తవ్రంగా ఖండిచారు. తిరుమల అనేది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబందించిన విషయమని వార్తలు ప్రచురించేటప్పుడు, ప్రసారం చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని టీటీడీ చైర్మన్ మీడియాకు సూచించారు. అధికారులకు పాలక మండలికి మధ్య ఎటువంటి విభేధాలు లేవని అందరూ సమన్వయంతో పనిచేస్తున్నామని నాయుడు తెలిపారు. జనవరి 8వ తేదీన అత్యంత దురుదృష్టకరమైన సంఘటన జరిగిందని, అటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని చైర్మన్ నాయడు వివరించారు. తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వ్యక్తుల కుంటుంబాలకు, గాయపడిన వారికి సీయం ఆదేశాల ప్రకారం పరిహారం అందజేస్తామని బీఆర్‌నాయుడు ప్రకటించారు. బోర్డు సభ్యులతో రెండు బృందాలను ఇందుకు కోసం నియమించినట్లు ఆ బృందాలు బాధితులకు పరిహారం అందచేస్తారని తెలిపారు. ఆ ఒక్క సంఘటన మినహా మిగితా ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా చేశామని భక్తులు ప్రశాంతంగా వైకుంఠద్వార దర్శనం చేసుకుంటున్నారని తెలిపారు. టీటీడీ పాలకమండలి, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. మీడియా చేతిలో ఉందని ఇష్టానుసారం అసత్య వార్తలు రాసినా, ప్రచారం చేసినా వారిపై చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ బీఆర్‌నాయుడు హెచ్చరించారు.