-
ఏ ప్రచారకుడినీ అధ్యక్షుడిగా పంపబోం
-
ఏబీపీఎస్ సమావేశాల్లో నిర్ణయం
-
ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే వెల్లడి
బీజేపీకి తాము సంరక్షకులం కాదని, ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీని సంరక్షించే సంస్థ కాదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే స్పష్టం చేశారు. ప్రతిరోజూ ఇలా చేయాలని, అలా చేయాలని బీజేపీ వాళ్లకు చెప్పడం తమ పని కాదన్నారు.
బెంగళూరులో మూడు రోజుల పాటు జరిగిన ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రతినిధుల సభలో పలు కీలక అంశాల గురించి చర్చించారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాబోయే యేడాదిలో, ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలను ఫైనలైజ్ చేశారు. ఈ సందర్భంగా ఏబీపీఎస్ సమావేశాల చివరి రోజు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే మీడియాకు పలు వివరాలు వెల్లడించారు.
దేశ ప్రజలు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ పనితీరు ఎలా ఉందో చెప్పారని హోసబలే పేర్కొన్నారు. అంతా బాగానే జరుగుతుందని భావిస్తున్నామన్నారు. ఈ పని ఈ ప్రాంతంలో జరగాలని తాము భావిస్తే, అప్పుడు తమ అభిప్రాయాలను కూడా వ్యక్తపరుస్తామని దత్తాత్రేయ హోసబలే వెల్లడించారు.
మరోవైపు.. బయట ప్రచారం జరుగుతున్న మాదిరగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడి కోసం ఏ ప్రచారకుడిని పంపే ఉద్దేశం ఆర్ఎస్ఎస్కు లేదన్నారు దత్తాత్రేయ హోసబలే. ఆర్ఎస్ఎస్ ప్రేరేపిత సంస్థలన్నీ స్వతంత్రమైనవని స్పష్టం చేశారు. వారి స్వంత ప్రక్రియ కింద వారి అధ్యక్షుడిని ఎన్నుకునే స్వేచ్ఛను కలిగి ఉంటాయన్నారు. ఇందులో తమను అడగడం ద్వారా ఏమీ చేయవలసిన అవసరం లేదని స్పష్టత ఇచ్చారాయన.
కుల గణనపైనా ఆర్ఎస్ఎస్ ముఖ్యనేత హోసబలే స్పందించారు. ఈ అంశంపై అభిప్రాయం తెలియజేస్తూ.. మన సమాజంలో కులాలు, వర్గాల మధ్య ఎలాంటి తగాదాలు ఉండకూడదన్నారు. ఎవరైనా క్రీడలలో పతకం సాధించినప్పుడు లేదా ఒక సైనికుడు సరిహద్దులో అమరుడైతే, మనం వారి మతం లేదా కులాన్ని చూడబోమని, వారి పట్ల గర్విస్తామని, వారిని కుల మతాలకతీతంగా అభినందిస్తామన్నారు. ఇది మన దేశంలో సామరస్యం అని దత్తాత్రేయ హోసబాలే కుల గణనపై ఆర్ఎస్ఎస్ ఒపీనియన్ చెప్పారు.