23.7 C
Hyderabad
Tuesday, September 15, 2026

Live Video

spot_img

రాహుల్‌ గాంధీని ప్రధానిగా చూసే వరకూ మనమంతా కసిగా పనిచేయాలి

  • పనిచేసేవారికే పదవులు, పదవులు పొంది పనిచేయకపోతే రెన్యువల్ ఉండదు
  • పీసీసీ విస్తృత స్ధాయి సమావేశంలో సీయం రేవంత్‌

మార్చి 10వ తేదీల్లోగా అన్ని జిల్లాల్లో నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇన్‌ఛార్జ్‌ మంత్రులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ మొదటి సారి రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా శుక్రవారం  గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ విస్తృత స్ధాయి సమావేశానికి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీయం మాట్లాడుతూ పెద్ద పెద్ద విమర్శకులు కూడా మన ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారని… మన సక్సెస్‌ స్టోరీ మనమే చెప్పుకోవాలని… కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి మనమే తీసుకు వెళ్ళాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.  మీనాక్షీ నటరాజన్‌ లాంటి వారిని మనకు ఇన్‌ఛార్జ్‌గా నియమించినందుకు మనం మరింత కష్టపడి పార్టీ కోసం పనిచేయాలన్నారు. పార్టీ జెండా మోసినవారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని, పార్టీ కోసం కష్టపడినవారికే నామినేటెడ్ పదవులు ఇచ్చామని పేర్కొన్నారు. సుదీర్ఘకాలం పనిచేసిన కొంతమందికి అవకాశాలు రాలేదని వారినికాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉందన్నారు. రాబోయే రోజుల్లో వారికి తప్పకుండా ప్రాధాన్యత కల్పిస్తామని సీయం హామీ ఇచ్చారు. వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు, నామినేటెడ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పదవులు వచ్చిన వారూ పార్టీ కోసం కష్టపడాలని, పనితీరు సరిగా లేని వారికి రిన్యూవల్ ఉండదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవరైనా మంచిని మైక్ లో చెప్పండి… చెడును చెవిలో చెప్పాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. మన ప్రభుత్వం వచ్చాక రూ.4200 కోట్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కోసం ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపారు. అలాగే 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల విద్యుత్ అందిస్తున్నామని, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని, రైతు భరోసాను రూ.12 వేలకు పెంచడంతోపాటు భూమిలేని పేదల కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తున్నామని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలను సీయం వివరించారు. మన ప్రభుత్వం కులగణన చేసి దేశానికే ఆదర్శంగా నిలిచిందని అలాగే దేశంలోనే అత్యధిక విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ఇది మన చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నామని, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పారు. మోదీని గద్దె దించి రాహుల్ గాంధీని ప్రధానిని చేసే వరకు మనమంతా కసితో పనిచేయాలి కాంగ్రెస్‌ నాయకులకు పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ పట్టుదలతోనే కులగణన, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేయగలిగామని రాష్ట్రంలో అధికారంలో ఉంటేనే ఇన్ని చేయగలిగితే దేశంలో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొస్తే ఇంకెన్ని చేయొచ్చుని అన్నారు. దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ గ్రామగ్రామాన తిరుగుతున్నారు అలాంటి రాహుల్ గాంధీని ప్రధానిని చేసేవరకు విశ్రమించొద్దని, రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే ఎజెండాగా ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్తా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com