35.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

Live Video

spot_img

వస్తాడు మారాజు.. దిల్‌రాజు

– అడకత్తెరలో దిల్‌రాజు
– అమెరికా నుంచి ఎప్పుడొస్తారు?

తెలంగాణకు చెందిన లీడింగ్‌ నిర్మాత దిల్‌రాజు ఇటీవలే తెలంగాణ ప్రభుత్వంలో కీలక పదవిలో నియమితులయ్యారు. ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే వ్యక్తిగత పనుల మీద అమెరికా పయనమై వెళ్లారు. అయితే, దిల్‌రాజుకు ఎఫ్‌డీసీ చైర్మన్‌ పదవి సంబరం మూన్నాళ్ల ముచ్చటే అవుతోందా? ఇప్పుడు దిల్‌రాజు పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా తయారయ్యిందా? అటు.. ప్రభుత్వ పెద్దలను బుజ్జగిస్తారా? ఇటు.. తోటి సినీ ప్రముఖులను సర్దుకుపోమంటారా? ఇప్పుడీ ఇష్యూ తెలంగాణలో హాట్‌ టాపిక్‌ అయి కూర్చుంది.

సమీపిస్తోన్న సంక్రాంతి :

సంక్రాంతి సమీపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి అంటే ఎంత సందడి ఉంటుందో ఎవరికీ చెప్పక్కర్లేదు. ఇక, టాలీవుడ్‌కు కూడా యేడాదిలో పెద్ద పండుగ అంటే సంక్రాంతే. పెద్ద హీరోల సినిమాలు, హై బడ్జెట్‌ సినిమాలు సంక్రాంతి పర్వదినం కోసం కాచుకొని కూర్చుంటాయనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఇక, చిన్న సినిమాల సంగతి సరే సరి.. ఈ పరిస్థితుల్లో సంక్రాంతికి పెద్దమొత్తంలో సినిమాలు రిలీజ్‌ అవడం పరిపాటి. ఇప్పుడు ఆ టైమ్‌ దగ్గరకొచ్చింది. సంక్రాంతికి కనీసం నెలరోజుల సమయం కూడా లేదు. షరా మామూలుగానే.. పలు సినిమాలు సంక్రాంతి ముందు టాకీసులు రిజర్వ్‌ చేసుకొని పెట్టుకున్నాయి.

టాలీవుడ్‌లో గంభీర వాతావరణం :

అయితే, చిక్కంతా ఇక్కడే వచ్చి పడింది. ఈ యేడాది సంక్రాంతికి రిలీజయ్యే సినిమాల్లో పలు హైబడ్జెట్‌ సినిమాలు కూడా ఉన్నాయి. సాధారణంగా పెద్ద సినిమాలు, భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలకు బెనిఫిట్‌ షోలు, ప్రీమియర్‌ షోల సంస్కృతి కొన్నేళ్లుగా తప్పనిసరి అయిపోయింది. సినిమా రిలీజ్‌కు ముందు రోజు రాత్రినుంచే బెనిఫిట్‌ షోలు ప్రదర్శించడం, ఇక, రోజుకు సాధారణంగా ఉండే నాలుగు షోల స్థానంలో ఆరు, ఏడు షోలు నడిపించడం వంటి సంప్రదాయం ప్రతీ పెద్ద బడ్జెట్‌ సినిమాకు కామన్‌గా మారింది. అంతేకాదు..సినిమా టికెట్ల ధరలు కూడా కొన్నిరోజుల పాటు పెంచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్నాయి. మరి.. ఇప్పుడు సంక్రాంతికి మళ్లీ సినిమాలు వచ్చేస్తున్నాయి. కానీ, ఈసారి బెనిఫిట్‌షోలు, ప్రీమియర్‌ షోలకు ఛాన్స్‌లేదని సర్కారు చెప్పేసింది. వీటితో పాటే టికెట్ల ధరలు పెంచే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. మరి.. ఈ పరిస్థితుల్లో టాలీవుడ్‌లో ఓ రకమైన గంభీర వాతావరణం నెలకొంది.

దిల్‌రాజు మెడకు చుట్టుకుంటున్నాయా?

గత కొద్దిరోజులుగా పుష్ప-2 సినిమా తొక్కిసలాట వివాదం తెలుగు రాష్ట్రాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మొదట అల్లు అర్జున్‌ టార్గెట్‌గా మొదలైన క్రమంగా సినీ ఇండస్ట్రీ మొత్తానికి టర్న్‌ తీసుకుంది. ఇప్పటినుంచి తెలంగాణలో సినిమాలకు బెనిఫిట్‌ షోలకు, ప్రీమియర్‌ షోలకు అనుమతి ఇచ్చేది లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. అలాగే, సినిమా టికెట్ల ధరల పెంపునకు కూడా సర్కారు అంగీకరించబోదని కరాఖండిగా తేల్చి పడేసింది. ముందుగా సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ అంశంపై బహిరంగ ప్రకటన చేశారు. అయితే, కొద్దిరోజులకు అంతా సర్దుకుంటుందని అనుకున్నారు. కానీ, మంత్రి కోమటిరెడ్డి మామూలుగా ఏదో సందర్భంలో ఈ అంశంపై మాట్లాడారు గానీ, ముఖ్యంత్రి రేవంత్‌రెడ్డి అయితే, అసెంబ్లీలోనే దీన్ని చర్చకు పెట్టారు. పుష్ప-2 సినిమా బెనిఫిట్‌షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై అసెంబ్లీ వేదికగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, మంత్రి సీతక్క కూడా సినిమా నిర్మాణ సంస్థల తీరుపై మండిపడ్డారు. దీంతో, ఇక తెలంగాణలో సినిమావాళ్లకు ప్రభుత్వం నుంచి తాయిలాలు, అదనపు వసూళ్లకు అనుమతులు ఉండవని తేటతెల్లమయ్యింది. ఈ పరిణామాలన్నీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ చైర్మన్‌ దిల్‌రాజు మెడకు చుట్టుకోబోతున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.

నాలుగింటిలో మూడు దిల్‌రాజువే!

ఈసారి సంక్రాంతి రేసులో ప్రధానంగా నాలుగు పెద్ద సినిమాలు రాబోతున్నాయి. రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’, బాలకృష్ణ నటించిన ‘డాకు మహరాజ్‌’, వెంకటేశ్ నటించిన​ ‘సంక్రాంతికి వస్తున్నాం’, సందీప్ కిషన్ నటిస్తోన్న ‘మజాకా’ సినిమాలు రేసులో ఉన్నాయి. వీటిలో సంక్రాంతికి దిల్ రాజు నిర్మించినవి రెండు సినిమాలు కాగా, డిస్ట్రిబ్యుషన్ చేస్తున్న సినిమా ఒకటి ఉంది. ఈ మూడూ భారీ సినిమాలే… గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాము సినిమాలు దిల్‌రాజు స్వయంగా నిర్మించినవి కాగా, డాకు మహరాజ్ సినిమా కూడా దిల్‌రాజు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. సంక్రాతికి రిలీజవుతున్న నాలుగు భారీ బడ్జెట్‌ సినిమాల్లో మూడు సినిమాలు దిల్‌రాజుకు చెందినవే కావడం యాదృచ్ఛికమే అయినా ఇప్పుడు దిల్‌రాజు తల పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

‘తగ్గేదే.. లే’ అంటోన్న రేవంత్‌రెడ్డి :

తెలంగాణలో టాలీవుడ్‌ వర్సెస్ గవర్నమెంట్‌గా నెలకొన్న వివాదంపై ఆచితూచి స్పందించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేసినప్పుడు రాజకీయ పార్టీలన్నీ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అంతెత్తున విరుచుకుపడ్డాయి. ఇక, సినిమా ప్రముఖులు కూడా ఇన్‌డైరెక్ట్‌గా రేవంత్‌ సర్కారుకు ఝలక్‌ ఇచ్చినట్లు వ్యవహరించాయి. కానీ, రేవంత్‌రెడ్డి మాత్రం ‘తగ్గేదే లే…’ అంటూ ఈ అంశంపై మరింతగా నిప్పులు చెరిగారు. ఇక, సినిమా ప్రముఖులు గానీ, విపక్షాలకు చెందిన వాళ్లు గానీ మిన్నకుండి పోవాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. లేదంటే ప్రభుత్వంతో పెట్టుకుంటే ఎటుపోయి ఎటువైపు నుంచి చుట్టుకుంటుందో అన్న భయం సినీ ఇండస్ట్రీని చుట్టుముట్టింది. దీంతో, జాగ్రత్తగా స్పందిస్తున్నారు.

దిల్‌రాజుపైనే నిర్మాతల భారం :

తెలంగాణలో నెలకొన్న ఈ పరిణామాలపై సినిమా డిస్ట్రిబ్యూటర్లు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటరెడ్డి వెంకట్‌రెడ్డి నిర్ణయాలు, ప్రకటనలను స్వాగతిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో నిర్ణయం తీసుకోవాలని కూడా ఓ ఉచిత సలహా ఇచ్చారు. ఇక, టాలీవుడ్‌ నిర్మాతలు కూడా ఈ అంశంపై పెద్దగా ఆందోళన చెందడం లేదు. ఎందుకంటే ఇప్పుడు రిలీజవుతోన్న పెద్ద సినిమాల్లో మూడు సినిమాలు దిల్‌రాజువే ఉన్నాయి. దిల్‌రాజు తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్‌గా ఉన్నారు. అంటే.. అమెరికా నుంచి తిరిగొచ్చిన తర్వాత తన సినిమాలకోసమైనా దిల్‌రాజు సీరియస్‌గా ప్రయత్నాలు చేసుకోవాల్సి వస్తుందని తోటి నిర్మాతలు చెబుతున్నారు. కాబట్టి దిల్‌రాజు ప్రయత్నం సఫలమైతే మిగతా సినిమాలకు కూడా ఆ వెసులుబాటు లభిస్తుందని స్పష్టం చేస్తున్నారు. దిల్‌రాజు యూఎస్‌నుంచి తిరిగిరాగానే అంతా సెటిల్మెంట్‌ చేస్తాడని, ఆ బాధ్యత కూడా అతని భుజాలపైనే ఉందని నిర్మాతలంతా అభిప్రాయపడుతున్నారు.

ఏం జరగబోతోంది?

మరి.. దిల్‌రాజు ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. దిల్‌రాజు.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని నూటికి నూరుశాతం సమీక్షించాలని విన్నవించడం తప్ప గత్యంతరం లేదు. మరి.. సంక్రాంతి సినిమాల కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించగలిగే పరిస్థితులు ఉన్నాయా? తెలంగాణ ప్రభుత్వం దిల్‌రాజు ప్రతిపాదనలను, ఆయన విజ్ఞప్తులను అంగీకరిస్తుందా? టాలీవుడ్‌ కోసం దిగొస్తుందా? తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా? అన్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక.. తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం తగ్గే పరిస్థితి లేకపోతే.. దిల్‌రాజు గానీ, ఇతర నిర్మాతలు గానీ సంక్రాంతికి బెనిఫిట్‌ షోలు, టికెట్ల ధరలు పెంచకుండానే సినిమాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. అదే జరిగితే.. కేవలం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చే అనుమతులు, తాయిలాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు ఉంటాయి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com