విరాట్ కోహ్లీ మాములుగానే రికార్డుల రారాజు. అలాంటి కోహ్లీ ఇప్పుడు సరికొత్త రికార్డును తన పేరున నమోదు చేసుకున్నాడు. ఈ ఘనత కోహ్లీ ఒకే ఒక్కడిది. ఇంతకీ ఈ రికార్డ్ ఏంటంటే.. కివీస్‌తో ఆడిన మ్యాచ్ కోహ్లీకి 300వ వన్డే. అంతేకాదు తన 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 300 వన్డేలు, 100కు పైగా టెస్టులు, 100కు పైగా టీ20లు ఆడాడు. ఈ ఫీట్ సాధించిన వన్ అండ్ ఓన్లీ ప్లేయర్ విరాట్ కోహ్లీ మాత్రమే. విరాట్ ఇప్పటి వరకు 123 టెస్టులు.. 125 టీ20లు ఆడాడు.
ప్రపంచంలో 300 వన్డేలు ఆడిన 18వ ఆటగాడిగా.. భారత్ తరపున 7వ ప్లేయర్‌గా నిలిచాడు విరాట్. 2011లో టీమిండియా రెగ్యులర్ ప్లేయర్‌గా ఎంట్రీ ఇచ్చాడు కోహ్లీ. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పటి నుంచి విరాట్ నామ శకం మొదలైందనే చెప్పాలి. 2018లోనే సచిన్ పేరు మీదున్న వన్డేల్లో అత్యంత వేగంగా 10 వేల పరుగులు చేసిన రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. అంతేకాదు రీసెంట్‌గా అత్యంత వేగంగా 14 వేల పరుగుల రికార్డును కూడా చెరిపేశాడు. వన్డేల్లో విరాట్ సెంచరీలు 51, హాఫ్ సెంచరీలు 73.
అయితే అత్యధికంగా వన్డే మ్యాచ్‌లు ఆడిన రికార్డు మాత్రం ఇప్పటికీ సచిన్‌దే. ఈ క్రికెట్ గాడ్ ఇప్పటి వరకు 463 వన్డేలు ఆడాడు. ఈ రికార్డుకు బ్రేక్ చేసే అవకాశం ఏ ప్లేయర్‌కు లేదనే చెప్పాలి.