ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా మహాద్భుతంగా సాగుతోంది. రోజుకు కనీసం కోటి మంది పుణ్యస్నానాలు చేస్తున్నారు. తొమ్మిది రోజులుగా సాగుతున్న కుంభమేళాలో ఇప్పటి వరకూ 9 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించారు. మేళాకు రోజురోజుకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని యోగీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏర్పాట్లను సమీక్షిస్తోంది. ఈనేపధ్యంలోనే బుధవారం హై లెవెల్ మీటింగ్ జరుగుతోంది. ఈనెల 29న మరో పవిత్రమైన రోజు అయిన మౌని అమావాస్య కావడంతో ఆరోజు రద్దీ రెట్టింపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే ఇప్పటినుంచే పరిస్థితిని అంచనా వేస్తున్నారు.
కుంభమేళాకు విఐపీలు,సెలబ్రిటీలు
విఐపీలు, సెలబ్రిటీలు కూడా ఈ అపూర్వ ఘట్టంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇన్ ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య, రాజ్యసభ ఎంపీ సుధా మూర్తి ప్రయాగ రాజ్ కు విచ్చేసి పవిత్ర స్నానం ఆచరించారు. తాను మూడు రోజులు ఉపవాసం ఉన్నట్లు మూడు రోజులూ పవిత్ర స్నానాలు ఆచరించి పితృ దేవతలకు తర్పణాలు వదులుతానని తెలిపారు. తన తాతగారు, అమ్మమ్మ, తండ్రి వైపు తాతగార్ల పేరన ఈ పవిత్ర క్రతువు నిర్వహించాల్సి ఉందని ఆమె అన్నారు. యోగీ ఆదిత్యనాథ్ ఏర్పాట్లు అత్యద్భుతంగా చేశారని మెచ్చుకున్నారు. ఇక నటుడు అనుపమ్ ఖేర్ కూడా కుంభమేళాకు విచ్చేసి పవిత్ర స్నానం చేశారు. ఘాట్లలో ఏర్పాట్లు, సురక్షిత వాతా వరణం ఉందని ఇందుకు సీఎం యోగీని ప్రశంసించాలనీ అన్నారు.
గౌతం అదానీ రాక
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ కుంభమేళా సందర్శించారు. పవిత్ర స్నానం చేసి పెద్దలకు పితృతర్పణాలు అర్పించారు. అనంతరం తమ సంస్థ ఇస్కాన్ సంస్థతో కలసి భక్తులకు, యాత్రీకులకు అందిస్తున్న మహాప్రసాదం తయారీ లో పాల్గొన్నారు. వాటిని భక్తులకు పంపిణీ కూడా చేశారు. సెక్టర్ 18లోని ప్రసాదాల తయారీ యూనిట్ కు వచ్చినప్పుడు వీరికి సిబ్బంది నుంచి ఘన స్వాగతం లభించింది.
యూపీగవర్నర్ ఆనందీబెన్ పటేల్ కూడా కుంభమేళా సందర్శించనున్నారు. కోట్లాది మంది విచ్చేస్తున్న నేపధ్యంలో పరిసరాల పరిశుభ్రత, సురక్షిత మంచి నీరు, నాణ్యమైన భోజనం అందరికీ అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, నిరంతరం శ్రమిస్తున్నాయి. వచ్చేనెల 26 వరకూ కొనసాగే ఈ మహా కుంభమేళాలొ కనీసం 40 కోట్ల మంది తరలి వస్తారని అంచనా వేస్తున్నారు.