26.7 C
Hyderabad
Thursday, September 17, 2026

Live Video

spot_img

ఢిల్లీకి విజయశాంతి, జగ్గారెడ్డి

తెలంగాణ పొలిటికల్‌ సీన్‌లోకి విజయశాంతి మరోసారి ఎంట్రీ ఇచ్చారు. అయితే, ఆమె హస్తిన మీదుగా హైదరాబాద్‌కు ఎంటర్‌ అయ్యేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఆల్‌రెడీ ఢిల్లీ చేరుకొని కాంగ్రెస్‌ అధిష్టానం ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు.. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా హస్తినకు పయనమయ్యారు. అయితే, తాను ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నానన్నది తెలియ జేసేందుకు జగ్గారెడ్డి మీడియాకు ఓ ప్రకటన రిలీజ్‌ చేశారు.

త్యాగాలు వివరించేందుకు… :

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల హీట్‌ నెలకొంది. వారం రోజుల క్రితమే ఒక గ్రాడ్యుయేట్‌, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ఇప్పుడు ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లకు త్వరలోనే పోలింగ్‌ జరగనుంది. ఈ క్రమంలోనే విజయశాంతి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చారు. తాను గతంలో చేసిన త్యాగాలను పరిగణనలోకి తీసుకొని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని విజయశాంతి నేరుగా అధిష్టానం దగ్గరికే పయనమయ్యారు. తనకు అధిష్టానమే న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేయడంతో, కాంగ్రెస్ పార్టీలో ఈ అంశంపై తీవ్రంగా చర్చ జరుగుతోంది.

విజయశాంతి ప్రస్థానం :

సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి.. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. తల్లి తెలంగాణ పార్టీ పేరుతో ఏకంగా పార్టీనే స్థాపించి తెలంగాణ వాదం వినిపించారు. ఆ తర్వాత కొన్నాళ్లకే భారతీయ జనతాపార్టీలో చేరారు. కొంత కాలం తర్వాత అప్పటి టీఆర్‌ఎస్‌ పార్టీలో విజయశాంతి చేరారు. అప్పటి పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. ఎన్నికల ప్రచారంలోనూ స్టార్‌ క్యాంపెయినర్‌గా ఆ పార్టీ నుంచి పోటీసిన అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు.

రేవంత్‌ సర్కారుకు సపోర్ట్ :

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సరికొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుండి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో విజయశాంతి గతంలో తాను ఏర్పాటుచేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్స్ హ్యాండిల్‌పై పోస్ట్ చేసి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి సపోర్ట్ చేశారు. అలాగే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులకు సంబంధించి వివాదం నెలకొన్న సమయంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సపోర్ట్‌గా విజయశాంతి మాట్లాడారు. తెలంగాణకు కనీసం నాలుగు అవార్డులైనా ఇచ్చి ఉండాల్సిందని విజయశాంతి అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీ ఖాయమేనా?

ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ ఐదు స్థానాలకు ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. వీటిలో బీఆర్‌ఎస్‌కు ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కే అవకాశం ఉండగా.. కాంగ్రెస్‌ పార్టీకి నాలుగు ఎమ్మెల్సీ పోస్టులు ఖాయంగా వస్తాయి. ఈ సమయంలోనే విజయశాంతి వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. నేరుగా ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతోనే మంతనాలు జరుపుతున్నారు. హస్తినలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు విజయశాంతి. ఎమ్మెల్యే కోటాలో ఒక ఎమ్మెల్సీ సీటు తనకు కేటాయించాలని ఢిల్లీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. పార్టీ కోసం తాను చేసిన త్యాగాలను గుర్తు చేసి తనకు అవకాశం కల్పించాలని కోరారు.

అయితే, అధిష్టానం నుంచి పూర్తిస్థాయిలో భరోసా దొరకలేదని తెలుస్తోంది. మరోవైపు.. హైదరాబాద్‌ క్యాంప్‌లో ఉన్న ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్ మాత్రం కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని భరోసా ఇస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి సుస్థిర స్థానం ఉంటుందని హామీ ఇస్తున్నారు. మొత్తం మీద విజయశాంతి ఎమ్మెల్సీ పదవి కోసం ఏకంగా ఢిల్లీ పెద్దలను కలవడం కాంగ్రెస్‌లో మెయిన్‌ టాపిక్‌ అయ్యింది. మరి రాములమ్మ కోరిక నెరవేరుతుందా? లేదా అన్నది మున్ముందు తెలియాల్సి ఉంది.

జగ్గారెడ్డి హస్తిన బాట :

ఇక, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. నేరుగా రాహుల్‌ గాంధీని కలిసేందుకే ఆయన ఢిల్లీ వెళ్లారు. అయితే, ఆయన కూడా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటు కోసమే రైలులో ఢిల్లీ వెళ్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, తాను ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నానో వివరిస్తూ మీడియాకు ఓ ప్రకటన రిలీజ్‌ చేశారు. 2017లో సంగారెడ్డిలో భారీ ఎత్తున రాహుల్‌గాంధీ బహిరంగ సభను నిర్వహించానని, ఆ సభ ఏర్పాట్ల కోసం తాను ఎంత కష్టపడిందీ రాహుల్‌ గాంధీకి వివరించేందుకే ఢిల్లీకి వెళ్తున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటు కోసం జగ్గారెడ్డి ఢిల్లీ వెళుతున్నారంటూ మీడియాలో వార్తలు రావడంతోనే తాను ప్రకటన రిలీజ్‌ చేయాల్సి వస్తోందన్నారు. తాను ఎమ్మెల్సీ సీటు అడగడం లేదని, అడగబోనని కూడా స్పష్టంచేశారు. మూడు సార్లు సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని, ఎమ్మెల్సీ కావాలంటూ పడి పడి అడిగే గుణం తనది కాదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీకి వెళ్లాక రాహుల్‌ గాంధీ అపాయింట్‌ మెంట్‌ కోరతానని, దొరికితే ఆయనతో మాట్లాడతానని జగ్గారెడ్డి వివరించారు.

ఎమ్మెల్సీ అడుగుతోన్న రేఖా నాయక్‌ :

ఇక, మరోవైపు.. ఖానాపూర్‌ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ కూడా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈమేరకు టీపీసీసీ పరిశీలకులకు నేరుగా తన మనసులో మాట చెప్పేశారు రేఖా నాయక్‌. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న సీనియర్లకు, మొదటినుంచీ పార్టీలో ఉన్నవాళ్లకు న్యాయం చేస్తామని, వాళ్ల అభిమతం మేరకు టీపీసీసీ నుంచి పదవులు అప్పగించే ఏర్పాట్లు చేస్తామని కొత్తగా ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన మీనాక్షి నటరాజన్‌ ప్రకటించారు. ఈమేరకు సీనియర్ల జాబితాను రూపొందించి గాంధీ భవన్‌కు పిలిపించారు. వాళ్ల మనసు లోని మాటలు, వాళ్లు కోరుకుంటున్న పదవుల గురించి అడిగి మరీ నమోదు చేయించారు. ఈ క్రమంలోనే ఖానాపూర్‌ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ను కూడా పిలిపించిన టీపీసీసీ ఆమె మనసులో ఏముందో కనుక్కుంది. ఈ నెలలో ఎంపిక చేసే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లలో తనకు అవకాశం కల్పించాలని రేఖా నాయక్‌ కోరారు.

వీళ్లే కాదు.. ఇంకా చాలా మంది కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్సీ పదవుల కోసం తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. కొందరు బహిరంగ ప్రయత్నాలు చేస్తుండగా… మరికొందరు రహస్యంగా ఎవరికి వారు ఎమ్మెల్సీ సీటు కోసం పోటా పోటీగా ట్రై చేస్తున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com