- కేజ్రీవాల్ కు ఈసీ నోటీసులు
- రేపు ఉదయం 11 గంటలకు ఆధారాలతో రావాలని పిలుపు
- 14 పేజీల డాక్యుమెంట్లను విడుదల చేసిన కేజ్రీవాల్
- సైనీ నీటిని తాగలేదు ..ఉమ్మేశారన్న కేజ్రీ
- అది ఎడిటెడ్ వీడియో… అంటూ బీజేపి ధ్వజం
- ఆప్, బీజేపి యుద్ధంలో వేలు పెట్టిన కాంగ్రెస్
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో తాగునీటి యుద్ధం చిత్రవిచిత్రమైన మలుపులు తిరుగుతోంది. దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు నోటీసులు ఇచ్చింది. యమునా నీటిలో విషం కలిపారనే ఆరోపణలకు రేపు ఉదయం 11 గంటల్లోగా ఆధారాలతో సహా తమ ముందుంచాలని ఆదేశించింది.
యమున నీరు విషంగా మారిపోయిందని అందుకు హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపియే కారణమని కేజ్రీవాల్ ఆరోపిస్తే. అదే నీటిని ఢిల్లీ శివార్లలోని పల్లా గ్రామంలో తాగి చూపించారు హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ. అయితే సైనీ చర్యలను మళ్లి తిప్పి కొట్టారు కేజ్రీవాల్. నయాబ్ సింగ్ సైనీ యమునా నీటిని తాగలేదు. తాగినట్లు నటించి మళ్లీ అందులోనే ఉమ్మేశారు అంటూ ఆరోపించారు. తన ఎక్స్ ఖాతాలో వీడియోతో సహా పోస్ట్ చేశారు. ఢిల్లీకి సరఫరా అవుతున్న యమునానది నీటిలో అమ్మోనియా లెవెల్ ప్రమాదకర స్థాయిలో ఉందని అది విషంతో సమానమని కేజ్రీవాల్ అన్నారు. యమునానది నీరు కలుషితం కావడానికి బీజేపియే కారణమని, ఢిల్లీ ప్రజల తాగు నీటిలో కాలుష్యం లేకుండా చూడటం కోసం తాను ఎంతకైనా పోరాడతానని ప్రకటించారు.
అది ఎడిటెడ్ వీడియో..
అయితే కేజ్రీవాల్ ఆరోపణలపై బీజేపి హర్యానా యూనిట్ స్పందించింది. అది ఎడిటెడ్ వీడియో అని కావాలనే అలా చేసి పోస్ట్ చేశారని ఆరోపించింది.కేజ్రీవాల్ నిజాయితీ పరుడైతే అబద్ధపు కళ్లద్దాల్లోంచి చూడొద్దని, దమ్ము, ధైర్యం ఉంటే యమునా నదినీటిని ఢిల్లీ దగ్గర తాగాలని సవాల్ విసిరింది.దాంతో పాటు ఇది ఒరిజినల్ వీడియో అంటూ మరో వీడియోను ట్యాగ్ చేసింది.అందులో సైనీ యమునా నది నీటిని చేతుల్లోకి తీసుకుని ఆచమనం చేసి తాగారని కామంట్ చేసింది.
ఈసీ జోక్యం చేసుకోవాలిః కేజ్రీవాల్..
యమునా నది కాలుష్యంపై కేజ్రీవాల్ ఆరోపణలను ఆధారాలతో సహా ప్రూవ్ చేయాలంటూ ఎన్నికల కమిషన్ ఆయనకు నోటీసులిచ్చింది. దానిపై రేపు ఉదయం 11 గంటల్లోగా స్పందించాలని ఆదేశించింది. దానిపై కేజ్రీవాల్ స్పందిస్తూ 14 పేజీల డాక్యుమెంట్లను సబ్మిట్ చేశారు. నది జన్మస్థలమైన పానిపట్ హర్యానాలో ఉందని అక్కడ నీటిని కలుషితం చేసి వదులుతున్నారని, నదిపరీవాహక ప్రాంతంలో ఉన్న ఢిల్లీ ప్రజలకు అదే తాగునీరని, కాబట్టి కాలుష్యాన్ని అరికట్టేలా హర్యానా ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాలని కేజ్రీవాల్ తన విన్నపంలో ఈసీని కోరారు. యమునానది నీరే ఢిల్లీ ప్రజలకు తాగునీరు. రక్షిత తాగునీటి హక్కును కాపాడండి అంటూ కేజ్రీవాల్ కోరారు. ఇందులో తానెక్కడా వాస్తవాలు వక్రీకరించలేదని ఆధారాలతో సహా మీ ముందుంచానని న్యాయం చేయాలని కోరారు.
ఢిల్లీ ఎన్నికల నినాదంగా మారిపోయిన రక్షిత మంచి నీటిపై పార్టీలు మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. బీజేపి, ఆప్ మధ్య నడుస్తున్న ఈ సంవాదంలో కాంగ్రస్ కూడా వేలుపెట్టింది. అప్పుడెప్పుడో అయిదేళ్ల క్రితం తాను యమునలో మునుగుతానని, స్నానం చేసి ఆనీటిని తాగుతానని కేజ్రీవాల్ అన్నట్లు గుర్తు. ఇప్పటి దాకా ఆ ప్రయత్నమే లేదని రాహుల్ చురకలేశారు.