గతంలో వాళ్ళిద్దరూ ఒకే పార్టీలో ఒకరు ఎమ్మెల్యే మరొకరు ఎంపీగా ఉన్నారు. కానీ నేడు ఎంపీ వేరే పార్టీలో చేరిపోయి మళ్ళీ రెండో సారి లోక్ సభకు ఎన్నికైపోయారు. కానీ ఎమ్మెల్యే అదే పార్టీలో ఉండి ఓడిపోయి మాజీగా మిగిలిపోయారు. ఇప్పుడు వాళ్లిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటోంది. ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ హాట్ టాపిక్ గా మారారు. ఇంతకీ వీరిద్దరు ఎవరు అనుకుంటున్నారా…? మాజీ మంత్రి, చిలకలూరిపేట మాజీ శాసనసభ్యురాలు విడదల రజిని ఒకరు కాగా నరసరావుపేట పార్లెమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయులు మరొకరు. గతంలో వీరిద్దరూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వారు. అయితే 2024 ఎన్నికల మందు కృష్ణదేవరాయులు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయి మళ్ళీ ఏంపీగా గెలుపొందగా విడుదల రజని వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా వీరిద్దరు గతాన్ని తవ్వుకుని వర్తమానంలో ఒకరిపై ఒకరు తీవ్ర స్ధాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.
వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న విడదల రజిని తన నియోజకవర్గంలో స్టోన్ క్రషర్స్ యజమానుల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తూ కూటమి ప్రభుత్వం ఏసీబీ కేసులు కూడా నమోదు చేసింది.. దీనిపై భగ్గుమన్న రజని టిడిపి నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుత నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు తనపై కక్ష కట్టారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ మంత్రి విడదల రజని చేసిన ప్రధాన ఆరోపణ తన కుటుంబాన్ని ప్రస్తుత ఎంపీ లావు కృష్ణదేవరాయులు టార్గెట్ చేశారని తన ఫోన్ కాల్ డేటాను సేకరించే ప్రయత్నం గతంలోనే చేశారని, జర్మనీలో ఉంటున్న తన మరిది ని కూడా కేసుల్లో ఇరికించే కుట్ర జరుగుతుందని కృష్ణదేవారాయలు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణదేవరాయలు ప్రోద్బలంతోనే తనను కేసుల్లో ఇరికించే కుట్రలు ఎక్కువ అవుతున్నాయని విడదల రజని ఆరోపిస్తున్నారు.
తనపై విడదల రజని చేసిన ఆరోపణలకు ఢిల్లీలో ఎంపీ లావు కృష్ణ దేవరాయలు కౌంటర్ ఇచ్చారు. తనకు బూతులు రావని, మాజీ మంత్రి రజినీలా అబద్దాలు ఆడడం రాదని ఆయన అన్నారు. రజిని కాల్ డేటా సేకరించే ప్రయత్నం తాను చేయలేదని తన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారని వాళ్ళకో న్యాయం రజనీ కో న్యాయం అంటూ ఉండదని చెప్పుకొచ్చారు. రజినీ మాటలు వెనక ఎవరున్నారో తనకు తెలుసని చెప్పిన కృష్ణదేవరాయలు ఎవరో స్టోన్ క్రషర్ యజమాని ఇచ్చిన కంప్లైంట్ కు తనకు సంబంధం ఏంటని కృష్ణదేవరాయులు నిలదీశారు. పది రోజుల క్రితం విడదల రజని ఒక మధ్యవర్తి ద్వారా కేసులు నుంచి తనని తప్పించమని రాయబారం నడిపిన మాట వాస్తవమా కాదా అని ఆయన ప్రశ్నించారు. స్టోన్ క్రషర్ యజమాని నుండి తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పిన మాట నిజమో కాదో రజిని చెప్పాలని ఆయన అడిగారు. చేసిందంతా చేసి ఇప్పుడు ఇలా తనపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదని చట్టం తన పని తాను చేసుకు పోతుందని కృష్ణదేవరాయలు మాజీ మంత్రికి కౌంటర్ ఇచ్చారు. మొత్తం మీద వీరిద్దరి మధ్య జరుగుతున్న పరస్పర ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచుతున్నాయి.