ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. తాను రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అవుతానని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దానికి అనుగుణంగా చర్యలు మొదలుపెట్టారు. రష్యా కూడా ఈ చర్చల్లో పాల్గొనేందుకు చాలా ఆసక్తి చూపిస్తోంది. దీనికి సంబంధించిన ముందస్తు చర్యలు ఇప్పటికే మొదలయ్యాయి. సౌదీలో నేడు అమెరికా, రష్యా అధికారులు సమావేశం కానున్నారు. అమెరికా తరఫున విదేశాంగమంత్రి మార్కో రుబియో, ట్రంప్ రాయబారి స్టీవ్ విట్కాఫ్ భేటీ అయ్యి చర్చలు జరపుతారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుతో పాటు.. అమెరికా-రష్యా మధ్య సంబంధాల పునరుద్దురణపై కూడా కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ చర్చల ఆధారంగానే ఇరు దేశాధినేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ చర్చలు సజావుగా సాగితే అతి త్వరలోనే ఇరు దేశాధినేతలు భేటీ కావడం పక్కా.
జెలెన్‌స్కీ పరిస్థితేంటి?
నిజానికి జెలెన్‌స్కీ ప్రస్తుతం సౌదీ అరేబియాలోనే ఉన్నారు. కానీ ఈ భేటీకి ఆయనకు ఆహ్వానం అందలేదు. కానీ అమెరికా-రష్యా ప్రతినిధుల సమావేశంలో ఉక్రెయిన్ కూడా భాగమవుతుందని ట్రంప్ ప్రకటించారు. కానీ అలా జరగలేదు. అయితే జెలెన్ స్కీ మాత్రం ట్రంప్, పుతిన్ భేటీలో భాగమవుతారని సమాచారం. అయితే తమ ఇన్‌వాల్వ్‌మెంట్ లేకుండా జరిగే ఏ చర్చని, ఒప్పందాన్ని మేం అంగీకరించమని ఉక్రెయిన్ ఇప్పటికే తేల్చి చెప్పింది.
ఇప్పటికే జెలెన్ స్కీ యూరప్ దేశాలను ఏకం చేసే పనిలో ఉన్నారు. అమెరికా ఆయుధ సాయం ఆపేస్తే ఏం చేయాలన్న దానిపై ఇప్పటికే బ్యాకప్ ప్లాన్ రెడీ చేస్తున్నట్టు కనిపిస్తోంది. మరి ఇవి ఎంత వరకు సఫలమవుతాయో చూడాలి.