తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలికసదుపాయాల సంస్థ ద్వారా చేపట్టబోతున్న ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను నిలిపివేయాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి గ్రామంలోని సర్వే నంబర్ 2(పి)లో ఉన్న 400 ఎకరాల ప్రభుత్వ భూమి వేలంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఆర్థిక వనరుల సమీకరణ పేరిట ఈ భూములను వేలం వేయాలనే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను కిషన్ రెడ్డి తన లేఖలో ప్రస్తావించారు. ముఖ్యమంత్రి పీఠం చేపట్టక ముందు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భవిష్యత్తు తరాల కోసం ప్రభుత్వ భూముల అమ్మకాన్ని వ్యతిరేకించారంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఈ వేలం ప్రక్రియను ఆపాలని కోరారు. ప్రభుత్వ భూములు అమ్మితే భవిష్యత్తులో ప్రజా అవసరాల కోసం భూమి దొరకదని రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో చేసిన ప్రకటనను కిషన్ రెడ్డి నొక్కి చెప్పారు.
ఈ 400 ఎకరాల భూమి పచ్చని చెట్లతో, జీవ వైవిధ్యంతో సమృద్ధిగా ఉండి నగరానికి ఆక్సిజన్ వనరుగా ఉందన్నారు కిషన్ రెడ్డి. ఈ భూమిలో నెమళ్లు, జింకలు, వలస పక్షులు, భారతీయ నక్షత్ర తాబేళ్లు వంటి అనేక అరుదైన జాతులు నివసిస్తున్నాయని, భూమిని కాంక్రీట్ నిర్మాణాలతో నింపడం వల్ల పర్యావరణానికి నష్టం చేకూరుతుందని తన లేఖలో కిషన్ రెడ్డి హితవు పలికారు.
భారతీయ నక్షత్ర తాబేళ్ళు 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద షెడ్యూల్ IVలో రక్షిత జీవజాతిగా చేర్చబడ్డాయని ప్రస్తావించిన కిషన్ రెడ్డి.. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం 2016 నుంచి అంతరించి పోతున్న జీవుల జాబితాలో ఉన్నాయన్నారు. 2019 నుంచి అంతరించిపోతున్న జంతుజాతుల వాణిజ్య చట్టం అపెండిక్స్ లో చోటు దక్కించుకున్నాయని గుర్తు చేశారు. కాబట్టి ఈ ప్రాంతాన్ని జాతీయ ఉద్యానవనంగా మార్చి జీవ వైవిధ్యాన్ని రక్షించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.
ఇటు.. హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాలు పట్టణీకరణతో సహజ స్వరూపాన్ని కోల్పోయాయన్నారు కిషన్‌రెడ్డి. పచ్చదనం తగ్గిపోగా, ఖాళీ స్థలాలు కనుమరుగవుతున్నాయని, భవిష్యత్తు తరాల కోసం కొద్దిగా అయినా పచ్చదనాన్ని రక్షించవలసిన అవసరం ఉందని తన లేఖలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, 400 ఎకరాల భూముల వేలం ప్రక్రియను తక్షణం నిలిపివేయాలని, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి సహజసిద్ధంగా ఏర్పడిన కొండలు, చెట్లు, జీవ వైవిధ్యాన్ని రక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.