- దశాబ్దాలుగా అదే తీరు..
- రాష్ట్రాలకు రాష్ట్రాలే చేజారినా అదే దుస్థితి
- అన్నింటిలోనూ అధిష్టానమే ఫైనల్
- కీలక నిర్ణయాలపై ఎడ తెగని తాత్సారం
- అసమ్మతులను పెంచి పోషించే ధోరణి
- పార్టీ చేజార్చుకున్న నేతలెందరో..
- తెలంగాణలోనూ అంతే..
కాంగ్రెస్ పార్టీ తీరే అంత.. తాను ఎదగదు.. ఎదిగే నేతలకు స్వేచ్ఛ ఇచ్చి పార్టీ బలోపేతానికి దోహదపడదు. 125 ఏళ్ల నుంచి నేటి వరకూ రొటీన్ పాలిటిక్స్ నడపడమే. గ్రూపు తగాదాలను ప్రోత్సహించడం, కుమ్ములాటలను ఎంకరేజ్ చేయడమే. ఎక్కడైనా పార్టీ చాలా కాలం తర్వాత అధికారం దక్కించుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని పదిలం చేసుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఆ ఫ్లెక్సిబిలిటీయే కనిపించదు. అందుకే అనేక రాష్ట్రాల్లో ఇప్పటికీ పార్టీకి బలమైన బేస్ లేదు. కాంగ్రెస్ పార్టీని ఆరాధించే సంప్రదాయ ఓటు బ్యాంకు అయిన సామాన్య ప్రజలు, కార్యకర్తలు ఆ పార్టీ బలపడాలని అధికారంలోకి రావాలని కలలు కంటుంటారు. కానీ అధిష్టానం మాత్రం అందుకు భిన్నమైన రాజకీయాలు ప్రోత్సహిస్తూ వస్తుంది. అలా భిన్నమైన నిర్ణయాలు తీసుకున్నప్రతీసారి పార్టీకి తీవ్రమైన నష్టం జరిగినా అదే ధోరణి. ఎందుకిలా అనాల్సి వస్తోందంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి చేజారిపోయిన సమర్ధవంతమైన నేతల చిట్టా పరిశీలిస్తే అదే తేలుతుంది. సాధారణంగా కాస్త చరిష్మా కలిగిన నేతలకు పార్టీని బలోపేతం చేసి ముందుకు నడిపించే సమర్ధతలుంటాయి. అదేటైమ్ లో అసమ్మతి గళాలూ తక్కువేం కాదు. ఆ నాయకుడితో పడని వారు ఢిల్లీ వెళ్లి చేసే ఫిర్యాదులనూ సరి సమానంగా పోత్సహిస్తుంటుంది అధిష్టానం. అధిష్టానం పరిశీలకులను పంపడం సమస్యను సర్దుబాటు చేయాలని చూడటమే తప్ప పార్టీకి సమస్యాత్మకంగా మారిన వారిపై కఠిన చర్యలు ఉండవు. అలాగని స్వతంత్ర్యంగా బలమైన నేతగా ఎదిగిన వారికి నాయకత్వ బాధ్యతలు స్వేచ్ఛను కట్టబెట్టి పార్టీకి విశ్వాస పాత్రులుగా ఉంచుకునే ఓపిక, నేర్పు కూడా లేవు. కలేజా ఉన్న నేతలు ఎదిగితే పార్టీది ఆత్మరక్షణ విధానమే..
యువనేతలను చేజార్చుకున్న కాంగ్రెస్
ఇందుకు నిదర్శనం.. మన తెలుగు రాష్ట్రాలే.. ఏపీ మాజీ సీఎం వైఎస్.జగన్.. వైఎస్ హయాంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అక్కడ బలపడేందుకు ప్రయత్నించే పనులు చేయలేదు. వైఎస్ ఎదుర్కొన్న నిత్య అసమ్మతే అందుకు ఉదాహరణ. వైఎస్ అనంతరం చరిష్మా కలిగిన యువనేత జగన్ మోహన్ రెడ్డి విషయంలోనూ అంతే. ఓదార్పు యాత్రకు అనుమతులివ్వకుండా ఆయన్ను కట్టడి చేసే ప్రయత్నం చేసి ఆపై ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు మోపి ఆయనపై కక్ష తీర్చుకున్నాననుకుంది. కానీ జనంలోకి వచ్చి కేసులపై ఒంటరి పోరాటం చేస్తూ వేరే పార్టీ పెట్టి ఏపీ కి సీఎం కాగలిగారు జగన్. అస్సోంలో హేమంత్ బిశ్వ శర్మ కూడా అంతే..ఓ వైపు పార్టీ ధోరణులు నచ్చక, ఇండైరెక్టుగా రాహుల్ పొమ్మని చెప్పేయడంతో ఆయన బీజేపి పంచన చేరాల్సి వచ్చింది.
ఇక మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో కూడా అంతే. ప్రముఖ కాంగ్రెస్ నేత మాధవరావు సింధియా రాజీవ్ గాంధీకి సన్నిహితుడు. ఆయన కుమారుడు జ్యోతిరాదిత్య సింధియా.. కాంగ్రెస్ లో కాస్త అగ్రెసివ్ గా అడుగులేస్తూ పుష్కలమైన నాయకత్వ సమర్ధతలున్న నేత.. ఆయన ఎదుగుదలను ప్రోత్సహించకుండా ఆయనకి ప్రత్యామ్నాయంగా కమల్‌నాథ్ ను కాంగ్రెస్ ప్రోత్సహించడం, సింధియా స్పీడుకు బ్రేకులు వేయడంతో ఆయన బీజేపిలో చేరి ఏకంగా కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఉత్తర ప్రదేశ్‌లో బ్రాహ్మణ వర్గానికి చెందిన బలమైన నాయకుడు జితేంద్రప్రసాద్. రాజీవ్‌గాంధీ, పీవీ.నరసింహారావులు ప్రధానులుగా ఉన్నప్పుడు వారికి సలహాదారుగా చెయ్యడమే కాకుండా మంత్రివర్గంలో కూడా పనిచేశారు. ఆయన కుమారుడు జితిన్ ప్రసాద్ కు కాంగ్రెస్ అధిష్టానం నుంచి అనుకున్న స్ధాయిలో మదద్దతు దొరకకపోవడంతో ఆయన కూడా బీజేపీలో చేరిపోయారు. ఇక రాజస్థాన్ లోనూ అంతే.. సీనియర్ నేత రాజేష్ పైలట్ రాజీవ్ గాంధీకి సన్నిహితుడు. ఆయన కుమారుడు సచిన్ పైలట్ కాంగ్రెస్ లో రాజకీయం నేర్చుకున్నవాడే.. రాష్ట్ర సీఎంగా పగ్గాలు చేపట్టాలని ఆశించిన వ్యక్తి.. కష్టపడి పార్టీని గెలిపిస్తే యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వకుండా వృద్ధుడైన అశోక్ గెహ్లాట్ కు బాధ్యతలు కట్టబెట్టడం తనను ప్రోత్సహించకపోవడంతో ఆయన ఢీలా పడే పరిస్ధితి వచ్చింది. ఇలా యువ నేతలందరినీ పొమ్మనకుండానే పొగ పెట్టి చేజార్చుకుంది కాంగ్రెస్. నిజానికి వారికి నాయకత్వ పగ్గాలు అప్పగించి ఉంటే పార్టీ పరిస్థితి మరోలా ఉండేది.
తెలంగాణలోనూ అదే తంతు…
తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి.. దశాబ్దం తర్వాత పార్టీని అధికారంలోకి తేవడానికి రేవంత్ కష్టపడిన మాట వాస్తవం. గెలిచాక రేవంత్ కు సమస్త బాధ్యతలూ అప్పగించినట్లు పైకి చెబుతూనే వెనక నుంచి ఆయనను స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వీలులేకుండా బ్రేకులేస్తోంది అధిష్టానం. పార్టీ అధికారం చేపట్టి ఏడాది దాటిపోయినా.. ఇచ్చిన వాగ్దానాలేవీ అమలు జరపడానకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా నాన్పుడు ధోరణే అవలంబిస్తోంది అధిష్టానం. అటు పీసీసీ విస్తరణకు కమిటీ వేయడం లేదు. అలాగే మంత్రివర్గ విస్తరణకు ఆమోదం తెలపడం లేదు. పార్టీని, కేబినెట్ ను విస్తరించి పదవులు ఇవ్వడం అసమ్మతి స్వరాల కట్టడికి ఒక మార్గం. కాగా అధిష్టానం మాత్రం ఈ రెండూ తాను చేయదు, చేయనివ్వదు. సీఎం గా అనేక డిమాండ్లకు, ప్రకటించిన హామీలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి రేవంత్ ది. చివరకు అధిష్టానం ఆమోదించిన హామీల అమలుకూ పెద్దల పర్మిషన్ తప్పని పరిస్థితి. ఈ తాత్సారం వల్ల పార్టీలో అసమ్మతి స్వరాలు బలపడే అవకాశం ఉంది. పదేపదే అవే తప్పులు చేస్తూ రాష్ట్రాలకు రాష్ట్రాలనే చే జార్చుకుంటున్న కాంగ్రెస్ అధిష్టానం తీరు మారెదెప్పుడు?