తిరుమల గిరులపై కర్ణాటక బాగల్కోట్కు చెందిన బసవేశ్వర వీరశైవ విద్యావార్ధక సంఘ్ వారు నిర్మిస్తున్న మఠ భవనం నిబంధనలకు విరుద్దంగా ఉందన్న ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ప్రజా సంబంధాల అధికారి శుక్రవారం ఓ ప్రకటన ద్వారా వివరణ విడుదల చేశారు. బీవీవీ సంఘ నిబంధనలకు విరుద్దంగా తిరుమలలో ఐదంస్తుల భవనం నిర్మిస్తోందని ఒక భక్తుడు టీటీడీకి ఫిర్యాదు చెయ్యడం జరిగింది. టీటీడీ 11.50 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి అనుమతి ఇస్తే బసవేశ్వర వీరశైవ విద్య వార్ధక సంఘ్ మఠం వారు షుమారు 18 మీటర్లు ఎత్తులో నిర్మాణాలు చేస్తున్నారని ఆ భక్తుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన టీటీడీ వర్గాలు పంచాయితీ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన అసిస్టెంట్ ఇంజనీర్, సర్వేయర్ల కలసి మఠం నిర్మాణాలను పరిశీలించారు. వాస్తవానికి బీవీవీ సంఘ్ మఠానికి స్టీల్ట్ ప్లస్ నాలుగు అంతస్తులకు మాత్రమే టీటీడీ అనుమతి ఇచ్చింది. అయితే మరో అంతస్తు అదనంగా నిర్మించే ప్రయత్నం చేస్తున్న కార్మికులను టీటీడీ సిబ్బంది అడ్డుకున్నట్లు పీఆర్ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే నిబంధనలకు విరుద్దంగా అదనపు ఫ్లోర్ నిర్మిస్తున్న బాగల్కోట్ బసవేశ్వర వీరశైవ విద్య వార్ధక సంఘ్ మఠానికి వివరణ ఇవ్వమని నోటీసులు జారీ చేసినట్లు ఆ ప్రకటనలో తెలిపారు.
- Advertisement with us -