26.7 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

గ్రేటర్ హైదరాబాదులో డివిజన్ల పెంపు…!

తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధి పెంచబోతుందా ?

హైదరాబాద్‌ లో 200 డివిజన్లు లేదంటే కొత్తగా మూడు కార్పొరేషన్లు

గ్రేటర్ చుట్టూ ఉన్న మున్సిపాల్టీల  పరిస్థితి ఏంటీ ? గ్రేటర్ లో విలీనంలో చేస్తారా ? ప్రత్యేకంగా మున్సిపల్ కార్పోరేషన్లుగా డెవలప్ చేస్తారా  ?

మహేశ్వరాన్ని మహానగరంగా తీర్చిదిద్దుతానన్న సీఎం రేవంత్ మాటల వెనక మర్మమేంటీ ?

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంపై ప్రత్యేక దృష్టి పెట్టింది.  GHMC పరిధిలో పనిచేస్తున్న విపత్తుల నిర్వాహణ విభాగాన్ని మరింత విస్తరించాలనే ఆలోచనతో ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న అన్ని మున్సిపాల్టీలను కవర్ చేస్తూ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ (హైడ్రా)ను ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిని విస్తరిస్తుందనే ప్రచారం జరుగుతోంది. GHMC ప్రస్తుత పాలక వర్గం గడువు మరో ఏడాదికి పైగా ఉంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ లో ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లను 200కు పెంచే ఆలోచన జరుగుతోందని విశ్వసనీయ సమాచారం.

బీఆర్‌ ఎస్‌ హయంలోనే ఇందుకు ప్రయత్నాలు జరిగినా… అది వివిధ కారణాల వల్ల అమలు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందుకు భిన్నంగా ఆలోచన చేస్తోంది. జిహెచ్ఎంసి పరిధిలో డివిజన్లను పెంచడం లేక మరో రెండు లేదా మూడు కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. జిహెచ్ఎంసి ఎన్నికల నాటికి ఈ విషయంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

హైదరాబాద్ చుట్టూ ఉన్న 29 మున్సిపాల్టీల పాలక వర్గాల గడువు ఈ  వారంతో ముగుస్తోంది.  అవుటర్ రింగ్ రోడ్డు కు అటు ఇటుగా ఉన్న మున్సిపాల్టీలను ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. పిర్జాదిగూడ, బడంగ్‌పేట్‌, పెద్ద అంబర్‌ పేట తదితర మున్సిపాలిటీలను జిహెచ్‌ ఎంసిలో విలీనం చేస్తారు.

ఈ వారంలో గ్రేటర్ చుట్టూ ఉన్న 22 మున్సిపాల్టీలు, 7 మున్సిపల్ కార్పోరేషన్ల పాలకవర్గాల కాలపరిమితి ముగిసిపోతోంది.  ఈ 29 మున్సిపాల్టీల భవిష్యత్తుపై ఏం చేయాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్ ను కొంత మేరకు విస్తరించే అవకాశాలున్నాయి. కంటోన్మెంట్ లాంటి ప్రాంతాన్ని గ్రేటర్ లో విలీనం చేసుకోనున్నారు.  ఇకపోతే హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్న 29 మున్సిపాల్టీలను మరో రెండు కొత్త మున్సిపల్ కార్పోరేషన్లుగా మార్చాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం.  GHMC కి ఆనుకుని ఉన్న నిజాంపేట, జవహర్ నగర్, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, అబ్దుల్లాపూర్ మెట్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, గుండ్లపోచంపల్లి,  కొంపల్లి, ఘటకేసర్, పోచారం, దుండిగల్, తూంకుంట మున్సిపాల్టీలను కలిపి.. గ్రేటర్ మేడ్చల్ మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

అయితే సంగారెడ్డి జిల్లాలోని  బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌పూర్ మున్సిపాల్టీలను ఏం చేయాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.  గ్రేటర్ హైదరాబాద్ కు చేరువలోని మణికొండ, నార్సింగ్, బండ్లగూడ జాగీర్, శంషాబాద్, జల్ పల్లి, బడంగ్ పేట, తుక్కుగూడ, ఆదిభట్ల, తుర్కయాంజల్, ఇబ్రహీంపట్నం తదితర మున్సిపాల్టీలతో పాటు మహేశ్వరం గ్రామీణ ప్రాంతాన్ని కలుపుతూ… గ్రేటర్ మహేశ్వరం మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి… మహేశ్వరాన్ని మహానగరంగా మారుస్తానని ప్రకటించినట్లు తెలుస్తోంది.

కొత్తగా గ్రేటర్‌ హైదరాబాద్‌ లోకి తీసుకొచ్చిన పంచాయతీలను వార్డులుగా రూపొందించాలా… లేదంటే కొత్తగా మున్సిపల్‌ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలా అనే ఆంశంపై ముఖ్యమంత్రి పార్టీ సీనియర్‌ నేతలు, అధికారులతో చర్చలు జరుపుతున్నారని సమాచారం.

శ్రీశైలం రోడ్డులో ఫ్యూచర్‌ సిటీ ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వం శ్రీకారం చుట్టగా…గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అది కీలక పాత్ర పోషించబోతోంది. ఫ్యూచర్‌ సిటీ ప్రధానంగా నగరానికి ధీటుగా తీర్చిదిద్దాలని సీఎం స్వయంగా ప్రణాళికలు రూపొందించే పనిలో ఉన్నారు.

హైదరాబాద్‌ నగరంలో గతంలో దివంగత సీఎం  నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి హైటెక్‌ సిటీకి రూపకల్పన చేయగా…వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డు, విమానాశ్రయ ప్రాంత అభివృద్ధికి తోడ్పడ్డారు. అంతకు ముందు సైబరాబాద్‌ పేరుతో చంద్రబాబు ఐటి అభివృద్ధికి తన వంతు కృషి చేశారు.

హైదరాబాద్‌ పై వీరి ముద్ర తొలగించేందుకు తెలంగాణ ఏర్పడ్డాక కెసిఆర్‌ హయంలో కెటిఆర్‌ అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. అదే కోవలో తన హయంలో హైదరాబాద్‌ నగరానికి సొబగులు అద్దేందుకు రేవంత్‌ రెడ్డి తన వంతు పాత్ర పోషించే పనిలో ఉన్నారు.

ఔటర్ రింగ్ రోడ్డును ప్రమాణికంగా తీసుకుని గ్రేటర్ ను విస్తరించాలని తొలత ప్రభుత్వం భావించినా… రాజకీయ కారణాలతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మొత్తంగా  GHMC కి సమాంతరంగా గ్రేటర్ చుట్టూ మరో రెండు మున్సిపల్ కార్పోరేషన్ల ఏర్పాటుకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.  ఈ రఫ్ డ్రాఫ్ట్ అమలులోకి వచ్చేసరికి ఎన్ని మార్పులు వస్తాయో చూడాలి.

ప్రభుత్వం చివరికి ఏ నిర్ణయం తీసుకుంటుదో అటుంచితే…చోటా మోటా రాజకీయ నాయకులు అప్పుడే టికెట్ల కోసం పైరవీలు చేసుకుంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com