తిరుమల పుణ్యక్షేత్రంలో జరిగిన తొక్కిసలాట సంఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు పూర్తి వివరాలు వెల్లడించారు. అసలు ప్రమాదానికి కారణమేంటో వివరించారు. స్వామివారి దర్శనానికి పోటెత్తే భక్తుల కారణంగా ఇలాంటిదేదో జరుగుతుందని తనకు ముందే అనుమానం వచ్చిందన్నారు. దీనిపై అధికారులను అప్రమత్తం చేశానని, ఆషామాషీగా తీసుకోవద్దని హెచ్చరించానన్నారు. అయితే పోలీసు ఉన్నతాధికారులు తాము చూసుకుంటామంటూ భరోసా ఇచ్చారన్నారు. 5వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామని స్వయంగా తనకు చెప్పారన్నారు. కొందరు అధికారుల వల్లే ఈ ఘటన జరిగిందన్నారు.
అయితే, ఇప్పుడు చింతించడం తప్ప ఎవరినీ నిందించలేమన్నారు టీటీడీ చైర్మన్. వైకుంఠద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్ల జారీ కౌంటర్ల దగ్గర ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. అయితే, ఒక క్యూలైన్‌లో ఉన్న వాళ్లల్లో ఓ మహిళ అనారోగ్యానికి గురయ్యారని, ఆమెను ఆసుపత్రికి తరలించడానికి గేటు తీయాల్సి వచ్చిందని బీఆర్ నాయుడు అన్నారు. టికెట్ల జారీ సెంటర్ వద్ద ఉన్న డీఎస్పీ గేట్లు తెరవడం, ఆ వెంటనే భక్తులు తోసుకుంటూ రావడం వల్ల ఈ తొక్కిసలాట ఘటన జరిగిందని, ఈ దుర్ఘటనలో మొత్తం ఆరుగురు మరణించారన్నారు.
తిరుమలలో తొక్కిసలాటకు సంబంధించి టీటీడీ చైర్మన్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి వస్తున్నారని, గాయపడ్డవారిని పరామర్శిస్తారని తెలిపారు. అలాగే, మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తారని బీఆర్ నాయుడు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కఠినంగా ఆదేశించారని, చాలా సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారన్నారు.
ఈ విషయంపై ఇప్పటికే డీజీపీ, జిల్లా కలెక్టర్, ఎస్పీ స్థాయి అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారని, అధికారుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. అడ్మినిస్ట్రేషన్ ఇలా ఉండకూడదని, ఏర్పాట్లన్నీ పకడ్బందీగా జరగాలని చంద్రబాబు చెప్పారని పేర్కొన్నారు. లోపం క్లియర్‌గా కనిపిస్తోందని, దీన్ని చాలా తేలిగ్గా తీసుకున్నట్లు కనిపించిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు.
అయితే, తిరుమలలో ఇప్పుడు జరిగిన తొక్కిసలాట సంఘటననను ఒక పాఠంగా భావిస్తామన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని బీఆర్ నాయుడు పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశికి రెండు రోజుల ముందు ఈ ఘటన జరగడం అత్యంత దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన తరువాత బాధిత కుటుంబాలకు సహాయం చేయడం తప్ప ఏమీ చేయలేమని వ్యాఖ్యానించారు.