అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజలను కన్‌ఫ్యూజ్ చేయడంలో నెంబర్ వన్ అని చెప్పాలి. ఆయన ఆంతర్యం ఏంటన్నది ఎవరూ కనిపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అమెరికాకు దిగుమతి అయ్యే కార్లపై 25 శాతం టారిఫ్‌లు విధించిన రెండు రోజుల్లోనే కెనడా నూతన ప్రధానమంత్రి మార్క్ కార్నీకి ఫోన్ కాల్ చేశారు. అది కూడా అమెరికాతో మా స్నేహం కాస్త శత్రుత్వంగా మారుతుందంటూ ఆయన వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఈ కాల్ చేయడం మరో విశేషం. తాము రాజకీయాలతో పాటు అనేక అంశాలపై చర్చించామని.. కెనడాలో ఎన్నికలు ముగిసిన తర్వాత కలిసి చర్చిస్తామన్నారు ట్రంప్. అంతేకాదు చాలా విషయాలపై ఇరువురు అంగీకారానికి వచ్చామన్నారు.
నిజానికి ట్రంప్ ఎవరికి అర్థం కావడం లేదు అనేందుకు ఇదే పెద్ద ఉదాహారణగా చెప్పవచ్చు. ఎందుకంటే కెనడా నుంచి అమెరికాకు దిగుమతయ్యే వస్తువులపై భారీగా టారిఫ్‌లు విధించారు ట్రంప్. ఇప్పుడు కార్ల దిగుమతులపై కూడా టారిఫ్‌లు విధించడంతో కెనడాపై మరింత ఎఫెక్ట్ పడింది. దీంతో కెనడా చాలా ఘాటుగా స్పందించింది. ఈరోజుతో భద్రత, సైనిక సహకారం విషయంలో అమెరికా-కెనడాల మధ్య ఉన్న బంధం ముగిసిపోయిందన్నారు. ఈ వ్యాఖ్యలతో ట్రంప్ దిగొచ్చినట్టు కనిపిస్తోంది.
ప్రస్తుతం అమెరికాపై ప్రతీకార టారిఫ్‌లు విధించేందుకు కసరత్తులు ప్రారంభించింది కెనడా. తాము తీసుకునే నిర్ణయాలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడం ఖాయమని కూడా ప్రకటించారు ఆ దేశ ప్రధాని కార్నీ. మరిప్పుడు కెనడా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఈ తీసుకునే చర్యలు అమెరికాపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి? ట్రంప్ ఫోన్‌కాల్ ఈ చర్యలను ఆపుతుందా? లేదా? చూడాలి. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ చపలచిత్తంగా మాట్లాడటం… అప్పుడే వార్నింగ్ ఇవ్వడం వెనువెంటనే సముదాయించటం దేశ ప్రజలను…ప్రపంచ దేశాలను గందరగోళానికి గురిచేస్తోంది.