అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూపు ఇప్పుడు పనామా కెనాల్‌పై పడింది. ప్రస్తుత పరిస్థితులు ఇలానే కొనసాగితే ఏకంగా పనామా కాలువను స్వాధీనం చేసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు ట్రంప్. కాబోయే అధ్యక్షుడికి ఇంత కోపం రావడానికి ఓ కారణం ఉంది. ఈ కెనాల్ మీదుగా ప్రయాణించే అమెరికా నౌకలకు చార్జ్ ఎక్కువగా వసూలు చేస్తున్నారనేది ఆయన ఆరోపణ. దీనికి సంబంధించి ఆయన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెట్టారు. తమ దేశ ఆర్థిక వ్యవస్థ, జాతీయ భద్రతకు పనామా అనేది చాలా ముఖ్యం. ఈ కెనాల్ మీదుగా ప్రయాణించే యూఎస్ నౌకలకు పనామా ప్రభుత్వం వసూలు చేస్తున్న చార్జ్‌లు హాస్యస్పదంగా ఉన్నాయి. పనామా కాలువ ఆపరేషన్ సురక్షితంగా ఉందని నిర్ధారించడంలో పనామా విఫలమైతే దానిని యూఎస్ కంట్రోల్‌లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తాం.. ఇది ట్రంప్ పోస్ట్ అర్ధం.
ఇక్కడ కూడా చైనా ప్రస్తావన తీసుకొచ్చారు ట్రంప్. ఈ కెనాల్‌ను పనామా నిర్వహిస్తుండటంతో చైనా ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తోందన్నారు. అదే జరిగితే అమెరికా జాతీయ, ఆర్థిక ప్రయోజనాలకు ప్రమాదం ఉందన్నారు. విదేశీ శక్తులు అస్సలు ఇక్కడ కార్యకలాపాలు చేపట్టకూడదన్నారు. పనామా చేతుల్లోనే పూర్తి హక్కులు ఉండాలని.. ఇతర దేశాల చేతుల్లోకి వెళ్లకూడదన్నారు.
నిజానికి ప్రపంచ వాణిజ్యంపై పనామా కాలువ చాలా ముఖ్య పాత్ర పోషిస్తోంది. 82 కిలోమీటర్ల పొడవుండే ఈ కాలువ అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రాన్ని కలుపుతుంది. ఈ కెనాల్ మీదుగా గ్లోబల్ ట్రేడ్‌లో 6 శాతం జరుగుతుంది. అయితే అదే అమెరికా విషయానికి వస్తే అది 14 శాతం అని చెప్పాలి. నిజానికి ఈ కాలువపై మొదట అమెరికాదే గుత్తాధిపత్యం. ఎందుకంటే ఈ కాలువను 1881లో ఫ్రాన్స్ నిర్మించగా.. 1914లో అమెరికానే పూర్తి చేసింది. అప్పటి నుంచి అమెరికానే ఈ కాలువను కంట్రోల్ చేసేది. అయితే 1999లో ఒక ఒప్పందం ప్రకారం కాలువ నియంత్రణను పనామా ప్రభుత్వానికి అప్పగించింది. దీనిని ఇప్పుడు పనామా కెనాల్ అథారిటీ నిర్వహిస్తోంది. అయితే రీసెంట్‌గా పనామాపై చైనా పట్టు బిగిస్తోందన్న ప్రచారంతో ట్రంప్ ఇలా రియాక్ట్ అయ్యారని తెలుస్తోంది.