ఇప్పటికే తన చేతుల నుంచి దేశం చేజారిపోవడంతో ప్రాణభయంతో రష్యాకు పరుగులు తీసిన సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్‌కు.. ఇప్పుడు మరో షాక్ తగిలినట్టు తెలుస్తోంది. ఆయన భార్య అస్మా అల్ అస్సాద్ విడాకులకు అప్లే చేశారు. ఇప్పటికే ఈ అప్లికేషన్‌ను రష్యన్ అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె అస్సాద్‌కు దూరంగా లండన్ షిఫ్ట్ అయిపోవాలనే ఆలోచనలో ఉన్నారట. దేశం వదిలిపెట్టి వెళ్లేందుకు కూడా ఆమె ఇప్పటికే రష్యన్ అధికారులను కోరినట్టు తెలుస్తోంది.
నిజానికి అస్మా బ్రిటిష్-సిరియన్ జాతీయురాలు. ఆమె పుట్టింది కూడా లండన్‌లోనే. 2000 సంవత్సరంలో అస్సాద్‌ను పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ఆమె సిరియాలోనే ఉన్నారు. 24 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన అస్సాద్ తాజాగా తిరుగుబాటు దారుల దెబ్బకు దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం అతని కుటుంబం రష్యాలో ఆశ్రయం పొందుతుంది. అయితే అతనిపై రష్యా కొన్ని ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది. అతను దేశం విడిచి వెళ్లడమే కాకుండా.. ఎలాంటి రాజకీయ సంబంధాలను కొనసాగించకుండా చర్యలు తీసుకుంటుంది. అంతేకాదు అతనికి సంబంధించిన ఆస్తులు, సంపదను కూడా ఫ్రీజ్ చేసినట్టు తెలుస్తోంది. 270 కిలోల బంగారం, 2 బిలియన్ డాలర్లు, 18 అపార్ట్‌మెంట్లను సీజ్ చేసినట్టు సమాచారం. అంతేకాదు అస్సాద్ సోదరుడు మెహర్ అల్ అస్సాద్‌కు మాత్రం రష్యా పునరావాసం కల్పించలేదని తెలుస్తోంది. ప్రస్తుతం అతను హౌస్ అరెస్ట్‌లో ఉన్నాడని కొన్ని కథనాలు చెబుతున్నాయి.
ఏదేమైనా ఇన్నాళ్ల పాటు అస్సాద్‌కు తోడుగా ఉన్న అస్మా.. ఇప్పుడు అక్కడి లైఫ్ స్టైల్ నచ్చక అతడిని వీడి వెళ్లాలనుకోవడం పెద్ద షాకే అని చెప్పాలి. నిజానికి వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మరి వారితో కలిసి వెళ్లేందుకు అస్మా అనుమతి అడుగుతున్నారా? లేక ఆమె ఒక్కరే లండన్ వెళ్లాలనుకుంటున్నారా? అనేది మాత్రం క్లారిటీ లేదు.