సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్మిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. అయితే, ఈ పనుల నేపథ్యంలో ప్రయాణికులకు కొన్ని అసౌకర్యాలు తప్పడం లేదు. స్టేషన్ ఆధునీకరణ కారణంగా పలు రైళ్లు చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి వంటి సమీప ఇతర స్టేషన్లకు మళ్లించడంతో ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు.
ఎటువంటి సమాచారం లేకుండా ఏ రైలు ఎక్కడి నుండి బయలుదేరుతుందన్న సందిగ్ధంతో ప్రయాణీకులు అయోమయంలో పడుతున్నారు. ముఖ్యంగా చర్లపల్లి టెర్మినల్‌కి చేరుకోవడం ఓ పెద్ద ప్రహసనంగా మారుతోంది. కొన్ని ఎంఎంటీఎస్ రైళ్లు, ఆర్టీసీ బస్సులు నడుస్తున్నా, సమయానికి అక్కడికి చేరటం చాలా మందికి కష్టంగా మారింది. ఇక, రాత్రి వేళల్లో చర్లపల్లికి వివిధ ప్రాంతాల నుంచి రైళ్లలో చేరుకుంటున్న ప్రయాణీకులు.. అక్కడి నుండి తిరిగి ఇళ్లకు చేరడం కూడా ఓ పెద్ద సవాల్‌గా మారుతోంది.
చర్లపల్లి వరకే రైళ్లు నడుస్తున్నాయన్న విషయం చాలామందికి తెలియక పోవడంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వస్తున్నారు. చర్లపల్లికి వెళ్లాలని అక్కడ సిబ్బంది సూచిస్తుండటంతో అప్పటికప్పుడు చర్లపల్లి వెళ్లడం సాధ్యం కావడం లేదు. అక్కడికి వెళ్లడానికి సరైన బస్సు సదుపాయాలు గానీ, ఇతర ప్రయాణ సదుపాయాలు లేక పోవడంతో ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సమయానికి క్యాబ్‌లు కూడా బుక్ కావడం లేదని ప్రయాణీకులు గగ్గోలు పెడుతున్నారు. ఇక, ఆ సమయంలో ఆటో డ్రైవర్లు ఎంత డిమాండ్ చేస్తే అంత చెల్లించాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంటోందంటున్నారు. లేదంటే రైలు మిస్సయితే అసలుకే ఎసరు వస్తుందని అంగీకరించాల్సి వస్తుందంటున్నారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రతిరోజూ సుమారు 250 జతల రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే, ప్రస్తుతం స్టేషన్ ఆధునీకరణ నేపథ్యంలో ఆరు జతల రైళ్లు శాశ్వతంగా చర్లపల్లి వరకే పరిమితం చేయగా.. మరో 26 జతల రైళ్లను తాత్కాలికంగా ఇతర స్టేషన్ల మీదుగా మళ్లిస్తున్నారు.
చర్లపల్లికి మళ్లించిన ముఖ్యమైన రైళ్ల వివరాలు చూస్తే…
– తిరుపతి – ఆదిలాబాద్
– లింగంపల్లి – కాకినాడ టౌన్
– కాజిపేట – హదాప్సర్
– లింగంపల్లి – విశాఖపట్టణం
– సంబల్పూర్ – నాందేడ్
– విశాఖపట్టణం – నాందేడ్
– నర్సాపూర్ – నాగర్సోల్
– వాస్కోడిగామా – జస్దిహ్
– మచిలీపట్నం – సాయినగర్ షిర్డీ
– విశాఖపట్టణం – ఎల్టీటీ ముంబై
ప్రయాణీకులు ఇప్పటికైనా మళ్లించిన రైళ్ల వివరాలు ముందుగానే తెలుసుకొని సంబంధిత రైల్వేస్టేషన్‌కు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.