29.7 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

టెక్నాలజీకి దూరం… అడవులే ఆధారం

పహల్గాంలో దాడి చేసిన వారిలో ఏడుగురిలో స్థానిక ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. విదేశీ ఉగ్రవాదులు మాట్లాడిన ఉర్దూ పాకిస్తాన్‌కు చెందింది. వారితో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా సంస్థకు చెందిన ఓ అధికారి తెలిపారు. అధికారులు బుధవారం ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్‌లను విడుదల చేశారు. వారి సమాచారం ఇచ్చిన వారికి ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున రివార్డు ప్రకటించారు. నిందితుల్లో గతేడాది IAF కాన్వాయ్‌పై జరిగిన దాడిలోనూ ఓ అనుమానితుడి హస్తం ఉన్నట్లు ఉన్నత వర్గాలు భావిస్తున్నాయి. మిగతా ఇద్దరు కుల్గాంలోని బిజ్‌బెహారా, థోకెర్‌పోరాకు చెందినవారని భావిస్తున్నారు. వీరు 2017లో పాకిస్తాన్‌కు వెళ్లి గత ఏడాదే తిరిగి జమ్మూకి వచ్చారు. వారు పాకిస్తాన్‌లో శిక్షణ పొందారని సమాచారం. ఆ ఇద్దరు ఉగ్రసంస్థ జైష్-ఎ-మొహమ్మద్‌తో సంబంధం కలిగి ఉన్నారు. ఈ దాడి అమలు చేయడానికి లష్కరే-ఎ-తోయిబా, జైష్‌తో పొత్తు పెట్టుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు కేంద్ర నిఘా సంస్థ వెల్లడించింది.

దాడి అనంతరం ఉగ్రవాదులంతా పిర్ పంజాల్ శ్రేణిలోని ఎత్తైన ప్రాంతాలకు పారిపోయారు. సైన్యం, కేంద్ర పారామిలిటరీ దళాలతోపాటు జమ్మూకశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. దాడి చేసిన వారు బాడీ కెమెరాలతో చిత్రీకరించి ఉంటారని పోలీసులు తెలిపారు. గత మూడేళ్లలో జమ్మూలో జరిగిన అన్ని దాడుల్లోనూ బాడీ, గన్-మౌంటెడ్ కెమెరాల ద్వారా వీడియోలు చిత్రీకరించారు. ఈ వీడియోలను వేర్పాటువాద ప్రచారానికి వినియోగిస్తున్నారు. దాడి చేసిన వ్యక్తులు కాశ్మీర్‌లోకి ఎలా ప్రవేశించారో, వారు ఎంతకాలంగా లోయలో ఉంటున్నారో తెలియరాలేదు. సరిహద్దుల్లోని పరిస్థితులను ఆధారం చేసుకుని ముష్కరులు దేశంలోకి ప్రవేశించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. కానీ ఇందుకు సంబంధించి ఖచ్చితమైన ఆధారాలు లభించలేదు.

ఏజెన్సీలు వివరాలను ధృవీకరించే పనిలో పడ్డాయి. బుధవారం ఘటనా స్థలానికి NIA అధికారుల బృందం చేరుకుంది. దర్యాప్తును స్థానిక పోలీసుల నుంచి ఏజెన్సీ స్వీకరించే అవకాశం ఉంది. స్థానిక పోలీసులు సహాయం అందించాలని, సాక్షులందరి వాంగ్మూలాలను పరిశీలించాలని ఓ అధికారి తెలిపారు. బాధితుల్లో ఎక్కువ మందిని తల, ఛాతీపై కాల్పులు జరిపారు. 12 మంది బాధితుల తలలకు బుల్లెట్‌ గాయాలున్నాయి. వీటిని ‘కోల్డ్ బ్లడెడ్ హత్యలు’ అంటారని ఓ అధికారి తెలిపారు. అడవి నుంచి వచ్చి.. మారణహోమం ముగిసిన తర్వాత తిరిగి అడవిలోకి వెళ్లారు. దాడి సమీపంలో నంబర్ ప్లేట్ లేని బైక్‌ కనిపించింది. కానీ ఉగ్రవాదులు పారిపోయే సమయంలో దీనిని ఉపయోగించలేదని దర్యాప్తు అధికారులు తెలిపారు.

పహల్గామ్ ఘటనా స్థలం హపట్నార్‌ను మరోవైపు చందన్‌వారీకి అనుసంధానించే దట్టమైన అటవీ ప్రాంతం. అడవులనే ఉగ్రవాదులు ఆసరాగా చేసుకుని దాడికి తెగబడ్డారు. ఇలాంటి రద్దీ టూరిస్ట్ ప్లేస్‌లో భద్రతా చర్యలు ఎందుకు చేపట్టలేదనే విమర్శలు వస్తున్నాయి. నిజానికి, ఉగ్రవాదుల కదలికలు పసిగట్టడం అంత తేలికకాదు. ముష్కరమూకలు చిన్న సమూహాలుగా పనిచేస్తుంటారు. మైనస్ 10 డిగ్రీల సెల్సియస్ వాతావరణం ఉన్నా అడవుల నుంచి వారు బయటకు రారు. ఎటువంటి ఎలక్ట్రానికి గాడ్జెట్‌లను ఉపయోగించరు. అందుకే సాంకేతికత ద్వారా వివరాలు సేకరించే అవకాశం లేదు. వారు స్థిరంగా ఓ చోట ఉండరు. తమ స్థావరాలను ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటారు.

ఉదాహరణకు.. సోనామార్గ్ శిఖరాలపై ఉగ్రవాదుల గుంపు ఉన్నట్లు సమాచారం అందితే అధికారులు స్పందించేలోపు ఉగ్రమూక వేరే ప్రాంతానికి తరలివెళ్లిపోతారు. ఇదంతా చేసేందుకు వారికి అడవులే ఆధారం. బైసరన్ పర్వతాలు, దట్టమైన అడవులు ఉగ్రవాదులకు ఆశ్రయంగా మారాయి. అడవుల గుండా కోకర్నాగ్, కిష్త్వార్ వైపు గానీ లేదంటే బాల్టాల్, సోనామార్గ్ వైపుగానీ వెళ్లే అవకాశం ఉంది. ఉగ్రవాద కార్యకలాపాల స్థలాకృతి చూస్తే.. కిష్టవార్ పర్వతాలు, వాగులు, వంకలు, లోయలు, దట్టమైన అడవుల ద్వారా జమ్మూలోని కథువాకు అనుసంధానించబడిన దోడా వరకు ఉన్నాయి. ఇటీవల కాలంలో కథువా ద్వారా చొరబాట్లు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com