ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా ప్రచారం పొందిన కాళేశ్వరం పథకం అవకతవకల ఆరోపణలతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. లక్ష్మీ బ్యారేజ్ కుంగిన ఘటన, అన్నారం బ్యారేజ్ వద్ద బుంగ పడిన అంశాలు ఈ ప్రాజెక్టుపై అనేక అనుమానాలకు దారితీశాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓటమి పాలై, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన విచారణ కమిషన్ రెండో దశ దర్యాప్తును ప్రారంభించింది. ఇప్పటికే ప్రాథమిక విచారణను పూర్తి చేసిన కమిషన్, ఇప్పుడు మరింత లోతైన అంశాలపై దృష్టి సారిస్తోంది.
ఈ రెండో దశ విచారణలో… మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై ప్రత్యేకంగా విచారణ జరగనుంది. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో చేసిన ఖర్చులు, ఒప్పందాలు, పనుల నాణ్యత తదితర అంశాలపై సమగ్ర పరిశీలన జరగనుంది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి నీటిపారుదల మంత్రి హరీశ్ రావులకు నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది. సీడబ్ల్యూపీఆర్‌ఎస్, విజిలెన్స్ నివేదికలు ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగనుంది.
మరోవైపు.. సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC), రాష్ట్ర విజిలెన్స్ శాఖ సమర్పించిన నివేదికలు ప్రభుత్వం వద్దకు చేరాయి. ఈ నివేదికల ఆధారంగా.. ఇంజనీర్లు, అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను కమిషన్ విచారించనుంది. ఆ తర్వాత ముఖ్యమైన రాజకీయ నాయకులను హాజరు కావాలని నోటీసులు జారీచేసే అవకాశం కనిపిస్తోంది. ఈ విచారణ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. విచారణ వేగం పుంజుకోవడంతో ఏప్రిల్ 27న నిర్వహించనున్న బీఆర్‌ఎస్ సభకు ఆటంకం కలగవచ్చు అన్న ప్రచారం జరుగుతోంది.
ప్రభుత్వ వర్గాల వెర్షన్ ప్రకారం… ఈ విచారణ ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు కీలకంగా మారనుంది. కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటున్నారు. కమీషన్ దర్యాప్తులోని తుది నిర్ణయాలు, బాధ్యుల గుర్తింపు.. రాష్ట్ర రాజకీయాలపైనా, ప్రభుత్వం పరిపాలనా తీరుపైనా గణనీయ ప్రభావం చూపనున్నాయి.