ఆర్థికంగా అవస్థలు, రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న పాకిస్థాన్‌కు భారీ షాక్ తగిలింది. బెలుచిస్థాన్ ప్రావిన్స్‌లో తిరుగుబాటుదారులు ఏకంగా ఓ రైలునే హైజాక్ చేశారు. బెలుచిస్థాన్ రాజధాని క్వెట్టా నుంచి ఖైబర్ పంఖ్తుఖ్వా రాజధాని పెషవార్ మీదుగా పంజాబ్ వెళ్తున్న రైలును బెలూచ్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేసిందని సమాచారం. జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులో సైనికులు, పోలీసులు, ఐఎస్‌ఐ అధికారులు, తీవ్రవాద వ్యతిరేక బలగాలు ఉన్నాయనే రైలుపై తిరుగుబాటుదారులు దాడి చేశారని స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి.
రైలులో సుమారు 400 మంది ప్రయాణికులు ఉన్నారని, వారందరినీ సమీపంలోని కొండ ప్రాంతాల్లోకి తీసుకెళుతున్నారని ప్రాథమిక సమాచారం. బెలుచిస్థాన్‌లో బెలూచ్ లిబరేషన్ ఆర్మీ, ఖైబర్ పంఖ్తుఖ్వాలో తేహ్రిక్ ఏ తాలిబాన్ పాకిస్థాన్(TTP) బలంగా ఉన్నాయి. రెండు గ్రూపులు సమన్వయంతో దాడికి దిగటంతో పాక్ బలగాలు వారిని నిలువరించలేక పోయాయి. ఈ ఘటన నేపథ్యంలో బెలుచిస్థాన్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. పాక్ సైనిక బలగాలు ఘటనా ప్రాంతానికి చేరుకుంటున్నాయి.
ఈ దాడికి పాల్పడింది BLAకు చెందిన మజీద్ బ్రిగేడ్, ఫతే స్క్వాడ్ అని ప్రకటించింది. బందీలను విడిపించేందుకు ఏదైనా చర్యలు తీసుకుంటే తగిన గుణపాఠం చెబుతామని వార్నింగ్ ఇచ్చింది BLA. అంతేకాదు ఇకపై బలూచిస్థాన్‌లో ఎలాంటి మిలటరీ ఆపరేషన్ నిర్వహించకూడదని వార్నింగ్ ఇచ్చింది. వీటిలో ఏది జరిగినా బంధీల ప్రాణాలు పోతాయంది.
సహజ వనరులకు ప్రసిద్ది గాంచిన బెలుచిస్థాన్‌లో అభివృద్ధి జరగటం లేదని… సంపద కొల్లగొడుతున్న పాకిస్థాన్… నిధులు కేటాయించటం లేదని తిరుగుబాటుదారులు ఆరోపిస్తున్నారు. ఉగ్రవాద ముద్ర వేసి ఉద్యమం చేస్తున్న నాయకులను హతమార్చటం సాధారణం అయింది. దీంతో స్థానికుల్లో అసంతృప్తి పెల్లుబికి ప్రజలు తిరుగుబాటుకు సిద్దమయ్యారు. ఇటీవలే బలూచ్ లిబరేషన్ ఆర్మి, బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ విలీనమయ్యాయి. వెనువెంటనే ఖుజ్దర్‌లో ఐదుగురు పాక్ సైనికులను తిరుగుబాటుదారులు హతమార్చారు.
బలుచిస్థాన్‌లో చైనా అభివృద్ధి చేసిన గ్వదార్ ఓడరేవులో స్థానికులకు ఉపాధి ఇవ్వటం లేదని కొన్నేళ్లుగా బలూచ్ తిరుగుబాటుదారులు చైనా కంపెనీల ఉద్యోగులపై దాడులు చేసి హతమారుస్తున్నారు. పాక్ సైనికులు ఎక్కడ తారసపడ్డా మెరుపు దాడులు చేసి చంపుతున్నారు. తాజాగా రైలు హైజాక్ ఘటన పాక్ ప్రభుత్వానికి సవాల్‌గా మారింది.