విశాఖపట్నం బీచ్‌కి వచ్చేది టీ కాఫీలు తాగడానికి కాదని ఎంజాయ్ చెయ్యడానికి వస్తారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. విశాఖపట్నంలో జరిగిన పర్యాటక రంగ పెట్టుబడిదారుల సదస్సులో అయ్యన పాత్రుడు మాట్లాడుతూ పర్యాటకులు వైజాగ్‌రి వైన్ తాగడానికి కాకపోతే కాఫీతాగడానికి వస్తారా అని ప్రశ్నించారు. టూరిజం అభివృద్ధి చెందాలంటే విశాఖ బీచ్‌లో కూడా విదేశీ తరహాలో చిన్న చిన్న గుడెసెలు నిర్మించి అందులో బీర్లు, డ్రింకులు, స్నాక్స్ ఇచ్చేలా ఏర్పాటు చేయాలని అయ్యన్న సూచించారు. గోవా, బెంగుళూరు వంటి నగరాలతో పోలిస్తే విశాఖను ఎందుకు పర్యాటకపరంగా అభివృద్ధి చేసుకోలేకపోతున్నామో ఆలోచించాలన్నారు. పర్యాటకులకు ఎంటర్‌టైన్మెంట్ కావాలని అది మనం ఇక్కడ ఇవ్వగలుగుతున్నామా అని స్పీకర్ అన్నారు. నిబంధనలు అంటూ పర్యాటకుల స్వేచ్ఛని నియంత్రించాలని చూస్తే టూరిస్టులు రారని తెలిపారు. ఇద్దరు కలసి బీచ్‌లో కూర్చుంటే కేసులు పెడుతున్నారని ఆ పద్దతి మారాలన్నారు. ఏ వ్యవస్ధలో అయిన నిబందనలు అవసరమే కానీ పర్యాటకరంగం అభివృద్ధి చెందాలంటే కొన్ని వెసులుబాట్లు కూడా ఉండాలని అయ్యన్నపాత్రుడు సూచించారు. మన రాష్ట్రంలో అపారంగా ప్రకృతి వనరులు ఉన్నా టూరిజం మాత్రం ఆశించిన స్ధాయిలో అభివృద్ధి చెందడం లేదన్నారు. మన లంబసింగికి దేశం నలులు మూలల నుంచి పర్యాటకులు వస్తున్నారని కానీ అందుగు తగ్గట్లుగా అక్కడ వసుతులు ఏర్పాటు చేయడంలో విఫలమవుతున్నామన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో స్థానికులే పెట్టుబడులు పెట్టాలన్న నిబంధనను కొంత సడలించాలని స్పీకర్ అభిప్రాయపడ్డారు. కోట్ల రూపాయల పెట్టుబడులు గిరిజనలు పెట్టలేని పరిస్ధితుల్లో గిరిజన చట్టాల్లో మార్పులు చేయాలని అయ్యన్న సూచించారు. మన దగ్గర ఏవైనా ప్రాజెక్టుల అనుమతులకు అప్లై చేస్తే అవునో కాదో చెప్పడానికే సంవత్సరాలు తిప్పుతున్నారని అన్నారు.
- Advertisement with us -