ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను రేపు శాసన సభలో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు బడ్జెట్ రూపకల్పన పూర్తయ్యింది. బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టే ముందుగా కేబినెట్ సమావేశం జరుగుతుంది. కేబినెట్లో బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీలో, శాసన మండలిలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.
అసెంబ్లీలో ఉదయం పది గంటలకు రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఆర్థిక బడ్జెట్ తర్వాత వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెడతారు. అలాగే, శాసన మండలిలో బడ్జెట్‌ను మంత్రి కొల్లు రవీంద్ర సమర్పిస్తారు. మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి నారాయణ ప్రవేశపెడతారు.
తొమ్మిది నెలల క్రితం బాద్యతలు చేపట్టిన కూటమి ప్రభుత్వం ఈ సారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడుతోంది. బడ్జెట్‌కు సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలుసార్లు సమీక్షలు నిర్వహించారు. ఈ బడ్జెట్లో సంక్షేమం – అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక, సూపర్ సిక్స్ పథకాలకు తాజా బడ్జెట్లో కేటాయింపులు అధికంగా చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు.. కేంద్రం ప్రాయోజిత కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ దాదాపు 3.25 లక్షల కోట్ల అంచనాలతో ఉండే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా రూ.5వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ఉంటుందని భావిస్తున్నారు.
సూపర్ సిక్స్ పథకాల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం 2.0, సామాజిక భద్రతా పెన్షన్లు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ కీలకమైనవి. వీటిలో కొన్నింటిని ఇప్పటికే అమలు చేస్తున్నారు. మరికొన్నింటిని త్వరలోనే అమలు చేస్తామని ప్రకటించారు. ఈ హామీల అమలుకు భారీగా నిధులు కేటాయించాల్సి ఉంటుంది. తల్లికి వందనం పథకం కింద ప్రతీ తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇవ్వాల్సి ఉంది. ఈ పథకం అమలు కోసం తాజా లెక్కల మేరకు రూ.69.16 లక్షల మంది అర్హులుగా గుర్తించారు. ఒక్కో బిడ్డ కోసం తల్లుల ఖాతాల్లో ఏడాదికి రూ.15వేలు చొప్పున ఆర్ధిక సాయం చేయాల్సి ఉంది. దీనికోసం సుమారు రూ.10,300కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. మే నెలలో ఈ పథకం అమలు చేస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
అదే విధంగా అన్నదాత సుఖీభవ పథకం పైనా ప్రకటన చేసారు. ఈ పథకం ద్వారా ప్రతీ రైతుకు ఏటా ఇస్తామని చెప్పిన హామీ మేరకు రూ.20 వేలు ఇవ్వాల్సి ఉంది. అన్నదాత సుఖీభవ పథకం కోసం రాష్ట్రంలో అర్హత ఉన్న రైతుల సంఖ్య 53.58 లక్షలుగా అధికారులు తేల్చారు. ఒక్కో రైతుకు రూ.20 వేలు చొప్పున చెల్లించేందుకు కావాల్సిన మొత్తం రూ.10,717 కోట్లు అవసరమని లెక్క వేసారు. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే ఆరు వేలు మినహాయించటం ద్వారా ఒక్కో రైతుకు ఏడాదికి రూ 14 వేలు చొప్పున చెల్లించనున్నారు. ఇందుకోసం కావాల్సిన మొత్తం 7,502 కోట్లుగా తేల్చారు. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో చెల్లించేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. ఇక, రాష్ట్ర ఆర్దిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం బడ్జెట్ శాఖల వారీగా కేటాయింపులు చేయనుంది.